logo

పోర్ట్‌ - మదుర వోయల్‌ మధ్య పైవంతెన పనులు పునఃప్రారంభం త్వరలో

పోర్టు నుంచి మదురవోయల్‌ వరకు నిర్మాణం జరగనున్న అతి పెద్ద పైవంతెన మార్గానికి జూన్‌ నుంచి పనులు పునః ప్రారంభం కానున్నాయి.

Published : 06 Feb 2023 00:49 IST

వడపళని, న్యూస్‌టుడే

పైవంతెన డిజైన్‌

పోర్టు నుంచి మదురవోయల్‌ వరకు నిర్మాణం జరగనున్న అతి పెద్ద పైవంతెన మార్గానికి జూన్‌ నుంచి పనులు పునః ప్రారంభం కానున్నాయి. దీనికి పదకొండేళ్ల క్రితమే శ్రీకారం చుట్టారు. పలు కారణాలతో పనులు ముందుకు సాగలేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, చెన్నై రేవుల అధికారులతో సమావేశాలు జరిగిన అనంతరం నిర్మాణానికి రంగం సిద్ధమైంది.  కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సలహాదారు సంస్థ ‘ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ’ (ఏఈటీ) ఇటీవల అనుమతించింది. ఇప్పటికే నిర్మాణం జరిగిన స్తంభాల తీరుతెన్నులు పరిశీలించాలని పేర్కొంది. ఇన్నేళ్లు ఈ స్తంభాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. ఐఐటీ మద్రాస్‌ లేదా మంచి పేరున్న సంస్థతో స్తంభాలను పరిశీలించాలని సూచించింది.

* రూ. 5,721 కోట్లతో....: ఆరు వరుసలతో నిర్మాణం జరగనున్న ఈ భారీ ప్రాజెక్టుకు రూ. 5,721 కోట్ల వ్యయం కానుంది. మొదటి రెండు అంతస్తుల్లో కార్లు, బస్సులు, ఇతర వాహనాలు పయనిస్తాయి. పై అంతస్తులో మాత్రం ఓడ రేవుకు వెళ్లే వాహనాలు మాత్రమే తిరుగాడుతాయి. ఈ భారీ పైవంతెన నిర్మాణం పూర్తయిన తర్వాత ఎగ్మూరు, నుంగంబాక్కం, అరుంబాక్కం, కోయంబేడు ప్రాంతాల్లో రద్దీ బాగా తగ్గే అవకాశాలు ఉంటాయని అంచనా. ఇప్పటికే ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. 15 ప్రవేశ, బయటకు వెళ్లే మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. రోజుకు 60 నుంచి 90 వేల వరకు వాహనాలకు లబ్ది చేకూరనుంది. మార్గంలో అక్కడక్కడా కూవం నది కూడా ఉండటం, తొలుత నాలుగు లేన్ల పైవంతెనకు అనుకూలంగా డిజైన్‌ చేయడంతో 2010లో డీఎంకే హయాంలోనే రూ. 1,815 కోట్ల వ్యయంతో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ స్తంభాలు ఏ స్థితిలో ఉన్నాయో పరిశీలించాలని కమిటీ ఆదేశించింది. అవసరమైతే డిజైన్‌లో మార్పుచేర్పులు కూడా చేయాలని పేర్కొంది. అనంతరం 2012లో అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చాక పర్యావరణ స్థితులపై ప్రాజెక్టులో జాప్యం జరిగింది. కూవం మార్గంలో 375 స్తంభాల వరకు నిర్మాణం కావాల్సి ఉందని, పునాదులు కూవం లోపలి నుంచి నిర్మాణం కావాలని జలమండలి పేర్కొంది. అన్ని అనుమతుల తర్వాత అది కూడా అనుసరించాల్సిన అవసరం ఉందని చెన్నై పోర్ట్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ సునీల్‌ పాలివాల్‌ పేర్కొన్నారు. 2023 జనవరిలో ‘కోస్టల్‌ రెగ్యులేటరీ క్లియరెన్స్‌’ (సీఆర్‌జడ్‌) నుంచి కూడా అనుమతి లభించింది.

కూవం వద్ద నిర్మితమైన స్తంభాలు

* టెండర్ల ఆహ్వానం: 2022 సెప్టెంబరులోనే ‘నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌హెచ్‌ఏఐ) దీనికి టెండర్లను ఆహ్వానించింది. ఈ నెలాఖరులో ఖరారు చేసే ఆస్కారముంది. ఎన్‌హెచ్‌ఏఐ, తమిళనాడు ప్రభుత్వం, రేవు, ఇతర కేంద్ర ఏజెన్సీల మధ్య 2022 మే నెలలో ఒప్పందాలు కూడా కుదిరాయి. చింతాద్రిపేట, నుంగంబాక్కంలో రైల్వే లైనుపైన నిర్మాణం జరగాల్సి ఉంది. కనుక దక్షిణ రైల్వే నుంచి అనుమతికోసం అధికారులు ఎదురు చూస్తున్నారు. ‘టీఎన్‌ లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌’ (టీఎన్‌ఎల్‌ఓఏ) ప్రతినిధి ఎస్‌.యువరాజ్‌ మాట్లాడుతూ భారీ ప్రాజెక్టుతో చెన్నై రేవుకు ఆదాయం బాగా సమకూరే వీలుందన్నారు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఉన్న ప్రయివేటు రేవులకు ఆదాయం చేకూరగలదని, టెండర్ల ఆహ్వానాలు, ఒప్పందాలు కుదుర్చుకోవడం వంటి పనులు పూర్తయి త్వరలో కార్యరూపం దాల్చడం హర్షణీయమన్నారు. పైవంతెనల నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వచ్చిన తర్వాత ట్రాఫిక్‌, ప్రమాదాలు కూడా బాగా తగ్గుతాయని పేర్కొన్నారు.

నేపియర్‌ బ్రిడ్జి వద్ద జరగనున్న నిర్మాణానికి నావికా విభాగానికి చెందిన 120 మీటర్ల స్థలం అవసరం ఉంది. ఈ ప్రాంతంలో క్వార్టర్సు ఉన్నాయి. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రధాన పనులు ప్రారంభమైన ఏడాదికి సైదాపేటలో 64 ఇళ్లు కట్టివ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది.  మొదటి అంతస్తు (టైర్‌ 1)లో పెరియార్‌ బ్రిడ్జి - ఎగ్మూరు - అరుంబాక్కం - కోయంబేడు వరకు  14 కిలోమీటర్ల పొడవు మేర నిర్మాణం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని