logo

అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగితే రాజీనామా ఖాయం :అన్నామలై

అన్నాడీఎంకేతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగితే తన పదవికి రాజీనామా చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఈరోడు తూర్పు ఉప ఎన్నికల తరువాత అన్నాడీఎంకే, భాజపా మధ్య అంతరం పెరిగింది.

Published : 19 Mar 2023 01:07 IST

సమావేశంలో మాట్లాడుతున్న అన్నామలై

ప్యారిస్‌, న్యూస్‌టుడే: అన్నాడీఎంకేతో వచ్చే ఎన్నికల్లో పొత్తు కొనసాగితే తన పదవికి రాజీనామా చేస్తానని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఈరోడు తూర్పు ఉప ఎన్నికల తరువాత అన్నాడీఎంకే, భాజపా మధ్య అంతరం పెరిగింది. ఈ నేపథ్యంలో కృష్ణగిరికి వచ్చిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నాడీఎంకే నేతలను విమర్శించకూడదని చెప్పడంతో అన్నామలై, ఆయన మద్దతుదారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి చిత్రపటాన్ని భాజపా నేతలు దహనం చేయడంతో ఆ పార్టీ సీనియర్‌ నేతలు అన్నామలైని విమర్శించారు. ఈ నేపథ్యంలో చెన్నైలో భాజపా నిర్వాహకులు, బూత్‌ కమిటీ సభ్యుల సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ... అన్నాడీఎంకేతో పొత్తు కొనసాగితే భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, సాధారణ కార్యకర్తగా ఉంటానని తెలిపారు. భాజపా ఒంటరిగా పోటీ చేస్తేనే తమిళనాడులో ప్రాబల్యం పెరుగుతుందన్నారు. సమస్యలపై మాట్లాడేందుకు ప్రధాని మోదీని సమయం కోరినట్లు తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండడంతో మే 10వ తేదీ వరకు పార్టీ పనుల్లో బిజీగా ఉంటారని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణన్‌ తిరుపతి మాట్లాడుతూ... అన్నామలై మాటలు స్పష్టంగా లేవని, వాటిని వివరించాలని అన్నారు. మదురైకి చెందిన  పార్టీ నిర్వాహకుడు షా నారాయణన్‌ వెంటనే తిరుపతి వ్యాఖ్యలకు అభ్యంతరం తెలిపారు. చాలా మంది అన్నామలై మాటలకు మద్దతుగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్‌ మాట్లాడుతూ పార్టీ కేంద్ర కమిటీలో చర్చించాల్సిన అంశంపై ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించడంతో కలకలం ఏర్పడింది. సమావేశంలో ఎమ్మెల్యేలు గాంధీ, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని