logo

Sarath Babu: తమిళనేల మెచ్చిన తెలుగుబిడ్డ.. ‘జయ’ సరసన చివరి హీరో..

శరత్‌బాబు.. తమిళతెరపై తన ప్రత్యేకత చాటుకున్న తెలుగుతేజం. ఇక్కడి ప్రేక్షకుల మనసులో ‘మనవాడు’గా స్థానాన్ని సంపాదించుకున్న నటుడు.

Updated : 23 May 2023 08:59 IST

శరత్‌బాబు

కోడంబాక్కం, న్యూస్‌టుడే: శరత్‌బాబు.. తమిళతెరపై తన ప్రత్యేకత చాటుకున్న తెలుగుతేజం. ఇక్కడి ప్రేక్షకుల మనసులో ‘మనవాడు’గా స్థానాన్ని సంపాదించుకున్న నటుడు. హీరో, డాక్టర్‌, స్నేహితుడు, విదేశీ పెళ్లికొడుకు, గ్రామానికి వెళ్లే పట్టణం కుర్రాడు.. ఇలా పలు పాత్రలు పోషించి మెప్పించారు. 1973 నుంచే తెలుగు చిత్రాల్లో నటించిన శరత్‌బాబు.. 1977లో కె.బాలచందర్‌ దర్శకత్వంలోని ‘పట్టిణప్రవేశం’ చిత్రం ద్వారా తమిళ సినిమాలో అడుగుపెట్టారు. ఆయన తెరపై విడుదలైన తొలి తమిళ చిత్రం ‘నిళల్‌ నిజమానదు’ (నీడ నిజమైనది). ఇది కూడా బాలచందర్‌ దర్శకత్వంలోనిదే. ఇందులో కమల్‌హాసన్‌కు స్నేహితుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘వట్టత్తుక్కుళ్‌ సదురం’, ‘ముళ్లుం మలరుం’, ‘అగల విళక్కు’, ‘నినైత్కాలే ఇనిక్కు’, ‘నెంజత్తై కిళ్లాదే’ వంటి పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. కొంతకాలానికి ఆయన తమిళనటుడిగానే ఇక్కడి ప్రేక్షకుల మదిలో స్థానాన్ని సంపాదించుకోవడం విశేషం. అంతేకాకుండా ‘దిసై మారియ పరవైగళ్‌’, ‘పొన్నగరం’, ‘ఉచ్చకట్టం’, ‘కన్నిల్‌ తెరియుం కదైగళ్‌’, ‘నదియై తేడివంద కడల్‌’, ‘మెట్టి’ వంటి పలు చిత్రాల్లో హీరోగా నటించారు.

‘ముత్తు’లో రజనీకాంత్‌తో..

శివాజి గణేశన్‌తో కూడా పలు చిత్రాల్లో కలసి నటించారు శరత్‌బాబు. ‘కీళ్‌వానం సివక్కుం’, ‘తీర్పు’, ‘సందిప్పు’, ‘ఎళుదాద సట్టంగళ్‌’ వంటి చిత్రాల్లో శివాజితో కలసి నటించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత కథానాయికగా నటించిన ‘నదియై తేడివంద కడల్‌’ చిత్రంలో హీరోగా మెప్పించారు. అదే ఆమె నటించిన చివరి చిత్రం. ఇక రజనీకాంత్‌కు స్నేహితుడిగా పలు సినిమాలు చేశారు. ‘ముల్లుం మలరుం’, ‘నెట్రిక్కన్‌’, ‘వేలైక్కారన్‌’, ‘అన్నామలై’, ‘ముత్తు’ చిత్రాలతో ఆయన తిరుగులేని గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమాల్లోని శరత్‌బాబు పాత్రల పేర్లు కూడా సుస్థిరంగా నిలిచిపోయినవే కావడం విశేషం.

‘నదియై తేడివంద కడల్‌’లో..

తీరని విషాదం..

నటుడిగా చెరగని ముద్రవేసుకున్న శరత్‌బాబు అనారోగ్యంతో ఉన్నప్పటి నుంచే కోలీవుడ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో శరత్‌బాబు ఇకలేరన్న మాట విని పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మంచి నటుడు, స్నేహితుడిని కోల్పోయినట్లు  కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. తీవ్ర ఆవేదనకు గురవుతున్న నటి రాధిక సంతాపం ప్రకటించారు.

‘ముళ్లుం మలరుం’లో..
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని