logo

త్రీర సుందరీకరణకు సన్నాహాలు

పర్యాటకానికి మరో కొత్త ఆకర్షణను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తీర రాజధానుల్లో చెన్నైని ప్రత్యేకంగా చూపించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది.

Published : 25 Jan 2023 00:08 IST

31 కి.మీ మేర వృద్ధి చేయనున్న సీఎండీఏ
ఫిబ్రవరి నెలాఖరుకు ప్రతిపాదనలు పూర్తి

మెరీనా తీరం

పర్యాటకానికి మరో కొత్త ఆకర్షణను తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. తీర రాజధానుల్లో చెన్నైని ప్రత్యేకంగా చూపించేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది. చెన్నై మెరీనా తీరం నుంచి కోవలం బీచ్‌ దాకా మధ్యలో ఉన్న అన్ని బీచ్‌లను కలపడంతో పాటు వాటన్నింటినీ అందంగా తీర్చిదద్దనుంది. ఒక్కో బీచ్‌లో ఒక్కో ప్రత్యేకత తీసుకురానుంది. ఈ మేరకు ప్రభుత్వంలో చర్చలు కొనసాగుతున్నాయి.

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే, ఆర్కేనగర్‌

చెన్నై ఉత్తర ప్రాంతమైన ఎన్నూరు నుంచి కోవలం బీచ్‌ వరకు 51 కి.మీ తీరాన్ని ప్రత్యేకాకర్షణలతో వృద్ధి చేయాలనేది ప్రభుత్వ ప్రతిపాదన. ఇందులో భాగంగా తొలి విడతలో మెరీనా బీచ్‌ నుంచి కోవలం దాకా వృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చెన్నై మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్ అథారిటీ (సీఎండీఏ) ఏర్పాట్లు చేస్తోంది. మెరీనా నుంచి కోవలం మధ్య ఉన్న అన్ని బీచ్‌లను కలుపుతూ, ప్రత్యేక పర్యాటక హబ్‌గా తయారుచేస్తూ ప్రతిపాదనలు చేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో 31 కి.మీ తీరం అత్యంత సుందరంగా కనిపించే అవకాశాలున్నాయి.

అలలపై సర్ఫింగ్‌ చేస్తున్న ఓ బాలుడు

నిబంధనలు పాటిస్తూ ముందుకు

కమిటీ పరిశీలన అనంతరం ఫిబ్రవరి నెలాఖరులోపు ప్రతిపాదనల్ని పూర్తిచేసి ముందుకెళ్లాలని సీఎండీఏ భావిస్తోంది. ఆయా జోన్లను వృద్ధి చేసేందుకు సంబంధిత శాఖల్ని కలుపుకొని వెళ్లనున్నారు. సీఎండీఏ ఆయా శాఖల్ని సమన్వయం చేసుకోనుంది. ఈ ప్రాజెక్టుల్ని చేపట్టడం కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్పీవీ)ని ఏర్పాటుచేయనున్నారు. ఏజెన్సీ నియామక బాధ్యతల్ని సీఎండీఏ చేపట్టనుంది. ప్రతిపాదనలు, అనుమతులు వచ్చాక టెండర్లకు వెళ్లాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు ధ్రువీకరించాయి. నిధుల్ని ప్రపంచబ్యాంకు నుంచి తీసుకోవాలని ఆలోచనలు చేస్తున్నారు. సీఆర్‌జెడ్‌ నిబంధనల్ని పాటిస్తూ ముందుకెళ్తామని చెబుతున్నారు. తీరంలో ప్రాజెక్టులు తేవడంవల్ల కలిగే పర్యావరణ నష్టాల్ని కూడా అంచనా వేస్తున్నారు. కాలుష్యం పరిస్థితుల్నీ గమనిస్తున్నారు. తీరం భద్రత, పర్యావరణహితం, పర్యాకట ఆకర్షణల కోణంలో తాజా ప్రతిపాదనలతో వీలైనంత తక్కువ నష్టాలతో ముందుకెళ్లాలని చూస్తున్నారు. ఇదంతా చాలా శాస్త్రీయంగా జరగాల్సిన అవసరముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మార్పుతో కొత్త అనుభూతి

ప్రస్తుత పరిస్థితుల్ని గమనిస్తే.. మెరీనా నుంచి కోవలం మధ్య మెరీనా, ఎలైట్, కోవలం మాత్రమే ప్రముఖంగా ఉన్నాయి. ఎక్కువమంది పర్యాటకులు ఇక్కడికే వస్తుంటారు. మరో 20 బీచ్‌లు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదు. ఇక్కడ బీచ్‌లు ఏర్పాటుపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే ఆకర్షణీయ తీరంగా చెన్నై మారుతుందనడంలో సందేహంలేదని చెబుతున్నారు. చెన్నై మెరీనాతో పాటు పరిసర తీర ప్రాంతాలకు బ్లూఫ్లాగ్‌ ధ్రువీకరణ పొందాలని ప్రభుత్వం ఉత్సాహంగా ఉంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్రంలో కోవలం బీచ్‌ మాత్రమే ఆ స్థాయిని పొందింది. ఇతర తీరాల్ని ఆ స్థాయికి తేవడానికి రూ.100 కోట్లు ఖర్చుపెట్టేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీనికి సంబంధించి గతేడాదే సీఎండీఏ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.

మెరీనా సమీపంలో ఒడ్డున ఉన్న పడవలు

5 ప్రత్యేక జోన్లు

* తొలి విడతలో చేపట్టే 31 కి.మీ తీర అభివృద్ధిలో పలు ప్రత్యేకతలు రానున్నాయి. ఈ ప్రాంతాల్ని ఆయా ఆకర్షణలకు అనుగుణంగా మొత్తం 5 జోన్లుగా విభజిస్తున్నారు.

* ఇందులో.. చారిత్రక కట్టడాలున్నచోట్ల వాటి వన్నె పెరిగేలా తీర్చిదిద్దుతున్నారు. ఆరోగ్య, వ్యాయామ కేంద్రాలుండేలా బీచ్‌లు తీసుకొస్తున్నారు. ఇందులో ప్రధానంగా సైక్లింగ్‌, నడకబాటలు రాబోతున్నాయి. పలు క్రీడలకు కూడా అవకాశం ఇవ్వనున్నారు. పైగా స్థానికుల ఉపాధిని బట్టి పలు ఆరోగ్య ప్రధానంగా కేంద్రాలు చేపట్టనున్నారు.

* పర్యావరణహిత ప్రాంతాలుగా కొన్ని బీచ్‌లను తీర్చిదిద్దనున్నారు. కళలు, సంప్రదాయాల పరంగా మరికొన్ని బీచ్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు.

కోవలం బీచ్‌

* ప్రత్యేకించి కోవలం లాంటి బీచ్‌లో జలక్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. చెన్నై తీరంలో సముద్రం చురుగ్గా ఉండటంతో ఈ తరహా ఆటలకు కాస్త తక్కువగానే పరిచయం చేస్తున్నారు. ఈ ప్రాంతానికి అనువుగా ఉండేవాటినే పరిచయం చేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

* ఈ తరహా 5 జోన్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీని వేయనున్నారు.

* మరోవైపు ప్రతిపాదిత తీరం వెంబడి అధికారుల అంచనాల ప్రకారం 26 మత్స్యకార వర్గాలున్నాయి. మత్స్యకారుల కోసం ప్రత్యేక జెటీల్ని కూడా ఏర్పాటుచేయనున్నారు.

* కొన్నిచోట్ల బ్యాటరీ వాహనాలు ఏర్పాటుచేసి, వాటికోసం బాటలు కూడా వేయనున్నట్లు మరో ఆలోచనగా ఉందని అంటున్నారు.
 

Read latest Tamilnadu News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని