logo

అన్నాడీఎంకేలో కొనసాగుతున్న గందరగోళం

ఈపీఎస్‌ తరఫున చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు లేదని ఓపీఎస్‌ వర్గానికి చెందిన సీనియర్‌ నేత బన్రూటి రామచంద్రన్‌ తెలిపారు.

Published : 06 Feb 2023 00:49 IST

తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ తీరుపై ఓపీఎస్‌ వర్గం నిరసన

సమావేశంలో జేసీటీ ప్రభాకర్‌, వైద్యలింగం, రామచంద్రన్‌

సైదాపేట, న్యూస్‌టుడే: ఈపీఎస్‌ తరఫున చట్టవిరుద్ధ కార్యకలాపాలకు మద్దతు లేదని ఓపీఎస్‌ వర్గానికి చెందిన సీనియర్‌ నేత బన్రూటి రామచంద్రన్‌ తెలిపారు. ఈరోడు తూర్పు ఉప ఎన్నికల వ్యవహారంలో అన్నాడీఎంకేలో ఈపీఎస్‌ వర్గం తరఫున కేఎస్‌ తెన్నరసు, ఓపీఎస్‌ వర్గం తరఫున సెంథిల్‌మురుగన్‌లను అభ్యర్థులుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రెండాకులు గుర్తు స్తంభించే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అభ్యర్థిని సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి ఎంపిక చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఆ ప్రకారం అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ ఓపీఎస్‌ సహా అందరు సర్వసభ్య సభ్యులకు తెన్నరసుకు మద్దతు కోరుతూ లేఖ పంపారు. దీని గురించి ఓపీఎస్‌ వర్గం ఆదివారం సమావేశం జరిపింది. తర్వాత ఓపీఎస్‌ వర్గ సీనియర్‌ నిర్వాహకులు బన్రూటి రామచంద్రన్‌, వైద్యలింగంలు సంయుక్తంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. అప్పుడు వైద్యలింగం మాట్లాడుతూ... తెన్నరసును మాత్రమే అన్నాడీఎంకే అధికారపూర్వకంగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారని తెలిపారు. సర్వసభ్య సమావేశం మాత్రమే నిర్ణయించాలని కోర్టు తెలిపిందన్నారు. అలాంటప్పుడు ప్రిసీడియం చైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ ముందస్తుగానే ఒకరిని అభ్యర్థిగా ప్రకటించడం తగదని తెలిపారు. అంటే వారు ముందే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోందన్నారు. ఇది సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించే చర్యని మండిపడ్డారు. వేరే అభ్యర్థులను ప్రతిపాదించే ఎలాంటి అంశమూ ఈ లేఖలో లేదన్నారు. తాము ప్రకటించిన అభ్యర్థి పేరు కూడా లేదన్నారు. ఇతర పోటీదారుల హక్కును కాదనే అధికారం తమిళ్‌మగన్‌ హుస్సేన్‌కు లేదన్నారు. పళనిస్వామి వర్గ ఏజెంట్‌లా ఆయన వ్యవహరిస్తున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు తటస్థంగా తీర్పు ఇచ్చినా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రెండాకుల గుర్తు ఎక్కడ ఉంటుందో వారికి మద్దతు ఇస్తామని తెలిపారు. బన్రూటి రామచంద్రన్‌ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు ఉమ్మడి అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పిందన్నారు. తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ అభ్యర్థిని ప్రకటించి దానికి ఓటింగ్‌ జరుపుతున్నట్లు ఉందన్నారు. తాము దీనిని అంగీకరించమని అన్నారు. న్యాయ నిపుణలతో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఓపీఎస్‌ వర్గ ఈ నిర్ణయంతో ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు కలిసి అభ్యర్థిని ఎంపిక చేయటం దాదాపు అసాధ్యమని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దీంతో రెండాకులు గుర్తు స్తంభించేందుకే ఎక్కువ అవకాశం ఉందని తెలిపారు. అన్నాడీఎంకే ప్రిసీడియం ఛైర్మన్‌ తమిళ్‌మగన్‌ హుస్సేన్‌ సోమవారం దిల్లీ వెళ్లనున్నారు. అన్నాడీఎంకే సర్వసభ్య సభ్యులు ఇచ్చిన లేఖలను ఎన్నికల సంఘం దగ్గర సోమవారం సమర్పిస్తారని సమాచారం.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని