logo

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా కల్పించాలి

పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, తిరుక్కురళ్‌ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని కోరుతూ పుదువై శాసనసభలో ప్రభుత్వం తీర్మానాలు చేసింది.  

Published : 01 Apr 2023 05:34 IST

శాసనసభలో తీర్మానం ఆమోదం

రాష్ట్రహోదా తీర్మానానికి మద్దతు తెలుపుతున్న సభ్యులు

చెన్నై, న్యూస్‌టుడే: పుదుచ్చేరికి రాష్ట్ర హోదా, తిరుక్కురళ్‌ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని కోరుతూ పుదువై శాసనసభలో ప్రభుత్వం తీర్మానాలు చేసింది.  శుక్రవారం ప్రతిపక్షనేత శివ, డీఎంకే ఎమ్మెల్యేలు నాజిం, అనిపాల్‌ కెనడి, నెహ్రూ (స్వతంత్ర), సెంథిల్‌కుమార్‌ ప్రత్యేక తీర్మానాలు ప్రతిపాదించారు. రాష్ట్ర హోదా కోసం 36 ఏళ్లుగా 13సార్లు తీర్మానాలు చేసినా కేంద్రం నిరాకరించిందని ప్రతిపక్షనేత శివ తెలిపారు. పుదుచ్చేరిలో ప్రజాప్రతినిధులైన ముఖ్యమంత్రి, మంత్రులను పలు విషయాల్లో పక్కనపెట్టి ప్రధాన కార్యదర్శి, గవర్నర్‌ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.  ఈ తీర్మానానికి భాజపా, ఎన్నార్‌ కాంగ్రెస్‌, డీఎంకే, కాంగ్రెస్‌, స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. ముఖ్యమంత్రి రంగస్వామి మాట్లాడుతూ... మన హక్కులు సుస్థిరం కావాలన్నారు. దానికి రాష్ట్ర హోదా మాత్రమే ఏకైక మార్గమని తెలిపారు.  ఎమ్మెల్యేలతో వెళ్లి ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి ఈ ఏడాదిలోపు రాష్ట్ర హోదా పొందుదామని పిలుపునిచ్చారు. సభ్యులు తమ తీర్మానాలను వెనక్కు తీసుకుంటే ప్రభుత్వ తరఫున నెరవేర్చి కేంద్రానికి పంపుదామంటూ సభాపతి సెల్వం సూచించారు. ఆ మేరకు సభ్యులు చేయడంతో ప్రభుత్వం తీర్మానాన్ని తీసుకురాగా ఏకగ్రీవంగా ఆమోదించారు. తిరుక్కురళ్‌ను జాతీయ గ్రంథంగా ప్రకటించాలని డీఎంకే ఎమ్మెల్యే అనిపాల్‌ కెనడి తీసుకొచ్చిన తీర్మానాన్ని కూడా ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టారు. దీన్ని కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని