logo

అభివృద్ధి చెందుతున్న రంగాలకు ప్రత్యేక నిధులు

అభివృద్ధి చెందుతున్న రంగాలకు నిధుల నిమిత్తం ఏర్పాటు చేసిన ‘తమిళనాడు ఎమర్జింగ్‌ సెక్టార్‌ సీడ్‌ ఫండ్‌’ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు.

Published : 28 Jan 2023 01:05 IST

ముఖ్యమంత్రితో పెట్టుబడి మొత్తం అందుకున్న ప్రతినిధులు

చెన్నై, న్యూస్‌టుడే: అభివృద్ధి చెందుతున్న రంగాలకు నిధుల నిమిత్తం ఏర్పాటు చేసిన ‘తమిళనాడు ఎమర్జింగ్‌ సెక్టార్‌ సీడ్‌ ఫండ్‌’ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికశాఖ, సాంకేతికశాఖ ఉమ్మడి ప్రయత్నంతో దీన్ని ఏర్పాటు చేశారు. అభివృద్ధి చెందుతున్న రంగాల మెరుగైన ఉత్పత్తి, యాంత్రీకరణ, అంతరిక్షం, రక్షణ సాంకేతికత, డిజిటలీకరణ, కృత్రిమ మేధ, బయో టెక్నాలజీ, వెబ్‌ 3.ఓ వంటి రంగాలలో ఈ నిధులను పెట్టుబడి పెట్టనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.50 కోట్లు, అంతే మొత్తం టిడ్కో, టైడెల్‌ పార్కు సమకూర్చనున్నాయి. 2023-24లో దీనిని రూ.500 కోట్లకు పెంచాలని నిర్ణయించారు. సంస్థలకు ఈ పెట్టుబడులు అందించడానికి ప్రకటనల ద్వారా ప్రభుత్వం దరఖాస్తులు పొందింది. వాటిలో తొలి 5 సంస్థలను ఎంపిక చేసి ప్రతినిధులకు శుక్రవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ అనుమతి పత్రాలు అందించారు. రాష్ట్రంలో రెండో, మూడో స్థాయి పట్టణాల్లోని వ్యాపారులకు పండ్లు, కూరగాయలు అందించడానికి ఏర్పడిన పెరంబలూరు జిల్లాకు చెందిన ఇ-సందైకు రూ.కోటి, డిజిటల్‌ వేదిక ద్వారా పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను అనుసంధానం చేసే నామక్కల్‌ జిల్లాకు చెందిన కైగళ్‌ సంస్థకు రూ.2 కోట్లు, ఐఐటీ మద్రాస్‌ రీసెర్చ్‌ పార్కులోని ప్లానిటిక్స్‌ సంస్థకు రూ.2 కోట్లు, తేయాకు కోత కోసే ఆటోమెటిక్‌ యంత్రం తయారు చేసే సూరినోవా సంస్థకు రూ.5 కోట్లు, కేన్సర్‌, గుండె జబ్బు, మూత్రపిండాల రోగాలకు ఉపయోగించే ఖరీదైన మందులను చౌకధరకు ఆన్‌లైన్‌ ద్వారా అందించే మిస్టర్‌ మెడ్‌ సంస్థకు రూ.3.40 కోట్లు కేటాయించారు.

* రాష్ట్రంలోని 66 ప్రభుత్వరంగ సంస్థలను పర్యవేక్షించే ‘కంపెనీస్‌ కంప్లయిన్సెస్‌ అండ్‌ ఫెనాన్సియల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌’కు ప్రత్యేకంగా రూపొందించిన

* www.ccfms.tn.gov.in వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు అన్బరసన్‌, పళనివేల్‌ త్యాగరాజన్‌, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇరైయన్బు తదితరులు పాల్గొన్నారు.


అంకుర సంస్థలకు రూ.7.50 కోట్లు

చెన్నై, న్యూస్‌టుడే: ఐదు అంకుర సంస్థల్లో రూ.7.5 కోట్ల షేర్ల పెట్టుబడుల ఉత్తర్వులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ అందించారు. పరిశ్రమల రంగంలో అన్ని సామాజిక వర్గాలతో కూడిన అభివృద్ధిని సాధించడానికి తమిళనాడు ఎస్సీ, ఎస్టీ అంకుర సంస్థ ఫండ్‌ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాల పారిశ్రామిక ఔత్సాహికులు నిర్వహించే అంకుర సంస్థలకు ఈ పథకం కింద షేర్ల పెట్టుబడి లేక ష్యూరిటీ లేని రుణ సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానించగా ఇప్పటివరకు 330 అంకుర సంస్థల నుంచి  అందాయి. వాటిలో తొలి విడతగా అర్హతగల 5 సంస్థలను ఎంపిక చేసి  రూ.7.50 కోట్లను ముఖ్యమంత్రి స్టాలిన్‌ సచివాలయంలో శుక్రవారం అందించారు. లబ్ధిదారు సంస్థల్లో ప్యాక్‌ ఎన్‌ బ్యాక్‌, యూనిబోస్‌, టౌ మ్యాన్‌, ఎకో సాఫ్ట్‌ సొల్యూషన్స్‌, పీస్‌ ఆటోమేషన్‌ ఉన్నాయి.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని