logo

దక్షిణ రైల్వేకు దండిగా నిధులు

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో దక్షిణ రైల్వేకు భారీగా నిధులు సమకూరాయి. ఏకంగా రైల్వే మంత్రే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దక్షిణరైల్వే జోన్‌కు కేటాయించిన బడ్జెట్ వివరాల్ని ప్రత్యేకంగా వెల్లడించారు.

Published : 04 Feb 2023 00:38 IST

బడ్జెట్లో రూ.11313.96 కోట్ల కేటాయింపు
గతం కన్నా తమిళనాడుకు 7 రెట్లు ఎక్కువ

తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో దక్షిణ రైల్వేకు భారీగా నిధులు సమకూరాయి. ఏకంగా రైల్వే మంత్రే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దక్షిణరైల్వే జోన్‌కు కేటాయించిన బడ్జెట్ వివరాల్ని ప్రత్యేకంగా వెల్లడించారు. దీంతో కేటాయింపులపై ప్రత్యేకత సంతరించుకుంది. దక్షిణ రైల్వేలో కేరళ, తమిళనాడు రాష్ట్రాలు పూర్తిగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కొంతభాగం ఉన్నప్పటికీ.. నిధుల్లో మాత్రం తమిళనాడుకు భారీగా దక్కాయనే చెప్పాలి. రైల్వే కేటాయింపులపై ఒక్కసారి చూస్తే..

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-వడపళని

విలేకరులతో మాట్లాడుతున్న జీఎం ఆర్‌ఎన్‌ సింగ్‌, అధికారులు


గతం కంటే మేలు..

దేశంలో దక్షిణ రైల్వేకు ప్రత్యేక స్థానమే ఉంది. దీనికి తగ్గట్లు ఈసారి రైల్వేపనులకు నిధులు వచ్చాయి. ఈ జోన్‌కు కేటాయించిన మొత్తం నిధులు రూ.11313.96 కోట్లుగా రైల్వే యంత్రాంగం ప్రకటించింది. 2022-23 బడ్జెÆట్లో 7114.45 కోట్లు మాత్రమే దక్షిణ రైల్వేకు ఇచ్చారు. ఈసారి సుమారు 4 వేల కోట్లు అధిక బడ్జెÆట్ను ఇవ్వడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశంగా మారింది.


ఆంధ్రా వైపు కొత్త లైన్లకు..

2023-24 (తాజా) బడ్జెట్లో కేటాయించిన రైల్వే నిధుల్లో ఒక్క తమిళనాడు రాష్ట్రానికే ఏకంగా రూ.6,080 కోట్లు వెచ్చిస్తున్నట్లు రైల్వే మంత్రి ప్రకటించారు. అదే 2022-23 బడ్జెట్లో ఈ రాష్ట్రానికి కేవలం రూ.879 కోట్లు మాత్రమే ఇచ్చారు. కానీ ఈసారి భారీగా పెంచడంతో అందరిదృష్టి ఆకర్షిస్తోంది. ఏకంగా 7రెట్ల ఎక్కువ నిధులు తాజాగా బడ్జెట్లో కనిపించాయి.

ఇదివరకే ప్రకటించిన కొత్త లైన్లకు.. రైల్వే గణాంకాల ప్రకారం ఈసారి దక్షిణరైల్వేలో రూ.1158.15 కోట్లు కుమ్మరించారు. ఇందులో ప్రత్యేకించి తమిళనాడుకు 1057.90 కోట్లు కేటాయించారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌ వైపుగా వెళ్లే రైల్వేలైన్లకూ నిధులిచ్చారు. దిండివనం-నగరి మధ్య 179.2 కి.మీ లైనుకు రూ.100 కోట్లు కేటాయించారు. అట్టిపట్టు-పుత్తూరు (88.30కి.మీ) రూ.50 కోట్లు ప్రకటించారు. వీటితో పాటు దక్షిణ రైల్వేకు కీలక ప్రాజెక్టుగా ఉన్న రామేశ్వరం-ధనుష్కొడి మధ్య చేపడుతున్న కొత్తలైనుకు రూ.385.90 కోట్లు ప్రకటించారు. రైల్వే లైన్ల విద్యుదీకరణ ప్రాజెక్టు కింద ఈసారి రాష్ట్రంలోని 9 లైన్లకు రూ.383.92 కోట్లు దక్కాయి.


డబ్లింగ్‌కు పెద్దపీట

ఆయా రూట్లలో డబ్లింగ్‌, త్రిబ్లింగ్‌ రైల్వేలైన్లు వేసేందుకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. దక్షిణ రైల్వేకు దక్కిన మొత్తం నిధుల్లో అత్యధిక భాగం వీటికే దక్కింది. ఈసారి డబ్లింగ్‌ పనులకు ఏకంగా రూ.1564.88 కోట్లు ఇస్తున్నారు. గత బడ్జెÆట్తో పోల్చితే ఇది 310 శాతం ఎక్కువని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో తమిళనాడు భూభాగం పరిధిలో రూ.1321.28 కోట్లు ఇచ్చారు. ఈసారి కొత్త డబ్లింగ్‌ ప్రాజెక్టులేవీ దక్షిణ రైల్వేకు దక్కలేదు. రెండురాష్ట్రాలకు అనుబంధంగా ఉన్న త్రివేండ్రం-కన్యాకుమారి 86.56కి.మీ లైను డబ్లింగ్‌కు రూ.808కోట్లు కేటాయించారు. రైలుపట్టాల నిర్వాహణకు ప్రత్యేకించి రూ.1300కోట్లు ప్రకటించారు.


సౌకర్యాల కోసమిలా..

రైల్వేస్టేషన్లకు వచ్చివెళ్లే ప్రయాణికులకు ఆయా రైల్వేస్టేషన్లలో సౌకర్యాల్ని పెంచుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్లోనూ ప్రాధాన్యత ఇచ్చారు. దక్షిణ రైల్వేకు ఈ కోవలో రూ.1081.17 కోట్లు దక్కాయి. రైల్వేస్టేషన్లలో అవసరమైన హైలెవెల్‌ వంతెనలు, ఫుట్ఓవర్‌ బ్రిడ్జిలు, ఇతర పెట్టుబడుల ద్వారా స్టేషన్ల వృద్ధి కలిపి.. రూ.290 కోట్లు ఇచ్చారు. మరోవైపు 150 లిఫ్టుల ఏర్పాటుకు రూ.34.47 కోట్లు కేటాయించారు.


రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ

అమృత్‌భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఉన్నతీకరించేందుకు దక్షిణరైల్వేలో మొత్తం 90 స్టేషన్లను ఎంపికచేశారు. ఒక్కో రైల్వేడివిజన్‌కు 15చొప్పున కేటాయించారు. ఆయా స్టేషన్లను వృద్ధి చేయడానికి ప్రత్యేకించి నిధులు కేటాయించారు. ఈసారి బడ్జెట్లో ప్రకటించిన దాన్నిబట్టి.. దక్షిణరైల్వేకు రూ.1600కోట్లు దక్కినట్లయ్యింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని