logo

శరవేగంగా స్టేషను పునరాభివృద్ధి పనులు

కన్యాకుమారి స్టేషనులో పునరాభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. టోపోగ్రాఫికల్‌ సర్వే పూర్తయిందని దక్షిణ రైల్వే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

Published : 09 Feb 2023 00:19 IST

సర్వే చేస్తున్న దృశ్యం

వడపళని, న్యూస్‌టుడే: కన్యాకుమారి స్టేషనులో పునరాభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. టోపోగ్రాఫికల్‌ సర్వే పూర్తయిందని దక్షిణ రైల్వే బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. మట్టి పరీక్షలు, స్టేషనులో పనులు 19 నెలల్లో పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. టెర్మినల్‌ భవనం పొడిగింపు, గ్రౌండు, మొదటి అంతస్తు, ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు సువిశాలమైన హాలు, పైనడక దారి వంతెనలు నిర్మాణం కానున్నాయి. తిరువనంతపరం - నాగర్‌కోయిల్‌ రైలు మార్గంలోని కన్యాకుమారి స్టేషను నిత్యం రద్దీతో ఉంటుంది. కన్యాకుమారి ఆలయం, వివేకాందన రాక్‌ మెమోరియల్‌, గాంధీ మ్యూజియం వంటి పర్యాటక ప్రదేశాలను తిలకించేందుకు నిత్యం సందర్శకులు పలు ప్రాంతాల నుంచి వస్తుంటారు.  ఈ స్టేషను దక్షిణ రైల్వే తిరువనంతపురం డివిజన్‌లో ఎన్‌ఎస్‌జీ 4 కేటగిరీలో చోటు సంపాదించింది. రూ. 49.36 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులను చెన్నైలోని ‘ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ ఇండియా లిమిటెడ్‌’ (ఈపీసీ) సంస్థకు అప్పగించారు. పనులను పర్యవేక్షించేందుకు ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ నియమించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. 802 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం జరుగుతున్న టెర్మినల్‌ భవనంలో విశ్రాంత గదులు, టీటీఈకి విశ్రాంత గది, ఆహార శాలలు వంటివి మొదటి అంతస్తులోకి అందుబాటులోకి వస్తాయి. 5.0 మీటర్ల వెడల్పుతో పైనడక దారి వంతెన, పైనడక దారి వంతెన వద్ద రెండో ప్రవేశ ద్వారం నిర్మాణానికి ప్రతిపాదించినట్టు అధికారులు పేర్కొన్నారు. 104 కార్లు, 220 ద్విచక్ర వాహనాలు, 20 ఆటోలు/ట్యాక్సీలు పార్కింగు చేసేందుకు వీలుగా నిర్మాణం జరగనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని