logo

ఉప ఎన్నికల్లో గెలుపుపై ధీమా

ఈరోడు తూర్పు ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు తమకు కేటాయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎడప్పాడి పళనిస్వామి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Published : 01 Feb 2023 00:32 IST

8 పకడ్బందీ ఏర్పాట్లలో ఎడప్పాడి

సైదాపేట, న్యూస్‌టుడే: ఈరోడు తూర్పు ఉప ఎన్నికల్లో రెండాకుల గుర్తు తమకు కేటాయిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని ఎడప్పాడి పళనిస్వామి తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని ఆయన కోరారు. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా తాను పంపే అభ్యర్థిని ఎన్నికల కమిషన్‌ అంగీకరించాలని సూచించాలని సుప్రీం కోర్టులో ఎడప్పాడి తరఫు పిటిషన్‌ వేశారు. మూడు రోజుల్లో బదులివ్వాలని కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమిషన్‌ సమాధానం పళనిస్వామికి అనుకూలమా? కాదా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనుకూలంగా ఉంటే ఎడప్పాడికి రెండాకుల గుర్తు దక్కుతుంది. అయితే సర్వసభ్య సమావేశ కేసు తీర్పును వాయిదా వేసి ఉన్న నేపథ్యంలో ఈసీ ఇలా చెప్పడం కష్టమేనని చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఇద్దరూ పోటీ చేయాలని భావిస్తే రెండాకుల గుర్తును తాత్కాలికంగా స్తంభింపచేసి వారికి నచ్చిన గుర్తులను ఎంపిక చేస్తామని ఎన్నికల కమిషన్‌ చెప్పే అవకాశాలే ఎక్కువని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎడప్పాడికి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, నిర్వాహకుల మద్దతు ఉన్నా ఓపీఎస్‌ కూడా అదేస్థాయిలో పోరాడుతున్నది. రెండాకులు గర్తు దక్కకపోతే ఎన్నికల కమిషన్‌లో వేరే దాన్ని ఎంపిక చేసేందుకు పళనిస్వామి తరఫున చర్చించుకుంటున్నారు. ఇంతులో చేతి బండి గుర్తును ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. తొళిలాలి సినిమాలో ఎంజీఆర్‌ ఆ బండి లాగే కార్మికుడిగా నటించారు. దీంతో ఆ గుర్తును ఎంపిక చేసుకుంటే సులభంగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చనేది ఎడప్పాడి ఆలోచన.

అవకాశాలు ఇవే..

ఈ నేపథ్యంలో మూడు సానుకూల అంశాలు తమకు ఉన్నట్లు ఎడప్పాడి తరఫు వర్గం భావిస్తోంది. మొదటిది రెండాకుల గుర్తు దక్కితే తామే నిజమైన అన్నాడీఎంకే అని నిరూపించొచ్చని ఎడప్పాడి తరఫు వర్గం భావిస్తోంది. ఇకవేళ గుర్తు స్తంభిస్తే దీనికి ఓపీఎస్‌ కారణమని, డీఎంకే బీ టీమ్‌గా పని చేస్తూ సొంత పార్టీకి ద్రోహం చేస్తున్నారనే ప్రచారం చేయాలన్నది ఎడప్పాడి వర్గం ఆలోచన. దీంతో ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారుతుందని ఈపీఎస్‌ వర్గ అంచనా. అదే సమయంలో రెండాకుల గుర్తుతో విజయం సాధించటం కంటే స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల మద్దతు పొందితే బలమైన నాయకుడిగా మారొచ్చనేది ఈపీఎస్‌ ఆలోచన. దీంతో బూత్‌లవారీగా వివరాల్లో పళనిస్వామి మునిగారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని