logo

ఘనంగా గణతంత్ర వేడుకలు

ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో 74వ గణతంత్ర దిన వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఐసీఎఫ్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకలలో జనరల్‌ మేనేజరు బీజీ మాల్యా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు.

Updated : 27 Jan 2023 06:05 IST

* విల్లివాక్కం: ధర్మపురి కలెక్టర్‌ శాంతి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో 74వ గణతంత్ర దిన వేడుకలు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఐసీఎఫ్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకలలో జనరల్‌ మేనేజరు బీజీ మాల్యా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆర్ఫీఎఫ్‌ కవాతును తిలకించారు.  
విల్లివాక్కం, న్యూస్‌టుడే: ధర్మపురి జిల్లా యంత్రాంగం తరఫున గురువారం ఉదయం జిల్లా క్రీడా మైదానంలో వేడుకలు నిర్వహించారు. కలెక్టర్‌ శాంతి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల కవాతు తిలకించి ఉత్తమ సేవలందించిన అధికారులకు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు, పలువురు లబ్ధిదారులకు సంక్షేమ సాయం అందజేశారు. అదేవిధంగా కరూర్‌ జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ ప్రభుశంకర్‌ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసు కవాతు తిలకించారు.

విల్లివాక్కం, న్యూస్‌టుడే: ఐసీఎఫ్‌ సిల్వర్‌ జూబ్లీ నర్సరీ, ప్రైమరీ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు విద్యుల్లత సమక్షంలో నిర్వహించిన వేడుకలలో పాఠశాల మేనేజరు, కరస్పాండెంట్‌, ఐసీఎఫ్‌ డిప్యూటీ సీఎంవో (నాణ్యత) విజయభాస్కర్‌ పాల్గొని జెండా ఎగురవేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

దక్షిణ రైల్వేలో...

వడపళని, న్యూస్‌టుడే: దక్షిణ రైల్వే ఆధ్వర్యంలో పెరంబూరు రైల్వే మైదానంలో జరిగిన కార్యక్రమానికి జనరల్‌ మేనేజరు ఆర్‌ఎన్‌ సింగ్‌ హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్యూరిటీ కమిషనరు జీఎం ఈశ్వరరావు, ఇతర విభాగాధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్పీఎఫ్‌ మహిళా సిబ్బంది కరాటే, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. చెన్నై డివిజన్‌లో సీఏవో వీకే గుప్తా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది కవాతును జీఎం ఆర్‌ఎన్‌ సింగ్‌ తిలకించారు. వర్క్‌షాపులు, డివిజినల్‌ కార్యాలయాల్లో కూడా వేడుకలు ఘనంగా జరిగాయి.

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: శ్రీకన్యకా పరమేశ్వరి దేవస్థానం ధర్మసంస్థ నిర్వహణలోని ఎస్‌కేపీడీ బాలుర పాఠశాలలు, కేటీసీటీ బాలికల పాఠశాలలు, శ్రీకన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల, మహర్షి విద్యామందిర్‌ల సంయుక్త నిర్వహణలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. అన్నా వర్సిటీ మాజీ ఉప కులపతి డాక్టర్‌ పి.కలిరాజ్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. పాలక మండలి సభ్యులు ఊరా ఆంజనేయులు, ఊటుకూరు శరత్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టి.మోహనశ్రీ, ప్రధానోపాధ్యాయులు ఒ.లీలారాణి, ఈ.రమేష్‌, కె.అనిల, సి.రేవతి ముఖ్యఅతిథిని సత్కరించారు. కళాశాల కరెస్పాండెంటు శరత్‌కుమార్‌, ఉపాధ్యాయిని శాంతకుమారి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

* జార్జిటౌన్‌ గిడ్డంగి వీధిలోని దక్షిణ ఇండియా వైశ్య సంఘంలో నిర్వహించిన వేడుకల్లో కంపెనీ లా బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కేకే బాలు ముఖ్యఅతిథిగా విచ్చేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సంఘ అధ్యక్షులు అజంతా అధినేత డాక్టర్‌ కనిగెలుపుల శంకరరావు స్వాగతం పలికి ముఖ్యఅతిథిని ఘనంగా సత్కరించారు. సంయుక్త కార్యదర్శి ఎం.నరసింహులు, కోశాధికారి పి.రమేష్‌, కార్యదర్శి పి.అశోక్‌కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

తిరువళ్ళూరు, తిరునెల్వేలి, న్యూస్‌టుడే: తిరువళ్ళూరు ఎస్పీ కార్యాలయ సమీపంలోని క్రీడా మైదానంలో జరిగిన వేడుకల్లో ఎస్పీ కళ్యాణ్‌ ఆధ్వర్యంలో కలెక్టర్‌ ఆల్ఫిజాన్‌వర్గీస్‌ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. లబ్ధిదారులకు సంక్షేమ సాయం పంపిణీ చేశారు. సబ్‌ కలెక్టర్లు భారతి, ఐశ్వర్య రామనాథన్‌, సహాయక కలెక్టర్‌ (శిక్షణ) కేథరిన్‌ శరణ్య పాల్గొన్నారు. అదేవిధంగా తిరునెల్వేలిలో కలెక్టర్‌ విష్ణు పాలయంకోటలోని వావుసి మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్పీ శరవణన్‌ ఆధ్వర్యంలో జరిగిన పోలీసు కవాతును తిలకించారు. తిరునెల్వేలి కార్పొరేషన్‌ కార్యాలయ ప్రాంగణంలో మేయర్‌ శరవణన్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఉప మేయర్‌ రాజు, కమిషనర్‌ శివ కృష్ణమూర్తి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

* విల్లివాక్కం: కరూర్‌ కలెక్టర్‌ ప్రభుశంకర్‌  * విల్లివాక్కం:  బీజీ మాల్యా..

కాంచీపురం, న్యూస్‌టుడే: కాంచీపురం కలెక్టరు కార్యాలయ ప్రాంగణంలో కలెక్టరు ఎం.ఆర్తి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు సంక్షేమ సాయం అందజేశారు. ఎస్పీ ఎం.సుధాకర్‌, డీఐజీ పగలవన్‌, డీఆర్వో శివరుద్రయ్య, ఆర్డీవో కనిమొళి తదితరులు పాల్గొన్నారు.

* ఆలడి పిళ్లయార్‌ తోపు ఇందిరా నగర్‌లో హిందూ మక్కల్‌ కట్చి తరఫున రాష్ట్ర ఆర్గనైజింగు సెక్రటరీ డాక్టరు కె.ముత్తు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పేదలకు చీరలు పంపిణీ చేశారు. జిల్లా అధ్యక్షుడు కాంచీ శరవణన్‌, ఒలింపిక్‌ కార్డ్సు యజమాని లయన్‌ కె.వడివేలు తదితరులు పాల్గొన్నారు.

* కాంచీపురం సమీప ఏణాత్తూర్‌లోని మీనాక్షి వైద్య కళాశాల, పరిశోధన కేంద్రంలో కులపతి గోమతి రాధాకృష్ణన్‌ నేతృత్వంలో ఉపకులపతి జయంతి రాధాకృష్ణన్‌, అరక్కోణం రాజాళి ఐఎన్‌ఎస్‌ కేంద్ర అధ్యక్షుడు, కమాండర్‌ రోహన్‌రబాడే పాల్గొన్నారు. కరోనా సమయంలో విధులు నిర్వహించిన నర్సులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ ఆచార్యులు రాజశేఖర్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్యులు ముత్తులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

వేలూర్‌, న్యూస్‌టుడే: వేలూర్‌ నేతాజీ మైదానంలో కలెక్టరు కుమరవేల్‌ పాండియన్‌ జాతీయ పతాకాన్ని ఎగుర వేసి పోలీసుల కవాతును తిలకించారు. 46 మంది పోలీసులకు ముఖ్యమంత్రి పతకాలు, ప్రభుత్వ శాఖలకు చెందిన 271 మంది అధికారులకు, సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. తిరుపత్తూర్‌ కలెక్టరు కార్యాలయంలో అమర్‌కుష్వాహా జాతీయ పతాకాన్ని ఎగురవేసి లబ్ధిదారులకు సంక్షేమ సాయం పంపిణీ చేశారు.

* వేలూర్‌: కలెక్టరు కుమర వేల్‌ పాండియన్‌

* అరక్కోణం: కవాతు తిలకిస్తున్న రాణిపేట కలెక్టర్‌ భాస్కరపాండియన్‌

వడపళని, న్యూస్‌టుడే: కస్టమ్స్‌ హౌజ్‌లో చెన్నై జోన్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమిషనరు మాండలిక శ్రీనివాస్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. నావికా దళం పరేడ్‌ను తిలకించారు. విశేష సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.

కోయంబత్తూరు, న్యూస్‌టుడే: కోయంబత్తూరు జిల్లా వీవోసి మైదానంలో కలెక్టరు సమీరన్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు కమిషనరు బాలకృష్ణన్‌, పశ్చిమ మండల ఐజీ సుధాకర్‌, జిల్లా ఎస్పీ బద్రినారాయణన్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్యారిస్‌, న్యూస్‌టుడే: చెన్నైలో మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌ఫోర్ట్‌ కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయంలో మేనేజింగ్‌ డైరెక్టరు అన్బు అబ్రహం జాతీయ జెండాను ఎగురవేశారు.

* ఆవడిలోని శ్రీవెంకటేశ్వర తెలుగు ఎడ్యుకేషనల్‌ సొసైటీ (ఎస్‌వీటీ) పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథులుగా కథాపేర్‌ లయన్స్‌ క్లబ్‌ సభ్యులు రజిని, శరవణన్‌, రాజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

* టీఎంసీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్‌ జాతీయ జెండాను ఎగురవేశారు.

పళ్లిపట్టు, న్యూస్‌టుడే: పళ్లిపట్టు పంచాయతీ యూనియన్‌ కార్యాలయంలో ఛైర్‌పర్సన్‌ ఝాన్సీరాణి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా పళ్లిపట్టు తాలూకా పొదట్టూరుపేటలో గాంధీ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఈఎస్‌ఎస్‌ రామన్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. పళ్లిపట్టులోని గాంధీ విగ్రహానికి పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు శివకుమార్‌ నివాళులర్పించారు.

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై జిల్లా కలెక్టరు కార్యాలయ మైదానంలో కలెక్టరు మురుగేష్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. జిల్లా ఎస్పీ కార్తికేయన్‌, జిల్లా రెవెన్యూ అధికారిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టరు ప్రతాప్‌సింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని