logo

పరిశోధనకు దూరం

పీహెచ్‌డీ పట్టా సాధించడం పెద్ద గౌరవం. కానీ అందుకు యువత సుముఖత చూపడంలేదు. దీంతో వివిధరంగాల్లో పీహెచ్‌డీ కోర్సు ద్వారా పరిశోధన చేసేందుకు ముందుకు రావడంలేదు.

Published : 07 Feb 2023 01:33 IST

ఏటా తగ్గుతున్న పీహెచ్‌డీ ప్రవేశాలు
ఇప్పటికీ జాతీయస్థాయిలో రాష్ట్రమే మెరుగు
ఏఐఎస్‌హెచ్‌ఈ నివేదికలో వివరాల వెల్లడి

ఈనాడు, చెన్నై

పీహెచ్‌డీ పట్టా సాధించడం పెద్ద గౌరవం. కానీ అందుకు యువత సుముఖత చూపడంలేదు. దీంతో వివిధరంగాల్లో పీహెచ్‌డీ కోర్సు ద్వారా పరిశోధన చేసేందుకు ముందుకు రావడంలేదు. ఇదే విషయం.. తాజాగా కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన ‘అఖిల భారత స్థాయిలో ఉన్నతవిద్యపై సర్వే (ఏఐఎస్‌హెచ్‌ఈ) నివేదిక 2020-21’లో తేలింది. రాష్ట్రానికి సంబంధించి మరిన్ని ఆలోచింపచేసే విషయాలు ఇందులో ఉన్నాయి.

దేశవ్యాప్తంగా 2020లో బయటికొచ్చిన పీహెచ్‌డీ విద్యార్థుల్లో తమిళనాడు నుంచే అత్యధికంగా ఉన్నారు. ఇక్కడి నుంచి 3,206 మంది అన్ని స్థాయుల్లో కలిపి పీహెచ్‌డీ పట్టా పొందారు. వీరిలో 1,713 మంది యువకులు, 1,493 మంది యువతులు ఉన్నారు. ఈ తరహాలో ఏటా పరిశోధక విద్యార్థుల్ని సమాజానికి ఇవ్వడంలో రాష్ట్రం కీలకంగా ఉంది. కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా పరిశోధక విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ ప్రభావం తమిళనాడుపై కూడా ఉన్నట్లు నివేదికలో స్పష్టమైంది. 2018-19లో రాష్ట్రం నుంచి 5,844 మంది పీహెచ్‌డీ చేసినవారు బయటికి రాగా, 2019-20లో ఈ సంఖ్య 5,324కు చేరింది. తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో 2020-21లో 3,206 మంది మాత్రమే పీˆహెచ్‌డీ చేశారు. ఈ తక్కువ సంఖ్యే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకన్నా తమిళనాడునే ప్రథమస్థానంలో ఉంచడం గమనార్హం.

కెరీర్‌పరంగా ఇబ్బందా?

పీహెచ్‌డీ చేసినవారికి సరైన ఉద్యోగాలు లేవనే ఆలోచన వల్లే ఇలా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నట్లుగా నిపుణులు అంచనా వేస్తున్నారు. పీˆహెచ్‌డీ చదివినప్పటికీ.. దీన్నిబట్టి కాకుండా వారు చదివిన పూర్వ విద్య ఆధారంగా ఇతర ఉద్యోగాలు వస్తుండటంతో పరిశోధక విద్యార్థులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ ఖాళీలు చాలా ఉన్నాయని తెలిపారు. వాటిని ఈ విద్యార్థులతో భర్తీ చేసే అవకాశముందని చెప్పారు. నిర్ణీత సమయాల్లో నియామకాలు జరగకపోవడంవల్లే విద్యార్థులకూ న్యాయం జరగడంలేదని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో పీహెచ్‌డీ చేసేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపరని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


యువసత్తా ఎక్కువే..

రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివే వయసున్న యువత ఎక్కువే ఉన్నారు. తాజా నివేదికలో అది మరోసారి స్పష్టమైంది. 2020-21 గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 18-23 ఏళ్ల మధ్య వయసున్న విద్యార్థులు 71.07 లక్షలమంది ఉన్నట్లుగా చూపారు. వీరిలో 36.6 లక్షలమంది యువకులు, 34.4 లక్షల మంది యువతులు. దీనికి తగ్గట్లే అత్యధిక కళాశాలలు, విశ్వవిద్యాలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. కళాశాలల్లో టాప్‌-10 రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. రాష్ట్రంలో మొత్తం 2,667 కళాశాలలు ఉన్నాయి. 18-23ఏళ్లున్న ప్రతి లక్ష జనాభాకి 40 ఉన్నట్లుగా అంచనా వేశారు. ఇక్కడ మొత్తం 59 విశ్వవిద్యాలయాలు కొనసాగుతున్నాయి. ఉపాధ్యాయుల శిక్షణకు మహిళలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలిపారు. పాలిటెక్నిక్‌ విద్యలో రాష్ట్ర పాత్ర అత్యంత కీలకంగా ఉంది. ఇక్కడ ఏకంగా 2.49 లక్షల మంది విద్యనభ్యసిస్తున్నట్లు వెల్లడించారు.


చేరికలూ అంతే..

వివిధ రంగాల్లోని పీహెచ్‌డీ కోర్సుల్లో విద్యార్థుల చేరికలు భారీగా ఉన్న టాప్‌-6 రాష్ట్రాల్లో తమిళనాడుకు మూడోస్థానం దక్కింది. ఇది గొప్పగా భావించాల్సిన అంశం. కానీ అంతర్లీనంగా మరో బాధాకర విషయం దాగుంది. చేరికల్లో కొవిడ్‌ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నట్లు గణాంకాల్ని చూస్తే తెలుస్తోంది. రాష్ట్రంలో ఒక్కో కళాశాలకు సగటున 2016-17లో 922, 2017-18లో 919, 2018-19లో 924 చేరినవారుండగా.. 2019-20లో ఈ సంఖ్య 872కు పడిపోయింది. 2020-21కి 838కి చేరింది. ఇలా ఎందుకు జరుగుతోందో పరిశోధించి యువతను దిశానిర్దేశం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని నిపుణులు చెప్పారు.

సమానత్వంలో భేష్‌!

యువకులు, యువతులు చదువుల్లో పోటీపడేందుకు అనువైన వాతావరణం తమిళనాడులో ఉంది. లింగసమానత్వ సూచీ (జీపీˆఐ)లోనూ ప్రత్యేకంగా నిలుస్తోంది. 2016-17లో 0.99గా ఉండగా.. 2020-21కి ఆ సూచీ 1.07కి చేరింది. 1 విలువలోపు ఉంటే ఆడపిల్లల ప్రాధాన్యత తక్కువగా ఉన్నట్లు, 1 అంతకుమించితే వారి ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లు అర్థం. ప్రత్యేకించి ఎస్టీల్లో మాత్రం ఈ సూచీ 1కి మించలేదు. 2020-21లో వారికి సంబంధించి 0.89గానే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని