logo

శర్వాణి సేవలు అభినందనీయం

శర్వాణి సంగీతసభ మూడున్నర దశాబ్దాలకుపైగా సంప్రదాయ కళల పోషణ పరిరక్షణకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఊరా గ్రూపు ఛైర్మన్‌ ఊరా లక్ష్మీనరసింహారావు అభివర్ణించారు.

Updated : 28 Jan 2023 05:14 IST

ప్రారంభోత్సవంలో లక్ష్మీనరసింహారావు తదితరులు * అల్లం దుర్గాప్రసాద్‌ గోటు వాద్య విన్యాసం

చెన్నై (సాంస్కృతికం), న్యూస్‌టుడే: శర్వాణి సంగీతసభ మూడున్నర దశాబ్దాలకుపైగా సంప్రదాయ కళల పోషణ పరిరక్షణకు చేస్తున్న సేవలు అభినందనీయమని ఊరా గ్రూపు ఛైర్మన్‌ ఊరా లక్ష్మీనరసింహారావు అభివర్ణించారు. శర్వాణి సంగీతసభ 37వ వార్షికోత్సవం మైలాపూరులోని రాగసుధ హాలులో శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు ఏర్పాటు చేశారు. తొలిరోజు ముఖ్యఅతిథిగా విచ్చేసిన లక్ష్మీనరసింహారావు జ్యోతి వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షికోత్సవాన్ని సంగీత త్రిమూర్తులలో ఆద్యుడైన త్యాగరాజుకు అంకితం చేయడం అభినందనీయమన్నారు. వార్షికోత్సవం విజయవంతంగా జరగాలని ఆకాంక్షించారు. మొదటి కార్యక్రమంగా ఏర్పాటైన కలైమామణి అల్లం దుర్గాప్రసాద్‌ గోటు వాద్య విన్యాసం వీనులవిందుగా సాగింది. సాహిత్యంలోని అక్షరాలను సుస్పష్టంగా వినిపించి ఎవరో గానం చేస్తున్న అనుభూతికి కలిగించారు. వయొలిన్‌పై రంజని రామకృష్ణ, మృదంగంపై ఆర్‌.అనంతకృష్ణ, ఘటంపై డాక్టర్‌ కె.మురళి అందించిన వాద్య సహకారం కచేరీకి మరింత వన్నె తెచ్చింది. అనంతరం నిర్వహించిన కోటా సోదరీమణులు ప్రసిద్ధి చెందిన యువగాయనీమణులు పూర్వ ధనశ్రీ, పావని గాత్రకచేరి శ్రవణానందంగా సాగింది. వయొలిన్‌పై మంతా రమ్య, మృదంగంపై ఎ.కవిసెల్వన్‌లు అందించిన వాద్య సహకారం కచేరీకి మరింత శోభ తెచ్చింది. నిర్వాహకులు వార్షికోత్సవాన్ని త్యాగరాజుకు అంకితం చేస్తున్నందున ఆయన రచించిన కృతులను అధిక శాతం గానం చేసి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. వేదికపై త్యాగరాజు చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూలదండలతో అలంకరించారు. ఆరాధనలు చేశారు. ఎస్‌కేపీడీ పాలక మండలి సభ్యులు ఊరా ఆంజనేయులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. శనివారం సాయంత్రం 4.15 గంటలకు ముకుంద భరద్వాజ్‌, రాత్రి 6.15 గంటలకు ఆర్‌.లక్ష్మీప్రియ గాత్రకచేరీలు నిర్వహిస్తారు. అందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని