logo

అన్నదమ్ముళ్ల దారుణ హత్య

నామ్‌ తమిళర్‌ కట్చికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు దారుణ హత్యకు గురైనట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. ఈరోడ్‌ మున్సిపల్‌ కాలనీ కృష్ణస్వామి వీధికి చెందిన లోకనాథన్‌ కుమారులు గౌతం (30), కార్తి (26) గానుగ నూనె, మసాలా పొడి తదితర వస్తువులు తయారు చేసి ఇంట్లోనే విక్రయిస్తుంటారు.

Published : 01 Feb 2023 00:40 IST

విల్లివాక్కం, న్యూస్‌టుడే: నామ్‌ తమిళర్‌ కట్చికి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లు దారుణ హత్యకు గురైనట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. ఈరోడ్‌ మున్సిపల్‌ కాలనీ కృష్ణస్వామి వీధికి చెందిన లోకనాథన్‌ కుమారులు గౌతం (30), కార్తి (26) గానుగ నూనె, మసాలా పొడి తదితర వస్తువులు తయారు చేసి ఇంట్లోనే విక్రయిస్తుంటారు. వీరికి మామ ఆరుముగస్వామితో పాత కక్షలున్నాయి. సెల్‌ఫోన్‌లో మాట్లాడుకుంటున్న సమయంలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో గౌతం, కార్తి ఇంటికి వచ్చిన ఆరుముగస్వామి గొడవకి దిగాడు. కాసేపటి తర్వాత అన్నదమ్ములపై కత్తితో దాడి చేశాడు. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఆరుముగస్వామి కోసం గాలిస్తున్నారు.

నగల కోసం దంపతుల హతం

ప్యారిస్‌, న్యూస్‌టుడే: దంపతులను హత్య చేసి నగలు దోచుకున్న ఘటన పెరంబలూరు జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు... పెరంబలూరు జిల్లా వెప్పంతట్టై సమీప తొండప్పాడి గ్రామానికి చెందిన మాణిక్కం (75), మాక్కాయి (70) దంపతులు. వీరికి నలుగురు కుమార్తెలున్నారు. అందరికీ వివాహాలయ్యాయి. ఇంట్లో మాణిక్కం, మాక్కాయి మాత్రమే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఇంట్లో నిద్రించారు. మంగళవారం ఉదయం గొంతు కోసిన స్థితిలో ఇద్దరు మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. మృతదేహాలపై కారంపొడి చల్లి ఉంది. ఇంట్లో 6 సవర్ల నగలు చోరీకి గురైనట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు. దర్యాప్తు కొనసాగుతోంది.

తల్లీకుమారుల ఆత్మహత్య

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: ఓ ఇంట్లో తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం... మదురై జిల్లా కొచ్చడై ప్రాంతానికి చెందిన ఉమాశంకర్‌ (46) షేర్‌ మార్కెట్‌ సంబంధిత సంస్థ నడుపుతున్నాడు. ఇతను తొలిభార్య నుంచి విడిపోయి మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇటీవల గొడవలతో ఆమె కూడా తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో ఉమాశంకర్‌ తన తల్లి విజయలక్ష్మి (73)తో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో విషం తాగి వారు రెండు రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఉమాశంకర్‌ ఫోను చేస్తే సమాధానం ఇవ్వకపోవడంతో సంస్థలోని ఉద్యోగులు ఇంటికి వెళ్లి చూడగా విషయం వెలుగుచూసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని