logo

ఆత్మహత్యలతో తీరని నష్టం

ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రజలకు ఇంతవరకే తెలుసు. కానీ ఒక ఆత్మహత్య జరగడం వల్ల రాష్ట్రానికి పెనుభారంగా మారుతోందనే విషయం ఐఐటీ మద్రాస్‌ నిపుణులు తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాల్లో తేలింది.

Published : 24 Mar 2023 00:25 IST

ఐఐటీ పరిశోధకుల సర్వేలో వెల్లడి

ఈనాడు, చెన్నై: ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు.. ప్రజలకు ఇంతవరకే తెలుసు. కానీ ఒక ఆత్మహత్య జరగడం వల్ల రాష్ట్రానికి పెనుభారంగా మారుతోందనే విషయం ఐఐటీ మద్రాస్‌ నిపుణులు తాజాగా వెల్లడించిన సర్వే ఫలితాల్లో తేలింది. ఆత్మహత్య, ఆత్మహత్యాయత్నంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం తప్పడం లేదని అంచనా వేశారు.

‘తమిళనాడులో ఆత్మహత్యలకు సామాజిక ఆర్థిక వ్యయం’ పేరుతో ఐఐటీ మద్రాస్‌ ఈ మధ్యే ప్రత్యేక నివేదిక విడుదల చేసింది. ఇందులోభాగంగా రాష్ట్రంలో జరిగిన ఆత్మహత్యలు, అలాంటి ప్రయత్నాలను పరిశీలించారు. వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల రాష్ట్రం ఎంత నష్టపోతుందో పరిశోధకులు అంచనా వేశారు. వారు మరణించడం వల్ల.. తయారీ నష్టం, పెడుతున్న వైద్యఖర్చులు, నష్టపోయిన జీవితం, పన్నులు, బాధితులకు అండగా ఉండటానికి ప్రభుత్వం పెట్టే ఖర్చు, పరిపాలనా పరమైన వ్యయాలు పరిగణనలోకి తీసుకున్నారు.

జీడీపీలో 1.3శాతం

నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం ఐఐటీ మద్రాస్‌ నిపుణులు పలు అంచనాలు వేశారు. 2021 గణాంకాల్ని చూస్తే రాష్ట్రంలో 18,925 ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. దీంతో రాష్ట్ర ఆర్థికస్థితిపై రూ.29,167.90కోట్ల భారం పడిందని చెప్పారు. ఇది రాష్ట్ర జీడీపీలో 1.3 శాతంగా ఉందని తెలిపారు. అత్యవసరంగా ప్రభుత్వం నేరుగా చేసిన ఖర్చు రూ.18,314.57 కోట్లుగా ఉంది. ప్రత్యేకించి అత్యవసర చర్యలు, ఆసుపత్రి ఖర్చులు, ఇతర విభాగాల వినియోగం తదితరాలు ఇలా చాలారకాల సేవలు ఇందులో ఉన్నాయి. అదనపు ఆరోగ్య వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 3.47శాతం మొత్తాన్ని ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. ఇలా ఖర్చుపెట్టడం ద్వారా ప్రభుత్వం చాలా నష్టపోతోందని పరిశోధకులు వివరిస్తున్నారు. ప్రతి ఆత్మహత్య, అలాంటి ప్రయత్నంపై సగటున రూ.1.5కోట్లు ఖర్చుచేశారని గణాంకాల్ని వెల్లడించారు.

బడ్జెట్కూ భారమే

2021లో దేశంలోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగిన రెండో రాష్ట్రంగా తమిళనాడు ఉంది. ఈ విషయం ఎన్‌సీఆర్‌బీ గణాంకాలతో స్పష్టమైంది. ఇన్ని ఆత్మహత్యలు దశాబ్దకాలంగా నమోదవడం ఇదే తొలిసారి. వీటికోసం 2021లో ప్రభుత్వ బడ్జెట్ మొత్తంలో రాష్ట్రంలోని ఆత్మహత్యల సమయంలో పెట్టిన ఖర్చు 6.03 శాతంగా ఉందని ఐఐటీ పరిశోధకులు తేల్చారు. మరోవైపు పోలీసులకు కేటాయించిన బడ్జెట్తో పోల్చితే దానికి మించి 3.39 రెట్లు ఆత్మహత్యల కోసం ఖర్చుపెట్టారని తెలిపారు. రాష్ట్రంలో ఆరోగ్య ఖర్చుల్లో కేవలం 81శాతం నిధులు ఆత్మహత్యల సమయంలో రక్షించేందుకు ఖర్చుచేసినట్లు వెల్లడైందని, ఇది రాష్ట్ర బడ్జెట్లో 10శాతం ఉందని గుర్తుచేశారు.

దుష్ప్రభావాలు ఎన్నో..

ఆత్మహత్యల ఆలోచనలు, ఆయా వ్యక్తులు మానసిక స్థితి, రాష్ట్రంలో పెట్టే ఖర్చు.. ఇవన్నీ రాష్ట్ర పురోగతిని తగ్గిస్తున్నాయని చెబుతున్నారు. ప్రాణాలు తీసుకోవడాన్ని తీవ్ర నష్టంగా పరిగణిస్తున్నారు. ఒక వ్యక్తి అకారణంగా ఆత్మహత్య చేసుకోవడం ద్వారా అతని జీవితకాల ఆదాయాన్ని కోల్పోవడంతోపాటు ఆ ఆలోచనల నుంచి వచ్చే దుష్ప్రభావాలతో వ్యక్తిగతంగా, కుటుంబపరంగా మానసిక నష్టాలూ ఉంటాయని తెలిపారు. దీనికి తోడు ఆత్మహత్యాయత్నం, ఆ సమయంలో ఆసుపత్రి ఖర్చులు భారీగా ఉంటున్నాయని తెలిపారు. అత్యవసర వైద్యం చాలా ఖరీదైనదిగా వెల్లడించారు. రంగాలవారీగా జరిగిన ఆత్మహత్యల వివరాలు లేకపోవడంతో ప్రభుత్వానికి వీటిని ఆపడం పెద్దసవాలుగా ఉంటుందని వెల్లడించారు.

ప్రయత్నాలు ప్రారంభం

పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వపరంగా పలు చర్యలు మొదలైనట్లు ఆరోగ్యశాఖ చెబుతోంది. జిల్లాల్లో పాఠశాల, కళాశాల స్థాయి నుంచి విద్యార్థులు మానసికంగా బలీయంగా ఉండేలా, వ్యతిరేక ఆలోచనలకు దూరంగా ఉండేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఐఐటీ నిపుణుల సాయంతో పలు చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆత్మహత్యల్ని నివారించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు వేస్తోంది. ప్రత్యేక రిజిస్ట్రీని ఏర్పాటుచేసేలా ప్రతిపాదిస్తున్నారు. ఏయే విభాగాలకు సంబంధించి ఆత్మహత్యలున్నాయో ఆయా రంగాలు చూసే శాఖల్ని అనుసంధానం చేస్తున్నారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా అన్ని రంగాల్లోనూ చర్యలు చేపట్టాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రభుత్వ చట్టాల్లోనూ మార్పులు చేయడానికి ఆలోచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని