logo

ప్రైవేటు పాఠశాలలకు కొత్త నిబంధనలు

ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వం నూతన నిబంధనలు ప్రకటించింది. ప్రయివేటు నర్సరీ,  మెట్రిక్యులేషన్‌ పాఠశాలలకు 50 సంవత్సరాల తర్వాత నిబంధనల్లో మార్పు చేసింది.

Published : 03 Feb 2023 01:53 IST

వడపళని, ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రయివేటు పాఠశాలలకు ప్రభుత్వం నూతన నిబంధనలు ప్రకటించింది. ప్రయివేటు నర్సరీ,  మెట్రిక్యులేషన్‌ పాఠశాలలకు 50 సంవత్సరాల తర్వాత నిబంధనల్లో మార్పు చేసింది. విద్యార్థుల ప్రవేశాలు, పాఠశాలల గుర్తింపులకు కొత్త నిబంధనలు వర్తిస్తాయని గురువారం తెలిపింది. ప్లేస్కూళ్లకు డిపాజిట్‌ కింద రూ.50 వేలు, నర్సరీ, ప్రైమరీకి అయితే రూ.లక్ష, మాధ్యమిక పాఠశాలకు రూ.2 లక్షలు, హయ్యర్‌ సెకండరీ పాఠశాలలకయితే రూ.3 లక్షలు డిపాజిట్లుగా చెల్లించాలి. పాఠశాలల గుర్తింపుకోసం ప్రత్యేక ఫీజు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన పుస్తకాలనే తప్పనిసరిగా వాడాలి.   ప్లే స్కూళ్లలో చేరే వారికి కనీసం రెండేళ్లు, ఎల్‌కేజీకి మూడు, యూకేజీకి నాలుగు, ఒకటో తరగతికి కనీసం ఐదేళ్ల వయసుండాలి. జులై 31వ తేదీ నాటికి ఉన్న వయసును పరిగణనలోకి తీసుకోవాలి. గుర్తింపు పొందిన ఏ పాఠశాలనుంచైనా బదిలీ ధ్రువపత్రాలతో మరో బడిలో విద్యా సంవత్సరంలో చేరవచ్చు. మైనార్టీ కమ్యూనిటీ బడుల్లో కాకుండా, మిగిలిన బడుల్లో  రిజర్వేషన్‌ కోటాను తప్పనిసరిగా అమలు చేయాలి. ఒక్కొక్క పాఠశాలలో కౌన్సిల్‌ అధ్యాపకులు, సిబ్బంది ఉండాలి. కౌన్సిల్‌ కోసం ఉన్న సభ్యుల వివరాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి తెలియజేయాలి. విద్యార్థుల ప్రవేశాలు, పరీక్షలు నిర్వహించేందుకు కౌన్సిల్‌ బాధ్యత వహించాలి.

ఉపాధ్యాయులకు శిక్షణ

ప్రభుత్వ బడుల్లో ఉపాధ్యాయులకు ఇచ్చినట్లుగా ప్రయివేటు బడుల ఉపాధ్యాయులు కూడా శిక్షణకు హాజరుకావాలి. పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, ప్రిన్సిపల్స్‌ సమక్షంలో అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, సిబ్బందితో ఒక సర్వీస్‌ కమిటీ ఉండాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయులు నేరాలకు పాల్పడితే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తారు. ప్రీకేజీలో 15, ఎల్‌కేజీ నుంచి అయిదో తరగతి వరకు 30, 6 నుంచి 8 తరగతులకు  35, 9 నుంచి 12 (ప్లస్‌టూ) వరకు 40 మంది విద్యార్థులుండాలి.

ప్రత్యేక తరగతులు నిషేధం

పరీక్ష ఫలితాలకు ముందుగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకూడదు. విద్యార్థుల్లో ఎవరైనా చదువులో వెనుకబడి ఉంటే అటువంటి వారిని నిరుత్సాహపరచి, పరీక్ష రాయకుండా చేయకూడదు. సరైన హాజరు లేకుండా ఉన్న వారిని మాత్రమే పరీక్షలు రాసేందుకు అనుమతించకూడదు. ప్లస్‌వన్‌, ప్లస్‌టూ విద్యార్థులకు కొన్ని సబ్జెక్టులకు నిర్వహించే ప్రత్యేక తరగతులకు చేరాలని ఒత్తిడి చేయకూడదు. నియమ నిబంధనలు పాటిస్తూ వార్షిక పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు