పాత గూటికి పన్నీర్ సెల్వం?
పన్నీర్‌సెల్వం తరఫున అన్నాడీఎంకేకు మళ్లీ రాయబారం పంపినట్లు సమాచారం. అదేవిధంగా ఓపీఎస్‌ను మళ్లీ పార్టీలోకి చేర్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.
మద్దతుదారులతో రాయబారం
అన్నాడీఎంకేలో భిన్నాభిప్రాయాలు
సైదాపేట, న్యూస్‌టుడే: పన్నీర్‌సెల్వం తరఫున అన్నాడీఎంకేకు మళ్లీ రాయబారం పంపినట్లు సమాచారం. అదేవిధంగా ఓపీఎస్‌ను మళ్లీ పార్టీలోకి చేర్చుకోవడంపై భిన్నాభిప్రాయాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. పన్నీర్ తదుపరి రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉంటాయో తెలియడం లేదు. ఆయనకు మొత్తం మూడు మార్గాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకటి అన్నాడీఎంకేలో మళ్లీ చేరడం లేదా వేరే పార్టీలో చేరడం, రెండోది కొత్త పార్టీ పెట్టడం. మొదటి మార్గాన్నే ఓపీఎస్ ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎడప్పాడి ససేమిరా అంటున్నట్లు సమాచారం. అదేవిధంగా ఓపీఎస్‌ను మళ్లీ పార్టీలో చేర్చుకోవడం గురించి అన్నాడీఎంకేలో రెండు రకాలుగా అనుకుంటున్నారు. అగ్రనేతలకు సంబంధించినంత వరకు మళ్లీ పార్టీలో చేర్చుకోవడం సరికాదంటున్నారు. కారణం పదవి కోసం పార్టీని ఎన్ని ఇబ్బందులు పెట్టడానికైనా పన్నీర్ సిద్ధంగా ఉంటారన్నది వారి అభిప్రాయం.
అంగీకరించని సీనియర్లు
ఒక రకంగా ఇప్పుడే అతిపెద్ద న్యాయ పోరాటం చేసి పార్టీని ఎడప్పాడి పళనిస్వామి నేతృత్వంలోకి తెచ్చామని సీనియర్ నేతలు అంటున్నారు. మళ్లీ ఓపీఎస్ పార్టీలోకి వస్తే అతని నేతృత్వంలో ఓ వర్గం పని చేస్తుందనేది వారి అభిప్రాయం. అంతేకాకుండా ఓపీఎస్ తనకు మద్దతుగా సర్కిల్‌ను తయారు చేసి వారికి పదవులు ఇప్పించేందుకు యత్నిస్తారని భావిస్తున్నారు. దీంతో పార్టీలో మళ్లీ అనవసర సమస్యలు ఉద్భవిస్తాయని అంటున్నారు. శశికళ, దినకరన్‌లకు ఇప్పటివరకు మద్దతుగానే మాట్లాడుతున్న పన్నీర్.. పార్టీలోకి వస్తే శశికళ, టీటీవీలను కూడా తీసుకొచ్చేందుకు యత్నిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఓపీఎస్ మద్దతు ఇస్తారో? ఇవ్వరో? తెలియదు. కావున ఓపీఎస్ పార్టీలోకి రాకుండా ఉండటమే సరైందని సీనియర్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
మద్దతుగా ఓ వర్గం
అయితే మరో వర్గం తరఫున భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నాడీఎంకే మళ్లీ అధికారంలోకి రావాలంటే పార్టీకి అదనపు బలం కావాలని భావిస్తున్నారు. ప్రధాన కార్యదర్శి అయినందున ఈపీఎస్ మునుపటిలా ఉండరు. పన్నీర్ పార్టీలో ఉంటేనే ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చన్నది వారి అభిప్రాయం. అధికార పరిధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు. తన కొంగు మండలానికే ఎడప్పాడి ఎక్కువ మేలు చేశారని, ఇప్పుడు ప్రధాన కార్యదర్శి అయినందున కొంగు మండలానికే మరింత మేలు జరుగుతుందని ఇతర మండలాల అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు. ఇటీవల అమిత్‌షాను కలిసేందుకు దిల్లీ వెళ్లిన పళనిస్వామి కొంగు మండలానికి చెందిన నేతలను మాత్రమే వెంట తీసుకెళ్లారు. దీంతో ముక్కులత్తోర్ సామాజిక వర్గాన్ని ఈపీఎస్ పెద్దగా పట్టించుకోవడం లేదనే అసంతృప్తి ఆ సామాజిక వర్గంలో నెలకొంది. వన్నియర్ సామాజిక వర్గానికి చెందిన ముఖ్య నిర్వాహకులకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చిన నేపథ్యంలో ముక్కులత్తోర్ సామాజిక వర్గానికి చెందినవారు ఎవరూ అందులో లేరు. ఎస్పీ వేలుమణి, తంగమణి, కేపీ మునుస్వామి, సీవీ షణ్ముగం మాత్రమే ఈపీఎస్ వెంట వెళ్లారు. సీనియర్ కావటంతో జాలరి సామాజిక వర్గానికి చెందిన జయకుమార్‌ను తీసుకెళ్లారు. ముక్కలత్తోర్ సామాజిక వర్గంలో పలుకుబడి ఉన్నవారు మాజీ మంత్రి విజయభాస్కర్. అతనికి కూడా ఎలాంటి ఆహ్వానం లేదు. అలాగే ఉదయకుమార్, సెల్లూర్ రాజు తదితరులను కూడా తీసుకెళ్లలేదు.
కొందరి అసంతృప్తి
దీంతో ముక్కులత్తోర్ సామాజిక వర్గ నేతలు ఈపీఎస్‌పై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. ఇకపై ఇలాంటి విస్మరణలు మరింత పెరుగుతాయని ఆ వర్గ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఓపీఎస్‌కు ఏదైనా ఒక పదవి ఇవ్వాలని, భాజపాతో కూటమిని అన్నాడీఎంకే ఇష్టపడుతుంటే పన్నీర్‌ను పార్టీలో చేర్చుకోవడంలో తప్పు లేదని కొంత మంది నేతలు చెబుతున్నట్లు సమాచారం. కొన్ని నిబంధలు పెట్టి పన్నీర్‌ను చేర్చుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతోనే ప్రధాని మోదీకి కావల్సిన వారిని విస్మరించడం కుదరదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పరోక్షంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. డీఎంకే ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నా అన్నాడీఎంకేలో నెలకొన్న సమస్యలతో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం కుదరటం లేదని, కావున ఓపీఎస్‌ను పార్టీలో చేర్చుకోవాలని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఎలాగైనా ఓపీఎస్, అతని కుమారుడు రవీంద్రనాథ్‌ను భాజపా వదలదని, పన్నీర్‌ను పార్టీలో చేర్చుకోకుంటే ఎడప్పాడి పళనిస్వామికి ఇబ్బందులు తప్పవన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. భాజపా పరోక్షంగా ఒత్తిడి తెస్తుందని, అమిత్‌షా చెప్పినట్లు వారంతా కలిసి మాట్లాడుకుని అన్నాడీఎంకే సమస్యను పరిష్కరించుకోవడమే మార్గంగా ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయంలో అదనపు కౌంటర్లు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/06/2023)
-
Ap-top-news News
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం.. 18 దూరప్రాంత రైళ్ల రద్దు
-
Sports News
ఆ బౌలర్ అరంగేట్రం.. అతడికి జాక్‌పాట్
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!