logo

పెరుగుతున్న కూలీల ఆత్మహత్యలు

రోజువారీ కూలీల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్న నివేదిక దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే తమిళనాడులో అసంఘటిత రంగ కార్మికులకు ఎక్కవ కూలీ ఇస్తున్నారు.

Published : 29 Jan 2023 01:32 IST

వ్యసనాలు, ఆన్‌లైన్‌ జూదం కూడా కారణం

సక్రమంగా అమలు కాని సంక్షేమ పథకాలు

సైదాపేట, న్యూస్‌టుడే: రోజువారీ కూలీల ఆత్మహత్యల్లో రాష్ట్రం మొదటి స్థానంలో ఉందన్న నివేదిక దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాల కంటే తమిళనాడులో అసంఘటిత రంగ కార్మికులకు ఎక్కవ కూలీ ఇస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో రాజ్యసభ సమావేశంలో దీనికి సంబంధించి కాంగ్రెస్‌ సభ్యులు దిగ్విజయ్‌ సింగ్‌, నీరజ్‌ డాండి తదితరులు ప్రశ్న లేవనెత్తారు. దీంతో రాష్ట్రాల వారిగా కూలీల ఆత్మహత్యల గణాంకాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. అందులో గతేడాదిలో మాత్రమే తమిళనాడులో 7,673 మంది కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. దీనికి కారణం సంక్షేమ పథకాలు సక్రమంగా వారికి అందకపోవడమేనని తేలింది. అసంఘటిత రంగ కార్మికుల భద్రతా చట్టం 2008 ప్రకారం వ్యవసాయం, భవన నిర్మాణం, ఇంటి పని తదితర పనులు చేసే వారి సంక్షేమం, విద్య, ఆరోగ్యం, సెలవు, పింఛనుకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సక్రమంగా అవి అమలు కావడం లేదు. 2021లో మాత్రమే దేశవ్యాప్తంగా 42,004 మంది రోజువారీ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ జాబితాలో నాలుగేళ్లుగా తమిళనాడు మొదటి స్థానంలో ఉందనేది దిగ్భ్రాంతికర విషయం.


ప్రభుత్వమే స్పందించాలి

దీని గురించి భాతర కార్మిక సంఘ సెంటర్‌ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి కన్నన్‌ మాట్లాడుతూ... ఉత్తరాది రాష్ట్రాల కంటే తమిళనాడు అసంఘటిత కార్మికులకు ఎక్కువ కూలీ ఇస్తుండటం వాస్తవమేనని తెలిపారు. అయితే కేరళ, జమ్ముకశ్మీర్‌ తదితరాలతో పోల్చితే తక్కువని అన్నారు. ఐదేళ్లుగా ధరల పెరుగుదలను గమనిస్తే దానికి నికరంగా కూలీ లేక వేతనం పెంచలేన్నదే వాస్తవమని తెలిపారు. అందరు కూలీలకు సరాసరిగా నెలకు రూ.21,000 ఆదాయం దక్కాలని సంఘం కోరుతోందన్నారు. మూడేళ్లుగా రోజువారీ కూలీల నెల ఆదాయం రూ.18,000లకు పెంచాలని ప్రభుత్వం వద్ద ఉంచిన డిమాండే ఇంకా నెరవేర్చలేదని తెలిపారు. దీనికి సంబంధించి తమిళనాడు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు అధ్యక్షుడు పొన్‌.కుమార్‌ మాట్లాడుతూ... కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం రోజువారీ కూలీల ఆత్మహత్యలు రాష్ట్రంలో పెరగడం దిగ్భ్రాంతిని కలిగిస్తోందని తెలిపారు. వ్యసనాలు, కరోనా లాక్‌డౌన్‌, ఆన్‌లైన్‌ జూదం, అప్పుల బాధలు తదితరాలే దీనికి కారణమన్నారు. ఈ కారణంగానే ఆన్‌లైన్‌ జూదం నిషేధించాలని డిమాండ్‌ చేస్తున్నామని తెలిపారు. కార్మికుల మరణాల వివరాలు జిల్లా స్థాయిలో నమోదు చేస్తామని అన్నారు. ప్రస్తుతం కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రాతిపదికన జిల్లాల వారీగా అధ్యయనం చేసి నిజాలను తెలుసుకుని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని