logo

శాఖల సమన్వయంతోనే వరద నివారణ

అన్ని శాఖల సమన్వయ కృషితో వరద నివారణ సాధ్యపడిందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు.

Published : 01 Feb 2023 00:32 IST

ముఖ్యమంత్రి అభినందన

స్టాలిన్‌ తదితరులతో ప్రశంసాపత్రాలు పొందినవారు

చెన్నై, న్యూస్‌టుడే: అన్ని శాఖల సమన్వయ కృషితో వరద నివారణ సాధ్యపడిందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. వర్షకాలాల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాల అందజేత కార్యక్రమం గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ ప్రధాన కార్యాలయమైన రిప్పన్‌ భవన్‌లో మంగళవారం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి స్టాలిన్‌ 586 మందికి ప్రశంసాపత్రాలు అందించడానికి సూచనప్రాయంగా 44 మందికి అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... గత ప్రభుత్వ హయాంలో వరదలతో ఏర్పడిన ఇబ్బందులు అందరికీ తెలిసినవేనని, అలాంటి పరిస్థితి రాకుండా ఎంతో పకడ్బందీగా చర్యలు చేపట్టామని తెలిపారు. సామాజిక మాధ్యమాలు, ప్రసార, ప్రచార మాధ్యమాల్లోనూ అభినందనలు వెల్లువెత్తాయని పేర్కొన్నారు. నగరంలో గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌, మెట్రోవాటర్‌, జలవనరులు, రహదారులు, విద్యుత్తు, పోలీసు తదితర శాఖలకు చెందిన వారు సమన్వయ చర్యలతో వరద నివారణ సాధ్యపడిందని తెలిపారు. ఇందుకు వారంతా అభినందనీయులని పేర్కొన్నారు. మంత్రులు కేఎన్‌ నెహ్రూ, సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేశ్‌కుమార్‌, కమిషనరు గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ తదితరులు నిర్విరామంగా పనిచేశారని తెలిపారు. చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌గా తాను పనిచేసిన సమయంలో కురుస్తున్న వర్షంలోనూ వరద నివారణ పనులు పరిశీలించానని గుర్తు చేసుకున్నారు. 2021లో అధికారంలోకి వచ్చిన తర్వాత వర్ష ప్రభావిత ప్రాంతాల్లో భవిష్యత్తు ప్రణాళిక కోసం కమిటీని నియమించినట్టు చెప్పారు. దాని సూచనలు మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వాననీటి కాలువల నిర్మాణానికి పలు ప్రాజెక్టులు రూపొందించినట్టు తెలిపారు. 15 జోన్లలో సింగార చెన్నై 2.0 పథకం కింద రూ.254.67 కోట్లు, వరద నివారణ నిధి కింద రూ.291.06 కోట్ల వ్యయంతో పనులు జరిగాయని పేర్కొన్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు సాయంతో రూ.220 కోట్లు, జర్మన్‌ అంతర్జాతీయ బ్యాంకు నుంచి రూ.1,714 కోట్లు, ప్రపంచ బ్యాంకు సాయంతో రూ.120 కోట్ల వ్యయంతో పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు కేఎన్‌ నెహ్రూ, పీకే శేఖర్‌బాబు, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ, డిప్యూటీ మేయర్‌ మహేశ్‌కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు, మున్సిపల్‌ నిర్వహణ, నీటి సరఫరాలశాఖ అదనపు ప్రధాన కార్యదర్శి శివ్‌దాస్‌ మీన, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కమిషనరు గగన్‌దీప్‌ సింగ్‌ బేడీ, చెన్నై సిటీ పోలీస్‌ కమిషనరు శంకర్‌ జివాల్‌ తదితరులు పాల్గొన్నారు.

శాంతి ర్యాలీలో పాల్గొనాలి: సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: అన్నాదురై వర్ధంతి సందర్భంగా నగరంలో ఫిబ్రవరి 3న జరగనున్న శాంతి ర్యాలీలో భారీ సంఖ్యలో పాల్గొనాలంటూ డీఎంకే శ్రేణులకు ఆ పార్టీ అధ్యక్షుడైన ముఖ్యమంతి స్టాలిన్‌ సూచించారు. ఈ మేరకు ఆయన రాసిన లేఖలో... 60 ఏళ్లు నిండకుండా మరణించిన అన్నాదురై అంతిమయాత్రకు కోటి మంది హాజరుకావడం ప్రపంచ రికార్డుగా నమోదైందని తెలిపారు. మాతృభూమికి ‘తమిళనాడు’ అనే పేరు పెట్టారని, హిందీ ఆధిక్యతకు తెరదించేలా తమిళ గడ్డపై తమిళం, ఆంగ్లం అనే ద్విభాషా సూత్రాన్ని ఏర్పరిచారని పేర్కొన్నారు. ఆదర్శ వివాహాలను చట్టం చేసి తందై పెరియార్‌కు కానుకగా ఇచ్చారని కొనియాడారు. ప్రపంచ రెండో తమిళ మహానాడును చెన్నైలో నిర్వహించారని, ఆకలి చావులు అడ్డుకునేందుకు పడి బియ్యం పథకాన్ని అమలు చేశారని తెలిపారు. అలాంటి వ్యక్తి వర్ధంతి రోజు ఆయన మార్గంలో శ్రమిద్దామని పేర్కొన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 3న కరుణానిధి అధ్యక్షతన శాంతి ర్యాలీ జరిగిందని గుర్తు చేశారు. ఈ ఏడాది తన అధ్యక్షతన జరగనున్న ర్యాలీలో పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని