ఏడాదిపాటు వైకం పోరాట శతాబ్ది వేడుకలు
వైకం పోరాట శతాబ్ది వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు.
ఏటా పురస్కారాలు
ప్రత్యేక తపాలా బిళ్ల విడుదలకు చర్యలు
సభలో స్టాలిన్ వెల్లడి
సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి
చెన్నై, న్యూస్‌టుడే: వైకం పోరాట శతాబ్ది వేడుకలను ఏడాది పాటు నిర్వహించనున్నట్లు శాసనసభలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. శాసనసభలో గురువారం నిబంధన 110 కింద ముఖ్యమంత్రి చేసిన ప్రకటన... భారతదేశ సామాజిక సంస్కరణ చరిత్రలో వైకం పోరాటం ముఖ్య భూమిక పోషిస్తోందన్నారు. ఆలయ ప్రవేశ పోరాటాలన్నిటికీ తొలిమెట్టుగా ఉందని తెలిపారు. కాంగ్రెస్ నేతలంతా అరెస్టై ఆ పోరాటానికి నాయకత్వం లేని సమయంలో తందైపెరియార్ నాయకత్వం చేపట్టారని పేర్కొన్నారు. ఓ సారి నెల, మరోసారి 4 నెలలు కఠిన కారాగార శిక్ష అనుభవించారని తెలిపారు. ఏడాదిన్నరకు పైగా కొనసాగిన పోరాటం 1925 నవంబరు 23న విజయవంతమైందని పేర్కొన్నారు. ఉద్యమకారులు, రాజులకు మధ్య గాంధీ చర్చలు జరిపారని, అంతటి చారిత్రాత్మక వైకం పోరాటానికి వందేళ్లు అవుతోందని తెలిపారు. దీనిని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 30 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 వరకు ఏడాదిపాటు కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పోరాట చరిత్ర, ఉద్దేశం, విజయాన్ని ప్రజలు, విద్యార్థులు తెలుసుకునేలా పలు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 1న కేరళ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైకం పోరాట శతాబ్ది వేడుకల కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కలిసి పాల్గొంటానని, స్మారక స్తూపానికి నివాళి అర్పిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అతిముఖ్యమైన పరిశోధకుల్లో ఒకరైన పళ.అదియమాన్ రాసిన ‘వైకం పోరాటం’ పుస్తక మలయాళ అనువాదాన్ని ఆవిష్కరించనున్నట్టు, త్వరలో తెలుగు, కన్నడ, ఆంగ్ల ప్రచురణలు విడుదల కానున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది నవంబరు 29న తమిళనాడు, కేరళ సీఎంలు తదితరులు పాల్గొనే ప్రత్యేక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో అణచివేతకు గురైనవారి సంక్షేమానికి కృషి చేసిన సంస్థలకు ఏటా సెప్టెంబరు 17న ‘వైకం’ పురస్కారాలను రాష్ట్ర ప్రబుత్వం అందించనుందని పేర్కొన్నారు. వైకంలోని పెరియార్ స్మారకాన్ని పునరుద్ధరించడానికి, పెరియార్‌కు సంబంధించిన స్మారక వస్తువులను అదనంగా ఏర్పాటు చేయడానికి రూ.8.14 కోట్లు కేటాయించనున్నట్టు తెలిపారు. పెరియార్‌ను అరెస్టు చేసి తొలిసారి జైలులో ఉంచిన అరువికుట్టి గ్రామంలో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. వైకం పోరాట శతాబ్ది స్మారక ప్రత్యేక తపాల బిళ్ల ఆవిష్కరణకు చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని ముఖ్యమైన విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పోరాటానికి సంబంధించిన సదస్సులు, పాఠశాల, కళాశాల విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, క్వీజ్ పోటీలు నిర్వహించి బహమతులు అందించడానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దీని గురించి విద్యార్థులకు అవగాహన కల్పించేలా 64 పేజీల పుస్తకాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇది తమిళం, ఆంగ్లంలో ఆడియో పుస్తకంగా విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక వ్యాసాలను భాషావేత్తలు నుంచి పొంది వాటితో శతాబ్ది సంచికను ‘తమిళరసు’ పత్రిక ద్వారా అందుబాటులోకి తీసుకునున్నట్లు చెప్పారు. వీటన్నిటిని ఏడాదిలోపు దశలవారీగా అమలు చేస్తామని పేర్కొన్నారు.
విళుపురం ఘటనపై వివరణ
విళుపురం జిల్లాలో ముస్లిం వ్యక్తి హత్యాఘటనపై ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి, సభ్యుడు శివకుమార్ మాట్లాడారు. దానికి ముఖ్యమంత్రి స్పందిస్తూ... కుటుంబ పోషణకు డబ్బులు ఇవ్వని తండ్రి జ్ఞానశేఖర్‌ను నిలదీసేందుకు ఆయన నిర్వహిస్తున్న పండ్ల దుకాణానికి ఇద్దరు కుమారులు వెళ్లారన్నారు. తండ్రి లేకపోవడంతో ఆయన గురించి వాకబు చేస్తూ గొడవ సృష్టించారని తెలిపారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్న ఇబ్రహీంను కత్తితో గాయపరిచినట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడని తెలిపారు. ఈ ఘటనలో నిందితులను అరెస్టు చేసి పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. కుటుంబ సమస్య కారణంగా ఏర్పడిన ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి దురదృష్ణవశాత్తు దాడికి గురై మరణించాడని వెల్లడించారు.
కేఎన్ నెహ్రూ...
* మదురై సహా 9 కార్పొరేషన్లలో బయో సీఎన్‌జీ ప్లాంట్‌లు ఏర్పాటు
* దిండుగల్, నాగర్‌కోవిల్, తిరుచ్చి కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీల్లో రూ.174 కోట్ల వ్యయంతో బస్ స్టేషన్లు ఏర్పాటు
* 12 మున్సిపాలిటీల్లో రూ.42.80 కోట్ల వ్యయంతో బస్ స్టేషన్ల ఆధునీకరణ.
* రూ.60.90 కోట్ల వ్యయంతో 100 పార్కులు ఏర్పాటు
* కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని పాఠశాలల్లో రూ.150 కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి
* 28 మున్సిపాలిటీల్లో రూ.123.80 కోట్ల వ్యయంతో కొత్తగా వార, దిన సంతలు ఏర్పాటు
* కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో రూ.288 కోట్ల వ్యయంతో 400 కి.మీ మట్టిరోడ్లు తారు, కాంక్రీట్, పేవర్ బ్లాక్ రోడ్లుగా మార్పు
* తిరుత్తణి, నందివరం-గూడువాంజేరి, కాంగేయం, తిరుమురుగన్ పూండి, వేదారణ్యం, రామేశ్వరం, జయంకొండం మున్సిపాలిటీలను, ఇడైకళినాడు, కీళ్‌కుళం, సాయల్‌కుడి పట్టణ పంచాయతీలను రెండో గ్రేడ్ నుంచి తొలి గ్రేడ్‌గా, తిరువళ్లూరు, పూందమల్లి, కళ్లకురిచ్చి, ధారాపురం, తిరువారూరు, బోడినాయకనూర్, తెన్కాశి మున్సిపాలిటీలను, మరక్కాణం, తాడికొంబు, వడమదురై, చెట్టియార్‌పట్టి, కారియాంపట్టి, వాసుదేవనల్లూర్, ఉణ్ణామలైకడై పట్టణ పంచాయతీలను తొలిగ్రేడ్ నుంచి సెలెక్షన్ గ్రేడ్‌గా, తిరువేర్కాడు, విళుపురం, మయిలాడుతురై, తేని-అల్లినగరం మున్సిపాలిటీలను, మీంజూరు, అరూర్, ఓమలూరు, వేలూరు, అందియూర్, చెన్నిమలై, కరుమాండి, సొల్లిపాళెయం, కన్నంపాళెయం, వీరపాండి, కురింజిపాడి, మణచ్చనల్లూరు, నత్తం, నిలకోట్టై, పరవై, ఆరల్‌వాయ్‌మొళి పట్టణ పంచాయతీలను సెలెక్షన్ గేడ్ర్ నుంచి స్పెషల్ గ్రేడ్‌గా, పెరంబలూర్ మున్సిపాలిటీని రెండో గ్రేడ్ నుంచి సెలెక్షన్ గ్రేడ్‌గా స్థాయి పెంపు.
ముఖ్య ప్రకటనలు
సభలో మంత్రి కేఎన్ నెహ్రూ మున్సిపల్ పరిపాలన, తాగునీటి సరఫరాశాఖ, మంత్రులు ఉదయనిధి స్టాలిన్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌శాఖ (దారిద్య్ర నిర్మూలన పథకాలు, గ్రామీణ రుణాలు), ఐ.పెరియస్వామి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ ప్రకటనలు చేశారు. ఉదయనిధి స్టాలిన్ చేసిన ప్రకటనల్లో ముఖ్యమైన కొన్ని...
* 45 వేల మంది గ్రామీణ యువతకు రూ.145 కోట్ల వ్యయంతో ఉద్యోగావకాశాలతో కూడిన నైపుణ్య శిక్షణ
* రూ.75 కోట్ల వ్యయంతో 5 వేల స్వయం సహాయక బృందాలకు సామాజిక పెట్టుబడి నిధి
* స్వయం సహాయక బృందాలు నిర్వహించే 7,500 సూక్ష్మ, లఘు పరిశ్రమలు రూ.50 కోట్ల వ్యయంతో బలోపేతం
* రూ.50 కోట్ల నానో ఎంటర్‌ప్రైజ్ ఫైనాన్సింగ్ ఫండ్‌తో వెయ్యి గ్రామ పంచాయతీల్లోని మహిళలు కొత్తగా వ్యాపారం ప్రారంభించడానికి, ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు
* అన్ని జిల్లాల్లోనూ స్థానిక నిపుణులతో గ్రామీణ యువతకు శిక్షణ అందించడానికి రూ.10 కోట్ల వ్యయంతో వెయ్యి కొత్త సామాజిక నైపుణ్య పాఠశాలలు ఏర్పాటు
* గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని స్వయం సహాయక బృందాలకు రూ.9.48 కోట్ల వ్యయంతో శిక్షణ
* విముక్తి కల్పించిన వెట్టిచాకిరి కార్మికులకు రూ.7.34 కోట్లతో పునర్జీవనం, ఆర్థిక మౌలిక వసతులు
* 100 ముఖ్య పర్యాటక ప్రాంతాల్లో స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను విక్రయాలు, ప్రదర్శనకు ఉంచేందుకు రూ.5 కోట్ల వ్యయంతో ‘మతి అంగాడిగళ్’ ఏర్పాటు
* ‘ఒన్ బ్లాక్ ఒన్ ప్రోడక్ట్’ పథకం కింద స్వయం సహాయక బృందం వస్తువులకు రూ.5 కోట్ల వ్యయంతో కామన్ ఫ్యాకల్టీ సెంటర్ ఏర్పాటు
* ప్రత్యేక స్వయం సహాయక బృంద సభ్యుల ఉత్పత్తులను విక్రయించడానికి రూ.3 కోట్ల వ్యయంతో ‘మతి ఎక్స్‌ప్రెస్’ వాహనాలు అందజేత
* స్వయం సహాయక బృందాల ఉత్పత్తులను విక్రయించడానికి అనువుగా రూ.2.5 కోట్ల వ్యయంతో రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ‘బయ్యర్-సెల్లర్’ జంక్షన్లు ఏర్పాటు
* అంతర్జాతీయ చిరుధాన్య ఏడాదిని పురస్కరించుకుని 37 జిల్లా బృహత్పాదక ప్రాంగణాల్లో ‘మిల్లెట్స్ కేఫ్’లు నిర్వహించడానికి మహిళా బృందాలకు రూ.1.85 కోట్లు అందజేత
* అన్ని జిల్లాల్లోనూ రూ.కోటి వ్యయంతో 100 యువజన నైపుణ్య, ఉద్యోగావకాశాల మేళాలు నిర్వహణ
* సీఎం అల్పాహార పథకం అమలుకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంపిక చేసిన స్వయం సహాయక బృందాల మహిళలకు రూ.కోటి వ్యయంతో వంట శిక్షణ
పెరియస్వామి..
* అట్టడుగు ప్రజల జీవన ప్రమాణాల అభివృద్ధికి వారు నివసించే ప్రాంతాల్లో రూ.1,500 కోట్ల వ్యయంతో మౌలిక వసతులైన రోడ్లు, కాలువలు, వీధి దీపాలు, తాగునీటి వసతి.
* గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి కోట్ల వ్యయంతో 10 లక్షల ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు
* రాష్ట్ర ప్రభుత్వ ‘పసుమై తమిళనాడు ఇయక్కం’ కింద రూ.275 కోట్ల వ్యయంతో 70 లక్షల మొక్కలు నాటేందుకు చర్యలు
* గ్రామీణ ప్రాంతాల్లో రక్తహీనతను తగ్గించేందుకు రూ.137 కోట్ల వ్యయంతో 21 లక్షల మునగ మొక్కలను మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా పెంచి 10.50 లక్షల స్వయం సహాయక బృందాల సభ్యులకు అందజేత
* గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 66,130 శుభ్రతా రక్షకుల నెలవారీ వేతనం రూ.3,600 నుంచి రూ.5 వేలకు పెంపు
* పంచాయతీల మౌలిక వసతులు, వ్యర్థాల నిర్వహణ వసతులను సమీపంలోని అర్బన్ ప్రాంతాలతో సంయుక్తంగా అమలు చేసేందుకు రూ.69 కోట్ల వ్యయంతో ప్రత్యేక పథకం.
* కొండ ప్రాంతాల్లోని పంచాయతీల్లో మౌలిక వసతులు అభివృద్ధికి రూ.30 కోట్లతో ప్రత్యేక పథకం.
* పంచాయతీ ప్రాంతాల్లో రూ.70 కోట్ల వ్యయంతో 500 అంగన్‌వాడీ కేంద్రాలు
* సీఎం అలాహార పథకం అమలుకు పంచాయతీ యూనియన్ ప్రాథమిక పాఠశాలల్లో రూ.154 కోట్ల వ్యయంతో 2043 కొత్త పౌష్టికాహార హాళ్లు నిర్మాణం.
* ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు, అధికారులకు శిక్షణ అందించడానికి అనువుగా రూ.3.88 కోట్ల వ్యయంతో 388 పంచాయతీ యూనియన్లలో వీడియో కాన్ఫెరెన్స్ వసతి.
* పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేలా 500 మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలతో 1,500 కి.మీ పొడవైన గ్రామీణ రోడ్ల్లు నిర్మాణం.
* గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ పథక పనులను సమర్ధవంతంగా పర్యవేక్షించడానికి అధికారులకు రూ.20.50 కోట్ల వ్యయంతో 224 వాహనాలు అందజేత
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌కు...
* సింగార చెన్నై 2.ఓ పథకం కింద ఈ ఏడాది రూ.50 కోట్ల వ్యయంతో పాఠశాలల అభివృద్ధి. రూ.30 కోట్ల వ్యయంతో 50 పార్కులు, 10 క్రీడామైదానాలు ఏర్పాటు. రూ.20 కోట్ల వ్యయంతో జలవనరుల పునరుద్ధరణ.
* పెరుంగుడిలో రూ.50 కోట్ల వ్యయంతో పర్యావరణ పార్కు ఏర్పాటు
* కొళత్తూరు, రాయపురం, హార్బరు, చేపాక్-తిరువల్లికేణి, థౌజండ్‌లైట్, వేళచ్చేరి, ఆలందూరులో రూ.5 కోట్ల చొప్పున రూ.35 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాళ్లు ఏర్పాటు
* ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడానికి, చెత్త సేకరణ పనులను వేగవంతం చేసేందుకు రూ.6.90 కోట్ల వ్యయంతో 350 బ్యాటరీ వాహనాలు కొనుగోలు
* ఈ ఏడాది పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో ఉత్తర చెన్నైలో బయో సీఎన్‌జీ ప్లాంట్ ఏర్పాటు
* ఈ ఏడాది రూ.25 కోట్ల వ్యయంతో 15 చోట్ల స్మశానవాటికల్లో గ్యాస్ ఆధారిత దహన వేదికలు ఏర్పాటు
* అడయారులోని తొల్‌కాప్పియ పార్కులో రూ.42.45 కోట్ల వ్యయంతో పునరుద్ధరణ పనులు
* 14, 15వ వార్డుల్లోని రాజీవ్‌గాంధీ రోడ్డు, ఎంజీఆర్ నగర్ మెయిన్ రోడ్డు, తరమణి జంక్షన్ రోడ్డు, 200 అడుగుల రోడ్డు ప్రాంతాలకు రూ.57 కోట్ల వ్యయంతో తాగునీటి పనులు
* కూవం నదిలో మురుగనీరు చేరడాన్ని అడ్డుకునేలా 23 చోట్ల రూ.50 కోట్ల వ్యయంతో పనులు
* 15వ వార్డులోని కన్నగినగర్, 6వ వార్డులోని కన్నికాపురంలోని తమిళనాడు అర్బన్ హాబిటాట్ డెవెలెప్‌మెంట్ బోర్డు నివాసాలకు రూ.89 కోట్ల వ్యయంతో తాగునీటి సరఫరా
* పుళల్, సూరపట్టులోని నీటి శుద్ధీకరణ కేంద్రాలు రూ.40 కోట్ల వ్యయంతో పునర్నిర్మాణం
* 4వ వార్డులోని కొరుక్కుపేటలో 25 వీధులకు రూ.18 కోట్ల వ్యయంతో కొత్తగా తాగునీటి కుళాయిలు
* కొళత్తూరులో రూ.20 కోట్ల వ్యయంతో 20 కి.మీ దూరానికి డ్రైనేజీ గొట్టాలు అభివృద్ధి
* 5వ వార్డులోని ఈవీకేఎస్ సంపత్ రోడ్డులో రూ.5 కోట్ల వ్యయంతో మురుగునీటి పంపింగ్ స్టేషన్ ఏర్పాటు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
కోర్టు బోనెక్కనున్న బ్రిటన్ రాకుమారుడు..
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
India News
అరిహాను స్వదేశానికి పంపండి.. మూడేళ్ల పాప కోసం జర్మనీపై భారత్ ఒత్తిడి
-
India News
పెద్దమనసు చాటుకున్న దీదీ
-
Crime News
పెద్ద నోట్లకు ఆశపడితే ఉన్న నోట్లు జారిపాయే!.. రాజానగరంలో సినీఫక్కీలో రూ. 50 లక్షల చోరీ
-
Ts-top-news News
రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు