logo

50 చోట్ల అదనంగా 200 కెమెరాలు

చెన్నై నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిని పసిగట్టేందుకు చెన్నై మహానగర పోలీసు విభాగం ఇప్పటికే పలు ప్రాంతాల్లో ‘ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌’ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలను ఏర్పాటు చేసింది.

Updated : 06 Feb 2023 03:59 IST

కూడలిలో ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు

వడపళని, న్యూస్‌టుడే: చెన్నై నగరంలో ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిని పసిగట్టేందుకు చెన్నై మహానగర పోలీసు విభాగం ఇప్పటికే పలు ప్రాంతాల్లో ‘ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నిషన్‌’ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలను ఏర్పాటు చేసింది. పెరిగి పోతున్న ట్రాఫిక్‌తో 50 ప్రాంతాల్లో అదనంగా 200 కెమెరాలు అమర్చడానికి టెండరు ఖరారు చేయనుంది. చోరీకి గురైన వాహనాలు, నిబంధనలు ఉల్లంఘించిన వారి వివరాలను ఈ కెమెరాలతో తేలికగా తెలుసుకునే వీలుంది. గత ఏడాది ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా సిగ్నళ్ల వద్ద నిలవకుండా వెళ్లిన వాహనాలు, సెల్‌ ఫోన్లలో మాట్లాడుతూ నడిపిన వారిని గుర్తించగలిగారు. ప్రస్తుతం 16 చోట్ల ‘ట్రాఫిక్‌ రెగ్యులేషన్‌ అబ్జర్వేషన్‌ జోన్‌’ (టీఆర్‌ఓజడ్‌) ప్రాజెక్టులో భాగంగా కెమెరాలతో సేవలు మరింత విస్తరించేందుకు ట్రాఫిక్‌ విభాగం సిద్ధమవుతోంది. 2018-19 కాలంలో ఉల్లంఘించిన వారికి చలాన్లు నేరుగా అందించి, జరిమానా వసూలు చేశారు. ఏఎన్‌పీఆర్‌ కెమెరాల ఆధారంగా కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘వాహన్‌’ పోర్టల్‌ నుంచి  చలాన్లు వాహన యజమానులకు జారీ చేస్తున్నారు. నూతనంగా ఏర్పాటు చేయనున్న కెమెరాలతో నిబంధనలకు అతీతంగా నడిపే వారిని గుర్తించడంతో పాటు ‘ఇంటెలిజెంట్‌ వీడియో మేనేజ్‌మెంట్‌ సిస్టం’ (ఐవీఎంఎస్‌) కూడా పని చేస్తుంది. ఈ పరికరం ద్వారా మరింత నిశితంగా గమనించడం, గుర్తించడం, అప్రమత్తం చేయడంతోపాటు రోడ్లలో పార్కు చేసిన వాహనాలు చోరీకి గురైతే అది కూడా రికార్డు అవుతుంది. చోరీకి గురైన వాహనం రికార్డు అయిన తర్వాత  ఆటోమేటిక్‌గా  సమీపంలోని పోలీసు స్టేషన్లకు, ఇన్‌స్పెక్టర్లు, పై అధికారులకు వాయిస్‌ కాల్‌, సెల్‌ఫోనులో సందేశం, లేదా వాట్సాప్‌ ద్వారాగానీ సమాచారం అందుతుంది. 2017నుంచి గ్రేటర్‌ చెన్నై పోలీసు పరిధిలో ఏడాదికి సగటున 1,420 వాహనాలు చోరీకి గురి కావడమో లేక కనిపించకుండా పోవడమో జరుగుతున్నాయని అధికార గణాంకాలు తెలుపుతున్నాయి. చోరీకి గురైన వాహనాలతో గొలుసు, మొబైల్‌ ఫోన్లు, ఇతర దొంగతనాలకు వినియోగిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో హత్యలు చేసి పారిపోయేందుకు కూడా ఈ తరహా వాహనాలను వాడుతున్నట్టు చెప్పారు. రద్దీ బాగా ఉండే ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన కెమెరాలతో అరాచకాలకు అడ్డుకట్ట వేసే వీలుంటుందని పోలీసులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని