logo

అన్నాడీఎంకే శ్రేణులకు దిశానిర్దేశం

ఈరోడు తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతలు ఎలా వ్యవహరించాలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పలు సూచనలు చేశారు.

Published : 29 Jan 2023 01:32 IST

ఇంటింటికీ వెళ్లాలని ఎడప్పాడి ఆదేశం
ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహం
మద్దతుదారులతో ఓపీఎస్‌ సమావేశం

సైదాపేట, న్యూస్‌టుడే: ఈరోడు తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అన్నాడీఎంకే నేతలు ఎలా వ్యవహరించాలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పలు సూచనలు చేశారు. ఈరోడు తూర్పు ఎన్నికలు ఇంకా నెల రోజులే ఉన్న నేపథ్యంలో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈరోడు పార్టీ నిర్వాహకులతో చర్చించారు. ముఖ్యంగా పార్టీ నేలు ఎలా వ్యవహరించాలో ముఖ్య సూచనలు చేశారు. రెండాకుల గుర్తు దక్కకపోయినా ఎన్నికల్లో ఆధిపత్యం సాధించాలనే కృతనిశ్చయంతో ఎడప్పాడి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిస్వామి తరఫున శుక్రవారం సుప్రీంకోర్టులో ఓ పిటిషన్‌ దాఖలు చేశారు. రెండాకుల గర్తు తమకు ఇవ్వాలని, ఉప ఎన్నికల్లో అభ్యర్థిని నిలిపితే ఎన్నికల కమిషన్‌ తనకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కింద సంతకాన్ని అంగీకరించేందుకు నిరాకరిస్తుందని తెలిపారు. పళనిస్వామి దూకుడైన రాజకీయాలకు ఇది నిదర్శనంగా ఉంది. మరోవైపు ఈ నియోజకవర్గానికి ప్రభుత్వం ఏమీ చేయలేదని ఓటర్లకు చెప్పాలని పార్టీ నిర్వాహకులకు సూచించారు. 32 వార్డుల్లో విభజించి ఇచ్చిన ప్రాంతానికి రోజూ వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మళ్లీ మళ్లీ వెళ్లాలని సూచించారు. ప్రజలకు నిజాలను తెలపాలని, డీఎంకే నెరవేర్చని ఎన్నికల హామీలను వారి దృష్టికి తేవాలని ఆదేశించారు. ఇక్కడ 17 శాతం మాత్రమే గౌండర్లు, 36 శాతం కొంగు ముదలియార్లు, 17 శాతం మైనారిటీలు, 6 శాతం అరుంధతీయులు ఉన్నారు. గౌండర్ల ఓట్ల కంటే మిగతా వారివే ఎక్కువ. ముఖ్యంగా కొంగు ముదలియార్లు విజయాన్ని నిర్ణయించే శక్తిగా ఉన్నారు. అందులో 80 వేల ఓట్లు పొందితే అభ్యర్థి విజయం సాధించినట్లే. ఎలాగైనా వాటిని పొందాలని శుక్రవారం జరిగిన సమావేశంలో మాజీ మంత్రి సెంగోట్టయన్‌ పేరొన్నారు. మరోవైపు 111 మందితో కూడిన ఎన్నికల పనుల బృందాన్ని ఎడప్పాడి నియమించారు.


పన్నీర్‌ వర్గం అభ్యర్థి ఎవరో?  

మురుగానందం

ఈరోడు తూర్పు ఉప ఎన్నికలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తన మద్దతుదారులతో శనివారం సమావేశం అయ్యారు. డీఎంకే కూటమి తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌, డీఎండీకే నుంచి ఈరోడు తూర్పు జిల్లా కార్యదర్శి ఆనంద్‌, ఏఎంఎంకే తరఫున శివప్రసాద్‌ పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ చెన్నై గ్రీన్‌వేస్‌ రోడ్డులోని తన నివాసంలో మద్దతుదారులతో శనివారం భేటీ అయ్యారు. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అనే ప్రాతిపదికన తన సంతకంతో ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి పేరును ఎన్నికల కమిషన్‌ అంగీకరించటం లేదని పళనిస్వామి సుప్రీంకోర్టును శుక్రవారం ఆశ్రయించారు. సోమవారం మళ్లీ అప్పీలు చేయాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ మద్దతుదారుల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండాకుల గుర్తు కేటాయించాలని ఎడప్పాడి కోర్టును ఆశ్రయించటంతో తదుపరి చర్యల గురించి ఓపీఎస్‌ ఆలోచించినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేయటంపైనా చర్చించినట్లు సమాచారం. ఈరోడు నగర విద్యార్థి విభాగ కోశాధికారిగా ఉన్న మురుగానందం కొన్ని నెలల క్రితం ఓపీఎస్‌ వర్గంలో చేరారు. ఆయనకు ఈరోడు నగర జిల్లా కార్యదర్శి పదవి ఇచ్చారు. ఇప్పుడు ఆయనే ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. అభ్యర్థి పేరును పన్నీర్‌సెల్వం త్వరలో ప్రకటిస్తారని నాయకులు అన్నారు. ప్రస్తుతం బూత్‌ కమిటీల ఏర్పాటుపై నివేదిక ఓపీఎస్‌కు చేరిందని వివరించారు. త్వరలో ఎన్నికల బాధ్యులను నియమించి పనులు ప్రారంభిస్తామని అన్నారు. బల నిరూపణలకు అన్నాడీఎంకేలోని ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు ప్రత్యక్షంగా తలపడుతుండటంతో ఈరోడు ఉప ఎన్నికలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని