logo

MK Stalin: ప్రైవేటు సంస్థల్లో 12 గంటల పనివేళలు

వారంలోని మొత్తం సమయంలో మార్పులేకుండా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో రోజు 12 గంటలపాటు పనిచేసేలా ఓ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టారు.

Updated : 22 Apr 2023 10:56 IST

బిల్లు సమర్పించిన కార్మిక మంత్రి
నిరసనగా కూటమి సభ్యుల వాకౌట్‌ 
ముగిసిన శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు

సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: వారంలోని మొత్తం సమయంలో మార్పులేకుండా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో రోజు 12 గంటలపాటు పనిచేసేలా ఓ బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు సహా అధికార కూటమి పార్టీల సభ్యుల వ్యతిరేకత మధ్య మూజువాణి విధానంలో బిల్లు నెరవేరింది. బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా శుక్రవారం శాసనసభలో కార్మిక సంక్షేమశాఖ మంత్రి సీవీ గణేశన్‌ ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో వారంలోని మొత్తం పనివేళల్లో మార్పులేకుండా రోజుకు 12 గంటలుగా పనివేళలను పెంచే ఆ బిల్లుకు ప్రతిపక్షాలు, డీఎంకే కూటమి పార్టీల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. శాసనసభ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతలు విలేకర్లతో మాట్లాడారు. ఇది పరిశ్రమల యాజమాన్యానికి అనుకూలమైన బిల్లుగా ఉందని సిందనై సెల్వన్‌ (వీసీకే) ఆరోపించారు. ఇది శ్రమదోపిడీకి బాటలు వేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు అనుకూలంగా రాష్ట్రప్రభుత్వం ఈ బిల్లు నెరవేర్చిందని నాగై మాలి (సీపీఎం) ఆరోపించారు. కార్మిక హక్కులను కాలరాసే ఈ చట్టం గురించి ఉదయాన్నే ముఖ్యమంత్రితో మాట్లాడగా ఆయన హామీ ఇచ్చారని, అయినా బిల్లును నెరవేర్చారని విమర్శించారు. వందేళ్లు పోరాడి సాధించిన వేతనపెంపు, ఉద్యోగ పర్మినెంట్‌ వంటివాటిని నీరుగార్చేలా ఈ బిల్లును ప్రవేశపెట్టారని రామచంద్రన్‌ (సీపీఐ) ఆరోపించారు. శాసనసభ ప్రాంగణంలో పరిశ్రమలశాఖ మంత్రి తంగం తెన్నరసు విలేకర్లతో మాట్లాడారు. నేటి ప్రపంచవ్యాప్త పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు తమిళనాడుకు వస్తున్నాయని తెలిపారు. రాష్ట్రానికి తరలివచ్చే పలు పరిశ్రమలు పనివేళల్లో వెలుసుబాట్లు కోరుతున్నాయని పేర్కొన్నారు. అలాంటి పరిశ్రమల కోసమే ఈ చట్టమని తెలిపారు. ఈ బిల్లు ఏ కార్మికులకు వర్తిస్తుందనే విధానాలను ప్రభుత్వం రూపొందించి వెల్లడిస్తుందని పేర్కొన్నారు. ఈ విధానానికి సుముఖంగా ఉండేవారు మాత్రమే పాటించే హక్కు కల్పించనున్నట్టు తెలిపారు. 12 గంటల పనికి తగిన వసతులను కార్మికులకు కల్పించేలా ఉండే సంస్థలు, పరిశ్రమలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు. కార్మిక సంక్షేమశాఖ మంత్రి సీవీ గణేశన్‌ మాట్లాడుతూ... ఈ బిల్లు వల్ల వారంలోని మొత్తం పనివేళల్లో మార్పు ఉండదన్నారు. బిల్లు ప్రకారం 4 రోజులు పనిచేసి మిగతా 3 రోజులు విశ్రాంతి తీసుకోవచ్చని తెలిపారు. ఈ బిల్లు కారణంగా వారం మొత్తం పనివేళలు, సెలవుల్లో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. 4 రోజుల తర్వాత పనిచేస్తే దానికి తగిన వేతనం ఉండేలా బిల్లు రూపొందిందని వెల్లడించారు.

పోలీసులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే

శాసనసభలో పోలీసుశాఖ పద్దులపై చర్చకు సమాధానంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ మాట్లాడారు. మరో రెండు వారాల్లో ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకోనుందని తెలిపారు. అతి దారుణమైన ఆర్థిక ఇబ్బందులు, కేంద్ర ప్రభుత్వ సహకారం లేని దుర్భరమైన పరిస్థితుల్లోనూ ప్రజలకు సేవలు అందిస్తోందని పేర్కొన్నారు. రెండేళ్లలో దేశాన్నే ఆకర్షించేలా ప్రభుత్వం ఏర్పాటు కావడం ఈ మంత్రివర్గ ఔన్నత్యమని తెలిపారు. తమ దృష్టి నుంచి తప్పిపోయే విషయాలను విమర్శించే హక్కు ప్రతిపక్ష సభ్యులకు ఉందన్నారు. అయితే వారి చర్యల ఆవేదన కలిగిస్తున్నాయని తెలిపారు. సభలో మద్దతు పలికినా, వ్యతిరేకించినా అది ప్రజల కోసమే మాట్లాడుతున్నారని గ్రహిస్తానని పేర్కొన్నారు. పోలీసుల వ్యవహారాల్లో లోపాలు లేవని చెప్పబోనన్నారు. ఫిర్యాదులు ఉంటే చెప్పాలని, వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఆదేశిస్తానని తెలిపారు. నేరస్థులు ఎవరైనా, ఎంతటి కొమ్ములు తిరిగిన వారైనా కచ్చితంగా కాపాడబోమని చెప్పారు. కుల, మత విద్వేషకులు, సంఘ విద్రోహులపై చేపట్టిన కఠిన చర్యలతో కులమత ఘర్షణలు లేకుండా రాష్ట్రం ప్రశాంతంగా ఉందన్నారు. పోలీసుశాఖ చర్యలతో నేరాలు తగ్గాయని తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులపై దాడులు జరుగుతున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వైరలైన వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించిన తీరును వివరించారు. దీనిని పలు రాష్ట్రాలు సైతం అభినందించాయని తెలిపారు. గత ప్రభుత్వంతో పోల్చిస్తే ప్రస్తుతం రాష్ట్రంలో లాకప్‌ మరణాలు లేవన్నారు. ప్రజల్లో ఆశలు ప్రేరేపించి మోసాలకు పాల్పడే ఆర్థిక సంస్థలపై నిఘా ఉంచాలని పోలీసుశాఖను ఆదేశించినట్టు తెలిపారు. అన్నాడీఎంకే హయాంలోని పలు కేసులపై ప్రస్తుత ప్రభుత్వమే చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత బంగ్లాలో జరిగిన హత్య, దోపిడీని ఆమె పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నవారే దాచేందుకు ప్రయత్నిస్తే డీఎంకే ఎలా చూస్తోందని ప్రశ్నించారు. కొడనాడు కేసులో నిజమైన నేరస్తులు ఎవరు? కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నించిన వాళ్లెవరనే విషయాలు కచ్చితంగా సీబీసీఐడీ దర్యాప్తులో వెలుగులోకి వస్తాయని తెలిపారు. మత్తుపదార్థాల నిర్మూలనకు చేపట్టిన చర్యలతో పదేళ్లపాటు పాతుకుపోయిన గంజాయి సామ్రాజ్యం కుప్పకూలిందన్నారు. నేరాల అడ్డుకట్ట కోసం పోలీసుశాఖకు అందించిన పరికరాలు, అమలు చేసిన పథకాలు గురించి వివరించారు. రాష్ట్రాన్ని కాపాడే పోలీసులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు. పోలీసుల సంక్షేమాన్ని కాపాడేందుకు మరిన్ని చర్యలను చేపట్టనున్నట్టు వెల్లడించారు. మహిళా పోలీసులు కోసం ప్రభుత్వం అందించిన, ప్రకటించిన పథకాలు గురించి వివరించారు. ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌, రాష్ట్ర ప్రత్యేక పోలీసుదళం, తాలూకా తదితర విభాగాలకు 615 మంది ఎస్సైల ఎంపికకు, 2,599 ఉద్యోగ ఖాళీల భర్తీకి, 106 మంది ఎస్సైలు (సాంకేతిక పరిజ్ఞానం), 63 మంది ఎస్సైలు (వేలి ముద్రలు సేకరణ) ఉద్యోగ ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడనుందని తెలిపారు. పోలీసుశాఖ, అగ్నిమాపకశాఖ పద్దులపై చర్చ సందర్భంగా కొత్త ప్రకటనలనూ చేశారు. * చెన్నై పోలీసుశాఖలోని భద్రతా విభాగానికి పేలుడు మందు కనిపెట్టి నిర్వీర్యం చేసే పరికరాలు అందజేత,  2 వేల సీసీ కెమెరాల ఏర్పాటు, స్టేషన్లకు అగ్నిమాపక పరికరాలు, సీసీబీ అధికారులకు 40 ల్యాప్‌టాప్‌లు, 25 రిమోట్‌ చేతి సంకెళ్లు, కీళాంబాక్కంలో పోలీస్‌ స్టేషన్‌, ఆవడి, తాంబరం పోలీసులకు రోజుకు రూ.300 చొప్పున ఆహార భత్యం, చింతాద్రిపేటలో 200 మంది మహిళా పోలీసులు బస చేసేందుకు వసతి గృహం ఏర్పాటు వంటి నిర్ణయాలు వాటిలో ఉన్నాయి.

అన్నాడీఎంకే వాకౌట్‌

ముఖ్యమంత్రి ప్రసంగించే సమయంలో అన్నాడీఎంకే విప్‌ ఎస్పీ వేలుమణి మాట్లాడేందుకు ప్రయత్నించారు. సభలో ప్రతిపక్ష సభ్యుల ప్రసంగాన్ని టీవీ ఛానెళ్లలో ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదన్నారు. ఆయన మాట్లాడేందుకు అనుమతి లేదంటూ మైక్‌కు కనెక్షన్‌ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నా ఎస్పీ వేలుమణి తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూనే ఉన్నారు. దీనికి డీఎంకే సభ్యులు నిరసన గళం విప్పారు. ‘ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. కూర్చోండి’ అంటూ మందలింపు ధోరణితో చెప్పారు. ప్రతిపక్ష సభ్యుల అభ్యర్థనను ఆమోదించకపోవడంతో సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో పళనిస్వామి సహా అన్నాడీఎంకే సభ్యులు వాకౌట్‌ చేశారు. ఇది ఆమోదయోగ్యం కాదని సభాపతి అప్పావు అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి 20 నుంచి కొనసాగిన బడ్జెట్‌ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని