logo

ఆసియాలోనే పరిశ్రమల హబ్‌గా రాష్ట్రం

సాంకేతికతలో ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమల హబ్‌గా రాష్ట్రం మారనుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Published : 24 Mar 2023 00:25 IST

ముఖ్యమంత్రి ఆశాభావం

వీసీ ద్వారా ప్రసంగిస్తున్న సీఎం

చెన్నై, న్యూస్‌టుడే: సాంకేతికతలో ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమల హబ్‌గా రాష్ట్రం మారనుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. సమాచార సాంకేతికశాఖ తరఫున నందంబాక్కంలోని ట్రేడ్‌ సెంటర్‌లో గురువారం జరిగిన సాంకేతిక, ఆవిష్కరణల ‘యుమాజిన్‌ శిఖరాగ్ర’ సదస్సును వీసీ ద్వారా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... కలల ప్రాజెక్టును సాకారం చేసుకునే వేదికగా రాష్ట్రాన్ని ఉపయోగించుకోవాలని ఐటీ రంగ నిపుణులకు పిలుపునిచ్చారు. సాంకేతికతలో ప్రపంచ దేశాలు పొందే అభివృద్ధిని సమకాలంలో రాష్ట్రంలో కూడా పొందాలన్నదే తన స్వప్నమని తెలిపారు. చెన్నైలో ఐటీ, టైడల్‌ పార్కులను నాటి ముఖ్యమంత్రి కరుణానిధి ఏర్పాటు చేశారని, ప్రైవేటు భాగస్వామ్యంతో మరికొన్ని ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి ఐటీ కారిడార్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. చెన్నై, కోయంబత్తూరు, హోసూరు తదితర ప్రాంతాల్లో టెక్‌ సిటీలనూ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇవి ఐటీ, ఆర్థిక సంస్థలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను సంఘటితం చేసే కేంద్రాలుగా ఉంటాయని తెలిపారు. వీటిని ప్రస్తుత సదస్సుల్లో పాల్గొన్న అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ప్రపంచాన్ని గెలిచేందుకు సాంకేతికత చక్కటి సాధనమని తెలిపారు. కొత్త ఆవిష్కరణలకు సహకరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో  బలమైన రాష్ట్రంగా తమిళనాడును రూపొందించడానికి, సరికొత్త  అవకాశాలను గుర్తించడానికి ప్రభుత్వం నిర్విరామంగా కృషిచేస్తోందని తెలిపారు. సాంకకేతికతలో ఆసియాలోనే అతిపెద్ద పరిశ్రమల హబ్‌గా రాష్ట్రం మారనుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఐటీ, డిజిటల్‌ సేవలశాఖ మంత్రి మనో తంగరాజ్‌, కార్యదర్శి కుమరగురుభరన్‌, యుమాజిన్‌ బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని