logo

యువత సవాళ్లను స్వీకరించాలి: గవర్నర్‌

సవాళ్లను స్వీకరించడానికి ముందుకు రావాలని యువతకు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి సూచించారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు తిరిగొచ్చిన నేపథ్యంలో గిండీలోని రాజ్‌భవన్‌లో వారిని గవర్నర్‌ సత్కరించారు.

Published : 03 Feb 2023 01:53 IST

ప్రసంగిస్తున్నఆర్‌ఎన్‌ రవి

చెన్నై, న్యూస్‌టుడే: సవాళ్లను స్వీకరించడానికి ముందుకు రావాలని యువతకు గవర్నర్‌ ఆర్‌.ఎన్‌.రవి సూచించారు. దిల్లీలో గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో పాల్గొన్న రాష్ట్రానికి చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు తిరిగొచ్చిన నేపథ్యంలో గిండీలోని రాజ్‌భవన్‌లో వారిని గవర్నర్‌ సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల ఉన్నత సేవలు రాష్ట్రం, దేశం గర్వించేలా ఉన్నాయని తెలిపారు. వ్యక్తిగతంగా, సమష్టిగా విజయం సాధించడం స్ఫూర్తికి ఫలితమని పేర్కొన్నారు. 2047 నాటికి ప్రపంచంలో పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ ఉండాలని ఆకాంక్షించారు. నేడు అంతర్జాతీయ వేదికపై భారత్‌ గర్వించదగిన స్థానాన్ని కలిగి ఉందన్నారు. వివిధ సమస్యలపై ప్రపంచ దేశాలు మన విధానాలపై శ్రద్ధ చూపుతున్నాయని తెలిపారు. మాంద్యాన్ని అధిగమించడానికి అభివృద్ధి, వృద్ధి కోసం జరుగుతున్న పరుగులో ప్రపంచ దేశాల మధ్య భారత్‌ ముందు వరుసలో ఉందని పేర్కొన్నారు. ప్రపంచ సంక్షోభాన్ని పరిష్కరించి తమను నడిపించాలనే ఆశతో పలు దేశాలు భారత్‌ వైపు ఆసక్తిగా చూస్తున్నాయని తెలిపారు. ఆ అంచనాలను నెరవేర్చాల్సిన గురుతర బాధ్యత దేశంపై ఉందన్నారు. సవాళ్లను స్వీకరించడానికి ముందుకు రావాలని యువతకు పిలుపునిచ్చారు. కలలు పెద్దవిగా కనాలని, వాటిని సాధించడానికి కృషి చేస్తే ప్రపంచంలోని ఏ శక్తీ అడ్డుకోలేదని తెలిపారు. సవాలులేని జీవితం వ్యాయామంలేని శరీరం వంటిదన్నారు. కార్యక్రమంలో భాగంగా గణతంత్ర దినోత్సవ శిబిరంలోని తమ అనుభవాన్ని ఎన్‌సీసీ క్యాడెట్లు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు పంచుకున్నారు. ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ (టీఎన్‌పీఏఎన్‌) డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ అతుల్‌ కుమార్‌ రస్తోగి, ఎన్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్‌ ఈశ్వరమూర్తి, గవర్నర్‌కు ముఖ్యకార్యదర్శి ఆనందరావు వి.పాటిల్‌, అన్నా విశ్వవిద్యాలయం ఉపకులపతి వేల్‌రాజ్‌, తమిళనాడు ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ సి.సామువేల్‌ చెల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని