logo

ప్రయాణాల్లో కరోనా వ్యాప్తి ఎక్కువే!

ప్రత్యేకించి మెట్రో నగరాల్లోనే కరోనా సంక్రమణ ఎక్కువగా ఉంటోందనేది పరిశోధకుల అభిప్రాయం.

Updated : 30 Mar 2023 06:23 IST

బస్సుల్లో అంచనా వేసిన పరిశోధకులు
చెన్నైలోని ఓ మార్గంలో నెలపాటు పరిశీలన

ప్రత్యేకించి మెట్రో నగరాల్లోనే కరోనా సంక్రమణ ఎక్కువగా ఉంటోందనేది పరిశోధకుల అభిప్రాయం. దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, పుణె, అహ్మదాబాద్‌, త్రివేండ్రం వంటి నగరాల్లో రవాణా సాధనాల్లో ప్రభావం కనిపించిందని చెప్పారు. ఈ తరహాలో చెన్నై పరిస్థితిపై పరిశోధకులు దృష్టిపెట్టారు. బస్సుల్లో ప్రయాణించి తాజాగా సర్వే చేశారు. ఇందులో అనేక విషయాలు వెల్లడయ్యాయి.

ఈనాడు, చెన్నై

అన్నా యూనివర్సిటీలోని ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌, పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌ వెక్టార్‌ కంట్రోల్‌ రీసెర్చి సెంటర్‌ సంయుక్తంగా ఈ పరిశోధన చేశాయి. ఐదుగురితో కూడిన ప్రత్యేక పరిశోధన బృందం నగరంలోని ఎంటీసీ బస్సుల్లో రద్దీ దృష్ట్యా కరోనా ఎలా ప్రబలే అవకాశం ఉందనేదానిపై రియల్‌టైం ఆల్గరిథమ్‌తో అంచనా వేశారు. ఇందుకోసం ఉత్తర, దక్షిణ చెన్నై ప్రాంతాలతో పాటు మిగిలిన మార్గాల్ని కలిపే పొడవైన మార్గాన్ని ఎంచుకున్నారు. తాంబరం-బ్రాడ్‌వే మధ్య 21జీ నంబరు బస్సుల్లో ప్రయాణించి వివరాల్ని సేకరించారు.

నెలపాటు ప్రయాణించి..

ఈ మార్గంలో 36.1కి.మీ. ప్రయాణంలో 40 బస్టాప్‌లున్నాయి. మొత్తం 106 నిమిషాల ఉంటుంది. రోజుకు 25 ట్రిప్పులు ఈ బస్సు తిరుగుతోంది. బస్సు తాంబరం నుంచి బయలుదేరేటప్పుడు సగటున 15మంది ప్రయాణికులతో బయలుదేరుతోందని, మధ్యలోని ప్రతి బస్టాప్‌లో కనీసం ఐదుగురు ఎక్కడమో, దిగడమో చేస్తున్నారని పరిశోధకులు గమనించారు. రద్దీ ఎక్కువగా ఉండే సాయంత్రంపూట ప్రారంభ స్టేజీలో ఒక కరోనా బాధితుడు బస్సులోకి ప్రవేశిస్తే.. అతని నుంచి ఎంతమందికి సోకే ప్రమాదం ఉందనే కోణంలో ఈ పరిశోధన చేశారు. ప్రత్యేక ఆల్గరిథమ్‌ ద్వారా అంచనా వేశారు. ఇలా నెలరోజులపాటూ అదే బస్సులో ప్రయాణించి సగటు వివరాలు సేకరించిన తర్వాత.. లెక్క కట్టారు. సర్వే ఫలితాల్ని ‘వైరస్‌ డిసీజ్‌’ అనే అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించారు.

రోజుకు 162 మందికి..

ఈ మేరకు వచ్చిన ఫలితాల్ని బట్టి.. బస్సులో కనీసం సీట్లు 50శాతం నిండినా.. ఒక్కో ట్రిప్‌లో 5 నుంచి 9 మందికి కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉన్నట్లుగా గమనించారు. ప్రయాణికుల సంఖ్య ఆధారంగా ఇది పెరగవచ్చని అంచనా వేశారు. బస్సు సుదీర్ఘ ప్రయాణం తర్వాత అంతిమంగా చేరే బ్రాడ్‌వే బస్‌ టెర్మినల్‌లో విస్తృతి ఎక్కువయ్యేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. రోజు మొత్తంలో 50శాతం ప్రయాణికులతో బస్సు ప్రయాణిస్తే.. సగటున 162 మందికి వైరస్‌ సోకే అవకాశముందని చెబుతున్నారు..

మాస్క్‌ తప్పనిసరి

పోస్ట్‌ కరోనాలో వచ్చిన కేసుల్ని గమనించిన తర్వాత ఒమిక్రాన్‌ రకం వైరస్‌తో తక్కువమంది ఆసుపత్రులపాలవడం, చనిపోవడం కనిపిస్తోందని పరిశోధకులు తెలిపారు. వ్యాక్సిన్‌ వేసుకుని 6 నెలలు దాటిన తర్వాత దాని పనితీరులో క్షీణత ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయాల్ని గ్రహించాలని తెలిపారు. తాము గమనించిన బస్సు ప్రయాణాల్లో 80శాతం మంది అసంఘటిత కార్మికులు, ఇతర రంగాల్లో పనిచేసేవారే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కాబట్టి పనిచేసే వర్గాలపరంగా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు. మరోవైపు ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరిస్తున్నారు. భౌతికదూరం కూడా పాటించాలని సూచిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని