logo

రైళ్ల వేగం పెంపునకు చర్యలు

దక్షిణ రైల్వే పరిధిలోని పలు ప్రాంతాల్లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు ట్రాక్‌ను బలోపేతం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి.

Published : 01 Feb 2023 00:40 IST

వడపళని, న్యూస్‌టుడే: దక్షిణ రైల్వే పరిధిలోని పలు ప్రాంతాల్లో రైళ్ల వేగాన్ని పెంచేందుకు ట్రాక్‌ను బలోపేతం చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. చెన్నై నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణంలో సమయం కలిసొచ్చేలా పనులు జరుగుతున్నాయని దక్షిణ రైల్వే గతంలోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో చెన్నై నుంచి బెంగళూరుకు రైళ్ల వేగం పెరగనుంది. చెన్నై నుంచి జోలార్‌పేట్టై సెక్షనులో గంటకు 130 కి.మీ వేగం వరకు వెళ్లనున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌ బెంగళూరుకు 4.25 గంటలు, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 4.45 గంటలలోపు చేరుకుంటున్నాయి. పెరగనున్న వేగంతో సమయం మరో అరగంట వరకు తగ్గనుంది. ఆ తర్వాత జోలార్‌పేట్టై నుంచి బెంగళూరు వరకు ట్రాక్‌ మరమ్మతులు, బలోపేతం పనులు పూర్తి కాగానే ప్రయాణ సమయం ఇంకా తగ్గుతుంది. ఇక్కడ పనులు ముగిసిన తర్వాత బెంగళూరులోని సౌత్‌ వెస్టర్న్‌ రైల్వే కమిషనరు చెన్నై - రేణిగుంట వయా అరక్కోణం, అరక్కోణం - జోలార్‌పేట్టై సెక్షనులో 130 కి.మీ వరకు అనుమతి ఇవ్వగానే వేగంతో నడుస్తాయన్నారు. ఈ మార్గానికి ఉన్న దూరం 144.54 కి.మీ. చెన్నై నుంచి జోలార్‌పేట్టై వరకు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 120 కి.మీ వరకు నడిచే వీలుంటుంది. అదేవిధంగా చెన్నై నుంచి ముంబయి మార్గంలో నడిచే రైళ్లు కూడా రేణిగుంట వరకున్న 134.78 కి.మీ దూరానికి వేగంతో నడిచే వీలుంది. వేగాన్ని పెంచి నడిపేందుకు ఇప్పటికే సంబంధిత అధికారుల అనుమతికోసం దక్షిణ రైల్వే లేఖ రాసింది. అరక్కోణం - జోలార్‌పేట్టై మార్గానికి వచ్చే నెల మొదటి వారంలో రైల్వే సేఫ్టీ కమిషనరు నుంచి అనుమతి అందే అవకాశం ఉంది.

* చెన్నై - గూడూరు సెక్షనులో అక్టోబరులోనే 130 కి.మీ వేగంతో నడుస్తున్నాయి. జోలార్‌పేట్టై - పొదనూరు, చెన్నై - దిండిగల్లు సెక్షనులో కూడా 130 కి.మీ వేగంతో నడిచేందుకు పనులు జరుగుతున్నాయి. ఇవికాకుండా ఇతర ప్రధాన మార్గాల్లో కొన్ని రైళ్లకు 110 కి.మీ వరకు నడిచేందుకు దక్షిణ రైల్వే జోన్‌లో శరవేగంగా పనులు కొనసాగుతున్నాయి. ఇటీవల చెన్నై - అరక్కోణం సెక్షనులో 90 నుంచి 110 కి.మీ వేగంతో నడిపారు. అదేవిధంగా తాంబరం - చెంగల్పట్టులో 90 నుంచి, తిరునెల్వేలి - తిరుచెందూరు సెక్షనులో 70 నుంచి 110 కి.మీ వరకు పెంచారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట్ల పట్టాల వెంబడి గోడలు కట్టాలనుకుంటున్నట్లు దక్షిణ రైల్వే సీనియర్‌ అధికారి ఒకరన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని