logo

సభలో మళ్లీ ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ బిల్లు

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ శాసనసభలో ప్రభుత్వం మళ్లీ బిల్లును ప్రవేశపెట్టింది. దానిని అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

Published : 24 Mar 2023 00:25 IST

ఏకగ్రీవ ఆమోదం

శాసనసభలో ప్రసంగిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీని నిషేధిస్తూ శాసనసభలో ప్రభుత్వం మళ్లీ బిల్లును ప్రవేశపెట్టింది. దానిని అన్ని పార్టీల సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. బిల్లుపై జరిగిన చర్చలో ఓ.పన్నీర్‌సెల్వానికి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా ఆయన వర్గీయులు వాకౌట్‌ చేశారు. ఆన్‌లైన్‌ నిషేధ బిల్లును గురువారం శాసనసభలో ప్రవేశపెట్టగా, దానిపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రసంగించారు. బరువెక్కిన గుండెతో సభలో నిలబడినట్టు తెలిపారు. ఆన్‌లైన్‌ రమ్మీలో ఎక్కువ డబ్బులు పోగొట్టుకొని ఇప్పటివరకు 41 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని, ఆ బాధతోనే ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నట్టు పేర్కొన్నారు. కళ్లెదుట జరుగుతున్న ఈ మరణాలను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ ఆర్డినెన్స్‌కు గత ఏడాది సెప్టెంబరు 26న మంత్రివర్గ ఆమోదం తెలుపగా, గవర్నర్‌ ప్రకటన మేరకు ఆ ఏడాది అక్టోబరు 3న రాష్ట్ర గెజిట్‌లో విడుదల చేసినట్టు తెలిపారు. ఆర్డినెన్స్‌కు బదులు గత ఏడాది అక్టోబరు 19న రాష్ట్ర శాసనసభలో బిల్లును చేసి గవర్నర్‌ ఆమోదానికి పంపగా.. ఈ ఏడాది మార్చి 6న సభాపతికి బిల్లును వెనక్కు పంపారని పేర్కొన్నారు. ప్రస్తుతం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. రాష్ట్ర అధికార పరిధిలోని ప్రజలు అందరినీ క్రమబద్ధ్దీకరించడానికి, కాపాడేందుకు ప్రభుత్వానికి హక్కు ఉందన్నారు.

అభ్యంతరం చెబుతున్న పళనిస్వామి తదితరులు

ఓపీఎస్‌కు అనుమతి తగదు

ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ బిల్లుపై జరిగిన చర్చలో సభ్యులు వేల్‌మురుగన్‌ (టీవీకే), ఈశ్వరన్‌ (కేఎండీకే), జవాహిరుల్లా (ఎంఎంకే), నాగై మాలి (సీపీఎం), నయినార్‌ నాగేంద్రన్‌ (భాజపా), జీకే మణి (పీఎంకే), సెల్వపెరుంతగై (కాంగ్రెస్‌), మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, దళవాయ్‌ సుందరం (అన్నాడీఎంకే) తదితరులు పాల్గొన్నారు. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టానికి మద్దతిస్తున్నట్టు ఓ.పన్నీర్‌సెల్వం చెప్పారు. ఆయన్ను మాట్లాడానికి అనుమతి ఇవ్వడంపై ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం తరఫున ఒకరు మాట్లాడిన నేపథ్యంలో ఓపీఎస్‌కు అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు గందరగోళం సృష్టించేలా ఉన్నాయన్నారు. దీనికి సభాపతి అప్పావు స్పందిస్తూ.. ఓ.పన్నీర్‌సెల్వాన్ని ప్రతిపక్ష ఉపనేత గానో, అన్నాడీఎంకే సభ్యుడుగానో చెప్పలేదన్నారు. మాజీ ముఖ్యమంత్రిగా మాట్లాడేందుకు ఆయన కోరినప్పుడు అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఓపీఎస్‌ను మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడానికి నిరసనగా ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలో అన్నాడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. సభ నుంచి వాకౌట్‌ చేశారు. సభ్యుల ఆమోదంతో ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ బిల్లు ఏకగ్రీవంగా నెరవేరింది.

కృష్ణగిరి ఘటనపై వివరణ..

కృష్ణగిరి జిల్లా కావేరిపట్టినంలో జరిగిన ఘటనపై ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి సావధాన తీర్మానం తీసుకొచ్చారు. దానిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ... తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్నాడని కిట్టంపట్టికి చెందిన జగన్‌ (28)పై అన్నాడీఎంకేకు చెందిన శంకర్‌ మారణాయుధాలతో దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడని తెలిపారు. నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేశారని, హత్యతో సంబంధమున్న అవదానపట్టి అన్నాడీఎంకే కార్యదర్శిని కూడా అరెస్టు చేశారని తెలిపారు. డీఎంకే హయాంలో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలను పోలీసుశాఖ చేపడుతోందని పేర్కొన్నారు. సామాజిక న్యాయాన్ని కాపాడే నేలపై ఇలాంటి ఘటనలు జరకుండా ఉండేందుకు రాజకీయాలకు అతీతంగా అందరూ మానవత్వంతో, సామాజిక సామరస్యతను పరిరక్షించాలని సభ్యులను కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని