logo

అన్నాడీఎంకేపై పెరిగిన పట్టు!

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి ఎన్నిక కావడంతో పార్టీపై పట్టు మరింత పెరిగింది.

Published : 29 Mar 2023 00:25 IST

ప్రధాన కార్యదర్శిగా ఈపీఎస్‌ ఏకగ్రీవ ఎన్నిక
ఎంజీఆర్‌, జయ ఆశయాల సాధనకు హామీ
పన్నీర్‌సెల్వం అప్పీలుపై విచారణ నేడు


ఈపీఎస్‌ను సత్కరిస్తున్న నేతలు

సైదాపేట, న్యూస్‌టుడే: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి ఎన్నిక కావడంతో పార్టీపై పట్టు మరింత పెరిగింది. ఈ ఎన్నికలకు నిషేధం విధించాలని, సర్వసభ్య సమావేశ తీర్మానాలకు వ్యతిరేకంగా పన్నీర్‌సెల్వం తరఫున మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ గతంలో దాఖలైంది. ఈ నేపథ్యంలో మంగళవారం న్యాయమూర్తి జస్టిస్‌ కుమరేష్‌బాబు తీర్పు ఇచ్చారు. వ్యతిరేక పిటిషన్లను కొట్టేశారు. ఓపీఎస్‌ తరఫున దాఖలైన మరో నాలుగింటిని కూడా రద్దు చేశారు. సర్వసభ్య సమావేశం, అందులో ఆమోదించిన తీర్మానాలు చెల్లుతాయని తీర్పులో వెల్లడించారు. దీంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ఎన్నికలు నిర్వహించిన నత్తం విశ్వనాథన్‌, పొల్లాచ్చి జయరామన్‌ల నుంచి ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పలు ఇబ్బందుల తర్వాత ఎంజీఆర్‌, జయలలిత కల నెరవేరే విధంగా కార్యకర్తల మద్దతుతో విజయం సాధించానని తెలిపారు. అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఏప్రిల్‌ 5 నుంచి కొత్త సభ్యత్వ దరఖాస్తులు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. సభ్యుడికి రూ.10 చొప్పున ప్రధాన కార్యాలయంలో చెల్లించాలని సూచించారు. ముందుగా పళనిస్వామికి మద్దతుగా హైకోర్టు తీర్పు ఇచ్చిన వెంటనే మద్దతుదారుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది. తర్వాత చెన్నై రాయపేటలోని ప్రధాన కార్యాలయానికి ఈపీఎస్‌ వచ్చారు. ఆయన్ను నిర్వాహకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతించారు. టపాసులు కాల్చారు. ముందుగా కార్యాలయంలోని ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలకు పళనిస్వామి నివాళులు అర్పించారు. నత్తం విశ్వనాథన్‌, పొల్లాచ్చి జయరామన్‌ల నుంచి గెలుపు ధ్రువపత్రం స్వీకరించి, సంతకం చేశారు. మాదవరం మూర్తి ఆయనకు మిఠాయి తినిపించారు. నిర్వాహకులు ఎంజీఆర్‌ టోపీ, కళ్లజోడు ధరింపచేశారు. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్‌ తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌, మాజీ మంత్రులు సెంగోట్టయన్‌, నత్తం విశ్వనాథన్‌, దిండిక్కల్‌ శ్రీనివాసన్‌, పొల్లాచ్చి జయరామన్‌, తళవాయ్‌ సుందరం, జయకుమార్‌, బెంజమిన్‌, వేలుమణి, తంగమణి, విజయభాస్కర్‌, ఉదయకుమార్‌, వళర్మతి, గోకుల ఇందిర తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. భారీ లడ్డూను కార్యకర్తలు తెచ్చి అందరికీ పంచిపెట్టారు. తర్వాత ఎంజీఆర్‌, జయలలిత స్మారక మందిరాలకు ఈపీఎస్‌ వెళ్లి నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ఓపీఎస్‌ తరఫున అప్పీలు పిటిషన్‌ దాఖలైంది. 29న విచారణ రానుంది.

మిఠాయి తినిపిస్తున్న మాజీ మంత్రి వళర్మతి
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని