logo

వానియంబాడిలో విషాదం

తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని వారపు సంత ప్రాంతంలో శనివారం జరిగిన చీరల టోకెన్ల పంపిణీ కార్యక్రమం విషాదానికి దారితీసింది.

Published : 05 Feb 2023 00:58 IST

తొక్కిసలాటలో నలుగురి మృతి
బంధువులతో కిక్కిరిసిన ఆసుపత్రి

ఘటనాస్థలంలో పెద్దఎత్తున గుమికూడిన మహిళలు

వేలూరు, న్యూస్‌టుడే: తిరుపత్తూరు జిల్లా వానియంబాడి సమీపంలోని వారపు సంత ప్రాంతంలో శనివారం జరిగిన చీరల టోకెన్ల పంపిణీ కార్యక్రమం విషాదానికి దారితీసింది. తొక్కిసలాట జరిగి నలుగురు మహిళలు మృత్యువాతపడ్డారు. ఏకంగా 12 మంది  గాయపడటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో వానియంబాడి పట్టణంలో విషాద పరిస్థితులు నెలకొన్నాయి. మృతిచెందిన వారంతా కూలీ పనులు చేసుకుంటున్నవారే. మృతుల్లో నాగమ్మాళ్‌, రాజాత్తి, మల్లిక వితంతువులు. మరో మృతురాలు వళ్లియమ్మాళ్‌కు భర్త ఉన్నారు. మరోవైపు వానియంబాడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మంది మహిళల్లో వృద్ధులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీరిలో ఐదుగురి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లుగా వైద్యులు వెల్లడించారు. క్షతగాత్రుల్లో 9 మంది వితంతువులు ఉన్నారు. తమ ఇంట్లో పెద్దదిక్కుగా ఉన్న మహిళల్ని కోల్పోవడం, ఇలా ఆసుపత్రి పాలవడంతో పెద్దఎత్తున బంధువులు వానియంబాడి ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం నుంచి ప్రాంగణం కిక్కిరిసింది. రద్దీని నియంత్రించేందుకు, ఇతర ఆందోళనలేవీ జరగకుండా చూసేందుకు  పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చీరల పంపిణీ నిర్వాహకుడు అయ్యప్పన్‌ను అరెస్టు చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి ఈవీ వేలు వ్యక్తిగతంగా.. మృతుల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. ఎమ్మెల్యే దేవరాజ్‌ ఈ మేరకు ప్రకటించారు. జిల్లా కలెక్టరు అమర్‌ కుష్వాహా, డీఐజీ ముత్తుస్వామి, వానియంబాడి ఆర్డీఓ ప్రేమలత, జిల్లా ఎస్పీ బాలకృష్ణన్‌, తదితరులు ఆసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించి, సంఘటన వివరాలను సేకరించారు. క్షతగాత్రులకు సరైన వైద్యమందేలా ఆరోగ్యశాఖ జేడీ మారిముత్తు పర్యవేక్షిస్తున్నారు.

ఆర్థిక సాయం ప్రకటన

చెన్నై, న్యూస్‌టుడే: విషాద ఘటన గురించి తెలిసి ఆవేదన చెందినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, తీవ్రంగా గాయపడినవారికి రూ.50వేల వంతున సీఎం సహాయ నిధి నుంచి అందించాలని ఆదేశించినట్టు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని