logo

యువతరం.. ప్రజారవాణాకు దూరం!

నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గాలంటే.. వ్యక్తిగత వాహనాల్ని తగ్గించి ప్రజారవాణాను ఎక్కువగా వినియోగించాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా లేదని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది.

Updated : 06 Feb 2023 03:55 IST

అందుబాటులో లేని సరైన సమాచారం
చెన్నైలో నిర్వహించిన సర్వేలో వెల్లడి

నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గాలంటే.. వ్యక్తిగత వాహనాల్ని తగ్గించి ప్రజారవాణాను ఎక్కువగా వినియోగించాలి. ప్రస్తుతం ఆ పరిస్థితి పూర్తిగా లేదని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. ఇదివరకే నగరంలో ఉన్న ప్రజా రవాణా వ్యవస్థల వివరాలు కచ్చిత సమాచారం తదితర విషయాలు ప్రయాణికులకు అర్థమయ్యే రీతిలో అందుబాటులో లేవని తేలింది. ఫలితంగా అటు వాటికీ నష్టం తప్పడం లేదు.

ఈనాడు, చెన్నై

చెన్నైవాసులు రోజూ ప్రజా, ప్రైవేటు రవాణాలపై ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు ప్రైవేటు వాహనాల హవా బాగా పెరిగింది. చెన్నైకి చెందిన సిటిజెన్‌, కన్జ్యూమర్‌, సివిక్‌ యాక్షన్‌ గ్రూప్‌ (కాగ్‌) ఆధ్వర్యంలో నగరంలో ప్రత్యేక సర్వే జరిగింది. ప్రజారవాణాలో కొత్త వారి సంఖ్య ఎందుకు పెరగడంలేదు, ఇప్పుడు వినియోగిస్తున్నవారి పరిస్థితులు ఎలా ఉన్నాయి, కొత్తగా తీసుకురావాల్సిన మార్పులు, ప్రజలేం కోరుకుంటున్నారనే కోణంలో ఈ సర్వే చేశారు. ఇందులో వెల్లడైన కీలక విషయాలు ఇప్పుడు యంత్రాంగానికి సవాల్‌గా మారుతున్నాయి.

30ఏళ్లలోపు వారే..

రోజువారీ ప్రయాణించే కుటుంబాలు ప్రజారవాణా వ్యవస్థలోని లోపాలతో చాలారకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నట్లు తేలింది. పైగా 30ఏళ్లు, అంతకు తక్కువ వయసున్నవారు ప్రైవేటు రవాణావైపు మొగ్గుచూపినట్లుగా నివేదికలో చూపారు. అనువైన రూట్లలో వసతి, సమయానుకూలంగా అవి చేరతాయన్న సమాచారం, స్టాపులు, ఛార్జీలు ఆమోదయోగ్యంగా ఉండాలని చెప్పారు. ప్రజారవాణా అనుకున్న సమయానికి రావడం, గమ్యానికి చేరడం లాంటివాటిలో కచ్చితత్వం ఉంటే దీనిపైనే ఆధారపడతామని, అప్పుడు ప్రైవేటువైపు వెళ్లాల్సిన అవసరమే రాదని వివరించారు.

వివరాలు తెలిసేదెలా?

ప్రభుత్వం ప్రయాణికుల కోసం పలు వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా ప్రజారవాణా సమాచారాన్ని ఆన్‌లైన్‌లో ఉంచుతోంది. కానీ చాలా వెబ్‌సైట్లలో సరైన వివరాలు లేకపోవడంతో ఇబ్బందులు తప్పవడం లేదని ప్రయాణికులు చెప్పారు. మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎంటీసీ) తన వెబ్‌సైట్లో 2018 ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఛార్జీల వివరాల్ని ఉంచింది. బస్‌ రూటు నెంబర్లు మాత్రం అందుబాటులో లేవు. కొత్తగా ఆ వెబ్‌సైట్లోకి వెళ్లినవారికి ఈ వివరాలు దొరకడంలేదు. ఇదే సంస్థ తాజాగా ‘చెన్నై బస్‌’ యాప్‌ విడుదల చేసింది. కానీ ఇందులో బస్‌ లైవ్‌ట్రాకింగ్‌ సేవలు లేవు. అనుకున్న బస్సు ఎప్పుడు చేరుకుంటుందో తెలిపే నావిగేషన్‌ రూపొందించలేదు. టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలుచేసే వెసులుబాటునూ కల్పించలేదని తేల్చారు. సబర్బన్‌ రైల్వే, మాస్‌ రాపిడ్‌ ట్రాన్సిట్ సిస్టం (ఎమ్మార్టీఎస్‌) సంబంధించి దక్షిణ రైల్వే వెబ్‌సైట్లో సమయాలపై సమాచారం అందుబాటులో లేదని తేల్చారు.

‘మెట్రో’ కాస్త మెరుగు

ప్రజారవాణా వెబ్‌సైట్లలో మెట్రోరైల్‌ మాత్రమే మెరుగైన సమాచారం ఇస్తోంది. ఛార్జీలు, నిబంధనలు, పార్కింగ్‌కోసం అందుబాటులో ఉన్న సౌకర్యాలు లాంటివన్నీ కచ్చితంగా అప్‌డేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. పైగా రూట్లలోని స్టేషన్లలో రైళ్ల రాకపోకల సమయాల్ని కూడా ప్రకటిస్తున్నారు. కొన్ని లోపాల్ని కూడా గుర్తించారు. టికెట్ల కొనుగోళ్లకు సంబంధించి వివిధ కార్డుల్ని ఆన్‌లైన్‌లో పొందుపరిచినా, అవి దేనికి ఉపయోగపడతాయన్న సమగ్ర సమాచారం లేదు. వాటిని పొందాలంటే ప్రత్యేక పీడీఎఫ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి వస్తోందని వివరిస్తున్నారు.


మార్పులు చాలానే రావాలి

ప్రజారవాణా మనుగడ సాగించేలా కొత్త ప్రయాణికుల్ని ఆకట్టుకునేందుకు లోపాల్ని సవరించాల్సిన బాధ్యత అధికార యంత్రంగంపై ఉందని సర్వే నివేదిక చెబుతోంది. రవాణా, భద్రత, సౌకర్యాల్ని ప్రజలకు సులభతరం చేసినప్పుడే మొగ్గుచూపుతారని వెల్లడించారు. సమాచారాన్ని వెబ్‌సైట్ల ద్వారా, యాప్‌లద్వారా, సైన్‌బోర్డుల ద్వారా అందుబాటులో ఉంచాలని తెలిపారు. పైగా వాహనాల రియల్‌టైమ్‌ సమాచారాన్ని చేరవేయాలని చెప్పారు. ఫిర్యాదులపై వేగంగా స్పందించాలని కూడా సూచించారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని