logo

అన్నా జ్ఞాపకాలతో శాంతి ర్యాలీ

దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై 54వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అధ్యక్షతన మంతుల్రు, డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు శాంతి ర్యాలీ నిర్వహించారు.

Published : 04 Feb 2023 00:38 IST

ర్యాలీలో పాల్గొన్న స్టాలిన్‌ తదితరులు

చెన్నై, న్యూస్‌టుడే: దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై 54వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అధ్యక్షతన మంతుల్రు, డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు శాంతి ర్యాలీ నిర్వహించారు. వాలాజా రోడ్డులో ప్రారంభమైన ర్యాలీ మెరినా బీచ్‌లోని అన్నాదురై సమాధి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వాలాజా రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలను పోలీసులు అమలు చేశారు. ర్యాలీలో డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, కోశాధికారి టీఆర్‌ బాలు, మంత్రులు పొన్ముడి, ఉదయనిధి, సుబ్రమణియన్‌, శేఖర్‌బాబు, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ తదితరులు పాల్గొన్నారు. అన్నాదురై సమాధి వద్ద స్టాలిన్‌ అధ్యక్షతన పుష్పాంజలి ఘటించారు. కరుణానిధి సమాధికి కూడా నివాళులర్పించారు. అన్నాదురై వర్ధంతి సందర్భంగా ట్విట్టర్‌లో ‘ఎండ్రెండ్రుం అన్నా’ అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్‌ అయ్యింది.

* ఈ సందర్భంగా స్టాలిన్‌ తన ట్విట్టర్‌ పేజీలో.. తమిళతల్లి తొలిబిడ్డ అన్నాదురై మరణించిన రోజన్నారు. ఆయన జ్ఞాపకాలను మోస్తూ శాంతి ర్యాలీ చేసినట్లు తెలిపారు. తనయుడిగా ఆయన పేరుపెట్టిన తమిళనాడును ఉన్నతస్థాయికి తీసుకెళ్దామని పిలుపునిచ్చారు.


విశ్వనాథ్‌ మృతికి సంతాపం

చెన్నై, న్యూస్‌టుడే: సీనియర్‌ దర్శకుడు కె.విశ్వనాథ్‌ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంతాపం తెలిపారు. కాలగర్భంలో కనుమరుగుకాని చలనచిత్రాలు ద్వారా దేశస్థాయిలో ప్రజల మనస్సుల్లో నిండుకున్న మహా కళాకారుడు దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ అన్నారు. ఆయన మృతి అమితావేదన, దిగ్భ్రాంతికి గురి చేసిందని తెలిపారు. శంకరాభరణం, సలంగై ఒలి (తెలుగు వెర్షన్‌ సాగర సంగమం) తదితర సంగీత నేపథ్యం కలిగిన కావ్యాలను తెరకెక్కించిన కళా శిల్పి అని అభివర్ణించారు. దేశ అత్యుత్తమ పురస్కారం దాదా సాహెబ్‌ ఫాల్కే పురస్కారం సహా 5 జాతీయ, 7 నంది, 10 ఫిలింఫేర్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర తదితర పలు పురస్కారాలు, అభినందనలు పొందారని తెలిపారు. సినీ రంగంలో ప్రసిద్ధి గాంచిన తారగా ప్ర£కాశించారని పేర్కొన్నారు. సిరిసిరి మువ్వ, సిప్పిక్కుళ్‌ ముత్తు (తెలుగు వెర్షన్‌ స్వాతిముత్యం), శృతిలయలు, శుభసంకల్పం తదితర పలు ఉన్నత చిత్రాలను పలు భాషల్లో దర్శకత్వం వహించిన ఆయన 24కుపైగా చిత్రాల్లో ఉత్తమ కథాపాత్రల్లో నటించారని తెలిపారు. ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటు అన్నారు. ఆయన్ను కోల్పోయి బాధపడుతున్న కుటుంబ సభ్యులు, సినీ రంగంవారు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారశాఖ మంత్రి స్వామినాథన్‌ కూడా సంతాప ప్రకటన విడుదల చేశారు. దర్శకుడు విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులు, సినీరంగం మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


నెల్లై తంగరాజ్‌ మృతికి...

చెన్నై, న్యూస్‌టుడే: నాటక కళాకారుడు నెల్లై తంగరాజ్‌ మృతికి ముఖ్యమంత్రి స్టాలిన్‌ సంతాపం తెలిపారు. అనారోగ్యంతో ఆయన మరణించారనే వార్త ఆవేదన కలిగించిందని పేర్కొన్నారు. ‘పరియేరుం పెరుమాళ్‌’ చలన చిత్రంలో పరిచయమై భావోద్వేగమైన నటనతో అందరి మనసుల్లో చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆయన మృతితో బాధపడుతున్న కుటుంబ సభ్యులు, కళారంగం వారికి ప్రగాఢ సానుభూతి వెల్లడించారు.


నియామక పత్రాల అందజేత

నియామక పత్రం అందిస్తున్న ముఖ్యమంత్రి

చెన్నై, న్యూస్‌టుడే: వైద్య, గ్రామీణ ఆరోగ్యసేవల డైరెక్టరేట్‌ కింద కొనసాగే ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం 570 మంది ఒప్పంద నర్సులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వారికి నియామక ఉత్తర్వులు అందించడానికి సూచనప్రాయంగా ఐదుగురికి సచివాలయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ శుక్రవారం నియామక ఉత్తర్వులు అందించారు. ఆహార భద్రతా శాఖకు చెందిన చెన్నై, మదురై, కోయంబత్తూరు, తిరునెల్వేలి, సేలం, తంజావూరులలోని ఆహార పరిశోధనా కేంద్రాలకు 19 మంది ల్యాబ్‌ టెక్నీషియన్లు గ్రేడ్‌-2లను మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎంపిక చేసింది. వారికి నియామక ఉత్తర్వులు అందించడానికి సూచనప్రాయంగా ముగ్గురికి ముఖ్యమంత్రి ఉత్తర్వులు అందించారు. సర్వీసులో మరణించిన వైద్య విద్యా డైరెక్టరేట్‌ ఉద్యోగుల 21 మంది వారసులను జూనియర్‌ అసిస్టెంట్లుగా కారుణ్య ప్రాతిపదికన నియామకాలు అందించడానికి సూచనప్రాయంగా నలుగురికి ఉత్తర్వులు అందించారు. కార్యక్రమంలో మంత్రి సుబ్రమణియన్‌, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి సెంథిల్‌కుమార్‌, మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ గ్లాడ్సన్‌ పుష్పరాజ్‌, ప్రజారోగ్యం, వ్యాధినివారణ ఔషధ సంచాలకులు సెల్వ వినాయగం, వైద్యవిధ్య సంచాలకులు శాంతిమలర్‌, వైద్య, గ్రామీణ ఆరోగ్యసేవల సంచాలకులు హరిసుందరి, ఆహార భద్రత అదనపు కమిషనరు దేవ పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని