logo

‘వెన్నుపోటుదారులకు గుణపాఠం తప్పదు’

వెన్నుపోటు పొడిచే వారికి ఈరోడ్‌ ఉప ఎన్నిక గుణపాఠం నేర్పుతుందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అభిప్రాయపడ్డారు.

Published : 28 Jan 2023 01:05 IST

ప్రసంగిస్తున్న ఎడప్పాడి పళనిస్వామి

విల్లివాక్కం, న్యూస్‌టుడే: వెన్నుపోటు పొడిచే వారికి ఈరోడ్‌ ఉప ఎన్నిక గుణపాఠం నేర్పుతుందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అభిప్రాయపడ్డారు. ఈరోడ్‌లో శుక్రవారం ఈస్ట్‌ నియోజకవర్గ అన్నాడీఎంకే ఎన్నికల నిర్వాహకుల సమావేశం జరిగింది. ఇందులో ఆయన మాట్లాడుతూ.. ఈ ఎన్నికలో విజయఢంకా మోగించాలని, ప్రజలు ప్రశంసించే స్థాయిలో నిర్వాహకులు పనిచేయాలని సూచించారు. ఇద్దరు మహా నేతలు నేర్పించిన రాజకీయాన్ని ఈ నియోజకవర్గంలో ఉపయోగించి చరిత్ర సృష్టించాలని పేర్కొన్నారు. డీఎంకే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని ఆ పార్టీ వారే ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. డీఎంకే నాయకులు సంకుచిత మనస్తత్వంతోనే ఓట్లు సేకరించగలరని, అన్నాడీఎంకే నేతలు ధైర్యంగా ఆ పని చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డీఎంకే భారీ ప్రాజెక్టులేమీ చేపట్టలేదని ఆరోపించారు. అన్నాడీఎంకే అమలు చేసిన తాళికి బంగారం, వివాహ భృతి పథకాలను ప్రభుత్వం నిలిపేసిందని ఆరోపించారు. నియోజకవర్గ అధికారులు 3 రోజుల్లో ఓటర్ల వివరాలు సరిచూసుకోవాలని కోరారు. తమ ఉద్యమాన్ని అడ్డుకునేందుకు శత్రువులతో కలిసి కొందరు వెన్నుపోటుదారులుగా మారి  పని చేస్తున్నారని తెలిపారు. వారికి ఈ ఉప ఎన్నిక ఫలితాలు ఒక గుణపాఠం కావాలని అభిప్రాయపడ్డారు.


అన్నాకు నివాళి 3న

సైదాపేట: ఫిబ్రవరి 3న దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాకు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి నివాళులర్పించనున్నారు. దీనికి సంబంధించి అన్నాడీఎంకే  శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో... పేరరింజ్ఞర్‌ అన్నా 54వ స్మారక దినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 3న చెన్నై మెరీనాలోని ఆయన స్మారక మందిరంలో ఎడప్పాడి మాల వేసి నివాళులు అర్పించనున్నారు. అన్నాడీఎంకే జిల్లా కార్యదర్శులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నిర్వాహకులు, పాల్గొనాలని సూచించింది. అలాగే పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 3న ఆయా ప్రాంతాల్లో అన్నా విగ్రహాలు, చిత్ర పటాలకు మాలవేసి నివాళులర్పించాలని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని