logo

మూగబోయిన సుస్వరాల ‘వాణి’

ఏ పాటైనా తన ప్రత్యేకతను చాటుకున్నారు... పద్మవిభూషణ్‌  స్థాయికి ఎదిగారు.. పురస్కారం స్వీకరించకముందే కన్నుమూశారు ప్రముఖ సినీ గాయని వాణీ జయరామ్‌.

Published : 05 Feb 2023 00:58 IST

కోడంబాక్కం, న్యూస్‌టుడే: ఏ పాటైనా తన ప్రత్యేకతను చాటుకున్నారు... పద్మవిభూషణ్‌  స్థాయికి ఎదిగారు.. పురస్కారం స్వీకరించకముందే కన్నుమూశారు ప్రముఖ సినీ గాయని వాణీ జయరామ్‌. చెన్నైలో శనివారం ఆమె అందరి నుంచి శాశ్వత వీడ్కోలు తీసుకున్నారనే విషయం తెలిసి అభిమానులు విషాదంతో మునిగారు. పలువురు సినీ ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పించారు.   మంచం నుంచి జారిపడి గాయాలైనందువల్లే ఆమె  కన్నుమూసినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది.  సినీ, సంగీత ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె లేని లోటు తీరనిదన్నారు.

ప్రముఖుల సంతాపం

చెన్నై, న్యూస్‌టుడే: గాయని వాణీ జయరామ్‌ మృతికి సీఎం స్టాలిన్‌ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. స్టాలిన్‌ తన సందేశంలో... భారత చలనచిత్ర రంగంలో సంగీత కోకిలగా విరాజిల్లిన కలైవాణి అలియాస్‌ వాణీ జయరామ్‌ మృతి ఆవేదన కలిగించిందని తెలిపారు. వేలూరులో పుట్టి ప్రపంచవ్యాప్తంగా తన మధుర గానంతో ప్రసిద్ధి గాంచారని పేర్కొన్నారు. తమిళం తదితర 19 భాషల్లో 10 వేలకుపైగా అద్భుత పాటలు పాడి అభిమానుల మనసులో చెరగని స్థానం పొందారని తెలిపారు. ఇటీవల ఆమెకు పద్మభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించినప్పుడు శుభాకాంక్షలు చెప్పానని గుర్తు చేసుకున్నారు. ఆ పురస్కారాన్ని స్వీకరించడానికి ముందే ఈ లోకాన్ని వీడటం బాధాకరమని తెలిపారు. ఆమె మృతి సంగీత లోకానికి తీరని లోటు అన్నారు. ఆమెను కోల్పోయిన కుటుంబ సభ్యులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వాణీ జయరామ్‌ మరణవార్త దిగ్భ్రాంతి కలిగించిందని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి స్వామినాథన్‌ తెలిపారు. తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ, కన్నడం తదితర పలు భాషాల్లో 1 0వేలకుపైగా పాటలు పాడి ప్రత్యేక ముద్ర వేశారన్నారు. ఆమెను ‘సప్తస్వరాల గాన సరస్వతి’గా అభిమానులు పిలుచుకున్నారని తెలిపారు. ఆమె ‘అపూర్వ రాగంగళ్‌’, ‘శంకరాభరణం’, ‘స్వాతికిరణం’ చిత్రాలకుగాను జాతీయ పురస్కారాలు పొందారని పేర్కొన్నారు.

దర్యాప్తు చేసి వెళుతున్న ఫోరెన్సిక్‌ అధికారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని