logo

Tamilnadu: ఈపీఎస్‌, ఓపీఎస్‌ బల నిరూపణకు సన్నాహాలు.. శశికళ, దినకరన్‌ల హాజరు?

మదురై వేదికగా బల నిరూపణకు ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పూర్తిగా పళనిస్వామి వశమైంది. ఎన్నికల కమిషన్‌ కూడా ఇటీవల తన అధికారిక వెబ్‌సైట్‌లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన పేరు ఉంచింది.

Updated : 19 May 2023 08:49 IST

మదురై వేదికగా భారీ మహాసభ

సైదాపేట, న్యూస్‌టుడే : మదురై వేదికగా బల నిరూపణకు ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పటికే అన్నాడీఎంకే పూర్తిగా పళనిస్వామి వశమైంది. ఎన్నికల కమిషన్‌ కూడా ఇటీవల తన అధికారిక వెబ్‌సైట్‌లో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన పేరు ఉంచింది. సవరించిన అన్నాడీఎంకే నిబంధనలు విడుదల చేసింది. మరోపక్క కార్యకర్తల మద్దతు తమకే ఉందని ఓపీఎస్‌ వర్గం చెబుతోంది. ఇటీవల ఓపీఎస్‌ నేతృత్వంలో తిరుచ్చి భారీ మహాసభ నిర్వహించారు. దీనికి అన్నాడీఎంకే కార్యకర్తలు, ప్రజలు బాగానే హాజరయ్యారు. దీంతో దీనికి  కొనసాగింపుగా పలు చోట్ల నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలవారీగా కార్యకర్తలను కలవనున్నట్లు ఓపీఎస్‌ వర్గం తెలిపింది. ముఖ్యంగా ఈపీఎస్‌ సొంత జిల్లా అయిన సేలంలో సభకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దానికి ముందు మదురైలో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

టీటీవీతో భేటీ

ఇటీవల ఏఎఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం కలిసిన సంగతి తెలిసిందే. సీనియర్‌ నేత బన్రూట్టి రామచంద్రన్‌ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఇందులో బన్రూట్టి రామచంద్రన్‌తోపాటు మాజీ ఎంపీ సయ్యద్‌ఖాన్‌ పాల్గొన్నారు. ఓపీఎస్‌ వెన్నంటి ఉన్న వైద్యలింగం, జేసీటీ ప్రభాకర్‌, మనోజ్‌ పాండియన్‌లు భేటీలో పాల్గొనకపోవటం గమనార్హం. ఆ భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడిన ఓపీఎస్‌... దినకరన్‌తో కలిసి పని చేయనున్నట్లు చెప్పారు. అన్నాడీఎంకేను కాపాడి నిజమైన కార్యకర్తల చేతికి అప్పగిస్తామని  తెలిపారు. త్వరలో శశికళను కూడా కలవనున్నట్లు ఓపీఎస్‌ ప్రకటించారు.

సభ రూపంలో సత్తా..

ఈ నేపథ్యంలో ఈపీఎస్‌, ఓపీఎస్‌ వర్గాలు మదురైలో పోటాపోటీగా భారీ మహాసభలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే పళనిస్వామి తన వర్గంలోని మాజీ మంత్రులు ఆర్బీ ఉదయకుమార్‌, సెల్లూరు రాజులకు ఆ పనులు అప్పగించారు. వారు ఇప్పటినుంచే ఈపీఎస్‌ మహాసభకు భారీగా కార్యకర్తలు హాజరయ్యేలా పనులు ప్రారంభించినట్లు సమాచారం. ఈ సారి ఓపీఎస్‌, టీటీవీ దినకరన్‌ల మద్దతుదారులు కలిసి మదురై మహానాడు ఏర్పాటు పనులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో శశికళ పాల్గొనేందుకు అవకాశం ఉందని తెలుస్తోంది. సీనియర్‌ నేత బన్రూట్టి రామచంద్రన్‌ దీనికి సంబంధించి శశికళతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఒకే వేదికపై ఓపీఎస్‌, టీటీవీ, శశికళలు పాల్గొనేలా సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

లోక్‌సభ ఎన్నికలే లక్ష్యం

త్వరలో లోక్‌సభ ఎన్నికలు ఉన్నందున అన్నాడీఎంకే వర్గాల ఈ బల నిరూపణ యత్నాలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోపు భారీ మహాసభలతో తమ బలాలు నిరూపించే యత్నంలో అన్నాడీఎంకే వర్గాలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నిల్లోపు ఓపీఎస్‌ ఏం చేస్తారు? ప్రత్యేక పార్టీ పెడతారా? టీటీవీ, ఓపీఎస్‌, శశికళ కలిస్తే భాజపా ఏం చేయనుంది? వంటి పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో కూటమి లెక్కలు మారే అవకాశాలు కూడా ఉందని విశ్లేషకుల అంచనా. భాజపాతో పొత్తు గురించి అన్నాడీఎంకే ఆలోచించాలని వీసీకే అధ్యక్షుడు తిరుమా తరచుగా చెబుతున్నారు. ఒకవేళ అన్నాడీఎంకే కూటమిలో భాజపా లేకుంటే తిరుమావళవన్‌ చేరే అవకాశం ఉందని రాజకీయ వర్గాల సమాచారం. అలాగే పీఎంకే కూడా డీఎంకే కూటమిలో చేరేందుకు చర్చలు జరుగుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే- భాజపా కూటమి కొనసాగుతుందా? ఓపీఎస్‌, టీటీవీ, శశికళలకు భాజపా మద్దతిస్తుందా? తదితర అంశాలు ఆసక్తికరంగా మారాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని