logo

కలిపేందుకు కమలనాధుల కసరత్తు

అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ సమస్య మొదలై ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే.

Published : 04 Feb 2023 00:38 IST

ఈపీఎస్‌, ఓపీఎస్‌తో భాజపా నేతల భేటీ
ఎడప్పాడి వర్గ అభ్యర్థి నామినేషన్‌ వాయిదా
ఓపీఎస్‌ అభ్యర్థి దాఖలు

* పన్నీర్‌సెల్వంతో సీటీ రవి, అన్నామలై, కరు.నాగరాజన్‌ * ఎడప్పాడితోనూ.. * విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న అన్నామలై

సైౖదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ సమస్య మొదలై ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోడు తూర్పు నియోజకవర్గంలో పోటీ చేయనున్నట్లు ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు ప్రకటించి అభ్యర్థులను కూడా ప్రకటించాయి. అయితే పన్నీర్‌.. భాజపా పోటీ చేయాలని భావిస్తే తమ అభ్యర్థిని ఉపసంహరించుకుంటామని తెలిపారు. దీంతో భాజపా ఎన్నికల్లో పోటీ చేస్తుందా? చేయకుంటే ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాల్లో ఎవరికి మద్దతు ఇస్తుందనే చర్చలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఎడప్పాడి, పన్నీర్‌ వర్గాలు ఎన్నికల పనుల బృందాన్ని నియమించి పనులు ప్రారంభించాయి. ఈరోడులో పళనిస్వామి తరఫున ఎన్నికల డిపో ప్రారంభించి పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం ఎడప్పాడి తరఫున ఏర్పాటు చేసిన బ్యానరులో ఎన్డీయే కూటమి అన్న పేరుకు బదులు నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రొగ్రెసివ్‌ అలయన్స్‌ అని ఏర్పాటు చేయటం కలకలం రేపింది. పళనిస్వామి భాజపాతో తెగదెంపులు చేసుకోబోతున్నారా? అనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా అన్నాడీఎంకే కూటమి పార్టీ అయిన భాజపా నేతల చిత్రాలు కూడా ఆ బ్యానర్లో లేకపోవడంత గమనార్హం. అయితే సాయంత్రం లోపల మళ్లీ ఆ బ్యానరును మార్చి ఎన్టీయే కూటమి అని మార్చారు. ఇదిలా ఉండగా గురువారం అత్యవసరంగా దిల్లీ బయలుదేరి వెళ్లిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై భాజపా పెద్దలతో ఉప ఎన్నికలు, అన్నాడీఎంకే వ్యవహారం గురించి చర్చలు జరిపినట్లు సమాచారం. శుక్రవారం ఈపీఎస్‌, ఓపీఎస్‌లను అన్నామలై కలిసి మాట్లాడారు. ఇద్దరినీ కలిపేందుకు భాజపా యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎడప్పాడి వర్గ అభ్యర్థి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయాల్సి ఉండగా దానిని 7కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.


ఏకం చేసేందుకు యత్నాలు

ఈపీఎస్‌, ఓపీఎస్‌లతో భేటీ అనంతరం భాజపా ప్రధాన కార్యాలయం కమలాలయంలో భాజపా తమిళనాడు బాధ్యుడు సీటీ రవి, రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అందులో సీటీ రవి మాట్లాడుతూ... 1972లో ఎంజీఆర్‌ దుష్టశక్తులను తుదముట్టించేందుకు అన్నాడీఎంకేను స్థాపించారని తెలిపారు. ప్రస్తుతం కూడా రాష్ట్రంలో అదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఒక కుటుంబ కోసం తమిళనాడు ప్రజలకు, సంస్కృతికి వ్యతిరేకంగా డీఎంకే వ్యవహరిస్తుందని తెలిపారు. డీఎంకేకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారని తెలిపారు. అధికార, ధన బలాన్ని డీఎంకే ఈరోడు తూర్పు ఉప ఎన్నికల్లో ఉపయోగిస్తుందని ఆరోపించారు. డీఎంకేను నిలువరించేందుకు ఉమ్మడి అన్నాడీఎంకే అవసరమన్నారు. ఉప ఎన్నికలు, రాష్ట్ర ప్రజల సమస్యల గురించి ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలతో మాట్లాడామని తెలిపారు. ఇద్దరినీ కలిపేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 7 వరకు అవకాశం ఉందన్నారు. ఎన్డీయే కూటమిలోనే అన్నాడీఎంకే ఉందన్నారు. అన్నామలై మాట్లాడుతూ... జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల మేరకు పన్నీర్‌, ఎడప్పాడితో మాట్లాడామని తెలిపారు. డీఎంకే 2023లో కూడా దుష్టశక్తిగానే ఉందన్నారు. ధరల పెరుగుదలతో ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రానికి స్థిరమైన ఎన్డీయే కూటమి అవసరమన్న విషయాన్ని ఓపీఎస్‌, ఈపీఎస్‌లకు తెలిపామని పేర్కొన్నారు. 7వ తేదీ వరకు సమయం ఉందని, వేర్వేరుగా కాకుండా అన్నాడీఎంకే వర్గాలు అన్నీ కలిసి ఒకే అభ్యర్థిని ఎంచుకుని పోటీ చేయించాలన్నదే తమ అభిప్రాయమన్నారు.


స్తంభించనున్న రెండాకుల గుర్తు?

ఇదిలా ఉండగా ఈపీఎస్‌ పిటిషన్‌కు జవాబు పిటిషన్‌ దాఖలు చేసి ఎన్నికల కమిషన్‌ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున ఇంతవరకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామిని అంగీకరించలేదని, అలాగే సర్వసభ్య సమావేశ తీర్మానాలు కూడా అంగీకరించలేదని తెలిపింది. ఇంతవరకు రెండాకుల గుర్తు ఎవరూ ఆశ్రయించలేదని చెప్పింది. అయితే గుర్తును కోరే పత్రంలో సంతకం చేసేందుకు సిద్ధమని ఓపీఎస్‌ ఇదివరకే ప్రకటించారు. అయితే ఎడప్పాడి ససేమిరా అంటున్నారు. దీంతో గుర్తు స్తంభించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దీంతో గుర్తు ఎవరికి దక్కుతుందా? అని కార్యకర్తలు గందరగోళంలో ఉన్నారు. రెండాకుల గుర్తు తమకు కేటాయించాలని, తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అనే ప్రాతిపదికన తన సంతకంతో కూడిన నామినేషన్‌ను స్వీకరించాలని పళనిస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం విచారించింది. అందులో సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్నాడీఎంకే అభ్యర్థిని ఎంపిక చేయాలని, అందులో పన్నీర్‌సెల్వం తదితరులకు ఓటేసేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపింది. ఈ తీర్పు ఈరోడు తూర్పు ఉప ఎన్నికలకు మాత్రమే అని పేర్కొంది. దీంతో అన్నాడీఎంకే వ్యవహారం గందరగోళంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని