logo

Tamil Nadu: అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు.. పన్నీర్‌సెల్వంకు మరో ఎదురుదెబ్బ

అన్నాడీఎంకే ఆధిపత్య పోరులో ఓపీఎస్‌కు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. ఏక నాయకత్వ సమస్య మొదలై ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలుగా పార్టీ విడిపోయిన సంగతి తెలిసిందే.

Updated : 23 Feb 2023 07:50 IST

ఈరోడు నిర్వాహకుల మూకుమ్మడి రాజీనామా

సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ఆధిపత్య పోరులో ఓపీఎస్‌కు ఎదురుదెబ్బలు కొనసాగుతున్నాయి. ఏక నాయకత్వ సమస్య మొదలై ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలుగా పార్టీ విడిపోయిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది నిర్వాహకులు, జిల్లా కార్యదర్శుల మద్దతుతో అన్నాడీఎంకే దాదాపు పూర్తిగా ఈపీఎస్‌ ఆధీనంలో ఉందనే చెప్పాలి. ఈ క్రమంలో ఎడప్పాడికి వ్యతిరేకంగా న్యాయపోరాటం చేస్తున్న పన్నీర్‌సెల్వానికి వరుస ఎదురుదెబ్బలు తప్పటం లేదు. ఈరోడు తూర్పు ఉప ఎన్నికల్లో ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు రెండూ పోటీ చేయనున్నట్లు చెప్పాయి. అభ్యర్థులను కూడా ప్రకటించాయి. కోర్టు జోక్యంతో ఎడప్పాడి పళనిస్వామి తరఫు అభ్యర్థి కేఎస్‌ తెన్నరసు అన్నాడీఎంకే అధికారిక అభ్యర్థి అయ్యారు. అదే సమయంలో రెండాకులు గుర్తు కూడా ఈపీఎస్‌ వర్గం సొంతమైంది. పన్నీర్‌సెల్వం తరఫు అభ్యర్థి సెంథిల్‌ మురుగన్‌ నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ముందుగా ఓపీఎస్‌ మద్దతు కలిగిన ఈరోడు జిల్లా కార్యదర్శి మురుగానందం పోటీ చేయాలని భావించారు. పన్నీర్‌సెల్వం మాత్రం సెంథిల్‌ మురుగన్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. పార్టీతో సంబంధం లేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించటం కాకుండా పోటీ నుంచి వైదొలగడం మురుగానందం, ఆయన అనుచరులకు అసంతృప్తి కలిగించింది. ఇంకా నిర్వాహకులు ఏమీ మాట్లాడొద్దని పన్నీర్‌ నిబంధనలు విధించినట్లు సమాచారం. డీఎంకేను కూడా విమర్శించొద్దంటే ఎలాగని ఓపీఎస్‌ తరఫు నిర్వాహకులు తీవ్ర అంతృప్తికి లోనైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మురుగానందం సహా 106 మంది పన్నీర్‌సెల్వం నిర్వాహకులు పన్నీర్‌ వర్గం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇది పన్నీర్‌కు వెనుకంజగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీఎస్‌ తదుపరి చర్యలు ఎలా ఉంటాయోననే ఆసక్తి రాష్ట్ర రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు