logo

ఐఐటీఎం విద్యార్థులకు కార్గిల్‌ ఉపకారవేతనం

యూఎస్‌ గ్లోబల్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ కార్పొరేషన్‌ సంస్థ ‘కార్గిల్‌’, ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీఎం) బీఎస్‌ డిగ్రీ చదివే వారికి ఉపకారం వేతనం అందించేందుకు చేతులు కలిపింది.

Published : 04 Feb 2023 00:38 IST

ఒప్పంద పత్రాలతో మనుసంతానం, సుమిత్‌ గుప్తా

వడపళని, న్యూస్‌టుడే: యూఎస్‌ గ్లోబల్‌ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ కార్పొరేషన్‌ సంస్థ ‘కార్గిల్‌’, ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ మద్రాస్‌ (ఐఐటీఎం) బీఎస్‌ డిగ్రీ చదివే వారికి ఉపకారం వేతనం అందించేందుకు చేతులు కలిపింది. తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల విద్యార్థులైన వంద మందికి డాటా సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌లో బీఎస్‌ కోర్సు చేస్తే ఉపకార వేతనం ఉపయోగకరంగా ఉండనుంది. అభ్యర్థుల విద్యా నైపుణ్యాలకు అనుగుణంగా ఉపకార వేతనాలకు ఎంపిక చేస్తారు. ఏడాదికి 7,500 మంది ఈ కోర్సులో చేరుతున్నారు. వీరిలో 25 నుంచి 30 శాతం మంది విద్యార్థులు ఏడాదికి రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు ఉన్నారని ఐఐటీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఆచార్యులు మనుసంతానం, భారత్‌లోని కార్గిల్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ సంస్థ కంట్రీ హెడ్‌ సుమిత్‌ గుప్తా ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. 2020 జూన్‌లో ప్రారంభమైన బీఎస్‌ డాటా సైన్స్‌ కోర్సు ఇప్పటివరకు ఆరు అకడమిక్‌ సీజన్లు పూర్తి చేసుకుని, మూడో సంవత్సరంలోకి అడుగుపెట్టనుంది. ఈ కోర్సులో 22 వేల మంది చేరి విజయవంతంగా పూర్తి చేశారు.  వీరిలో 17 వేల మంది నైపుణ్యంతో రాణించగా, 195 మంది డిగ్రీ స్థాయి, 4,500 పైచిలుకు మంది డిప్లొమా సాధించారు. కార్గిల్‌ సంస్థ ఉపకార వేతనాలందించేందుకు ముందుకు రావడం పట్ల డీన్‌, ఆచార్యులు మహేష్‌ పంచగ్నుల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కోర్సుల్లో చేరే వారిలో ఎక్కువ మంది మొదటిసారిగా డిగ్రీలో చేరుతున్నవారే అధికం. వీరి తల్లిదండ్రులు దినసరి కార్మికులు, రైతులు లాంటి జీవనోపాధితో కాలం వెళ్లదీస్తున్నారని పంచగ్నుల అన్నారు. సుమిత్‌ గుప్తా మాట్లాడుతూ... ఆదాయం తక్కువగా ఉన్న కుటుంబాల వారికి ఐఐటీతో కలిసి ఉపకార వేతనం అందించడం గర్వకారణంగా ఉందన్నారు.


 ఉపకారవేతనం అందుకున్న విద్యార్థులతో ఐఐటీ, కార్గిల్‌ ప్రతినిధులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని