logo

Panneerselvam: రహస్యాలు వెల్లడిస్తాం: ఓపీఎస్‌

ప్రజలనే న్యాయం కోరతామని, వారిని కలిసినప్పుడు పలు రహస్యాలు వెల్లడిస్తామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తెలిపారు.

Updated : 25 Feb 2023 09:56 IST

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రజలనే న్యాయం కోరతామని, వారిని కలిసినప్పుడు పలు రహస్యాలు వెల్లడిస్తామని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తెలిపారు. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం తీర్పునకు సంబంధించి పన్నీర్‌సెల్వం, ఆయన మద్దతుదారులు శుక్రవారం విలేకరులతో ముచ్చటించారు. అప్పుడు పన్నీర్‌సెల్వం మాట్లాడుతూ.. ప్రజలను ఆశ్రయించాల్సిన పరిస్థితిలో తాము ఉన్నామని తెలిపారు. ప్రజాకోర్టులో న్యాయం అడుగుతామన్నారు. జయలలితే అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి అని తెలిపారు. ఇది కార్యకర్తల పార్టీ అని పేర్కొన్నారు. తమ సేన బయలుదేరిందని, ప్రజాకోర్టులో మంచి తీర్పు దక్కుతుందని తెలిపారు. కోర్టు తీర్పుతో మాకు ఇబ్బంది లేదన్నారు. తాము ఎందుకు ప్రత్యేక పార్టీ పెట్టాలని ప్రశ్నించారు. పళనిస్వామి వర్గమే డీఎంకే బీ టీమ్‌ అని, వారి గురించి చెప్పాలంటే వేయి ఉన్నాయని తెలిపారు. ఇకపై ఒక్కొక్కటి బయటకు వస్తాయని అన్నారు. ప్రజలను కలిసినప్పుడు పలు రహస్యాలు బయట పెడతామని తెలిపారు. ఎడప్పాడి పళనిస్వామి వర్గం అహంకారం పరాకాష్టలో ఉందని తెలిపారు. ఆ అహంకారాన్ని అణచివేసే శక్తి అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. త్వరలో జిల్లాల వారీగా పర్యటన చేస్తామన్నారు. తీర్పు ఎక్కడ ఉండాలో అక్కడ పొందుతామని పేర్కొన్నారు.

బన్రుట్టి రామచంద్రన్‌ మాట్లాడుతూ.. నీతి, న్యాయం తమ పక్కన ఉన్నాయన్నారు. మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సర్వసభ్య సమావేశం చెల్లుతుంది, అయితే తీర్మానాల గురించి మాట్లాడబోమని చెప్పడం సుప్రీంకోర్టు బాధ్యతను విస్మరిస్తున్నట్లు ఉందని పేర్కొన్నారు. సమన్వయకర్త, సంయుక్త సమన్వయకర్త సంతకం చేస్తేనే సర్వసభ్య సమావేశం చెల్లుతుందని తెలిపారు. మనోజ్‌పాండియన్‌ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో అప్పీలు లేదని, సర్వసభ్య సమావేశానికి సంబంధించి మాత్రమే కోర్టు తీర్పు ఇచ్చిందని, తీర్మానాల గురించి ఏమీ చెప్పలేదన్నారు.  తీర్మానాల గురించి ఏమీ చెప్పలేదని తెలిపారు. తీర్మానాలకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపిందని పేర్కొన్నారు. దీని గురించి ఆలోచించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. తీర్మానాలు చెల్లుతాయని తీర్పులో ఎక్కడా పేర్కొనలేదని తెలిపారు. ఈ కేసు సర్వసభ్య సమావేశానికి సంబంధించినదేనని, తీర్మానాలకు సంబంధించింది కాదని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని