logo

Tamil Nadu: కన్నీరు పెట్టిన రాష్ట్రం!

వేలూర్‌ జిల్లా అనైకట్టు నియోజకవర్గం అల్లేరి పంచాయతీలోని అత్తిమరత్తు కొల్లై గ్రామం. కొండపై ఉంటుంది. చుట్టూ అడవి. దాని సమీపంలోనే మరిన్ని గ్రామాలున్నాయి. ప్రియ, విజయ్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రియ ఉపాధిహామీ పథకం పనులకు వెళ్తుంటారు

Updated : 31 May 2023 22:58 IST

రోడ్డువసతి లేక సకాలంలో పాపకు అందని వైద్యం
పాము కాటుతో విగతజీవిగా మారిన వైనం
బాధిత గ్రామానికి పరుగున వెళ్లిన కలెక్టర్‌

  మృతదేహంతో తల్లిదండ్రులు

పాప నోట్లో నురుగ.. డీలాపడిపోయింది.. ఎంత పిలిచినా పలకడంలేదు.. ఆసుపత్రికెళ్లాలంటే అంతా మట్టిరోడ్డు.. కొన్నిచోట్లయితే కాళ్లు కూడా దిగబడతాయి..పాపకోసంకిలోమీటర్ల తరబడిఆ కుటుంబం పరుగున వెళ్లింది. దారిపొడవునా వేదనే. అంతటి అవస్థలు పడ్డా.. పసిపాప ప్రాణంమాత్రం దక్కలేదు. వీరుపడ్డ కష్టం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది‘అయ్యో..’ అంటూ స్పందించారు. ఆ ఊరికి రోడ్డెయ్యాలని ప్రాధేయపడ్డారు.  

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే; వేలూర్‌

వేలూర్‌ జిల్లా అనైకట్టు నియోజకవర్గం అల్లేరి పంచాయతీలోని అత్తిమరత్తు కొల్లై గ్రామం. కొండపై ఉంటుంది. చుట్టూ అడవి. దాని సమీపంలోనే మరిన్ని గ్రామాలున్నాయి. ప్రియ, విజయ్‌ దంపతులకు ముగ్గురు పిల్లలు. ప్రియ ఉపాధిహామీ పథకం పనులకు వెళ్తుంటారు. విజయ్‌ రోజువారీ కార్మికుడు. శుక్రవారం రాత్రి ఇంటి ఆవరణలోనే 18 నెలల తనుష్కను పడుకోబెట్టారు. కానీ ఎలా వచ్చిందోగానీ ఓ పాము వచ్చి కాటేసింది. మరుగుదొడ్డికి వెళ్లాలని లేచిన తల్లి.. పాపను చూడగానే, చేతికి కరుస్తూ కనిపించిందా పాము. వెంటనే చిన్నారిని లాక్కున్న ప్రియ.. తన కుటుంబసభ్యులను పిలిచారు. అప్పటికే పాప నోటి నుంచి నురుగ వస్తోంది. పాపలో ఉలుకూపలుకూ లేకపోవడంతో అంతా కంగారుపడ్డారు. ఏమైందోఏంటో అనుకుని.. ముందు తెలిసినవాళ్ల ద్విచక్రవాహనాన్ని తీసుకుని ఆసుపత్రికని బయలుదేరారు. వారు ధైర్యం చేశారుగానీ.. వాళ్ల ఊరిదారి ఎలా ఉందో వారికి తెలుసు. కానీ ప్రాణం కాపాడుకోవాలనే ఒకే లక్ష్యంతో బండిపై వెళ్లారు. దారినిండా రాళ్లు, గోతులు, టైరు దిగిపోయేంత మెత్తటి మట్టి. పైగా రాత్రిసమయం. ఎంతోదూరం వారి ప్రయాణం సాగలేదు. మధ్యలో బండి చెడిపోవడంతో.. పాపను తీసుకుని నడవటం మొదలుపెట్టారు. వారి ఊరి నుంచి ప్రధానరోడ్డువరకు వెళ్లాలంటే 12కి.మీ. దీంతో సుమారు 6కి.మీ మేర కాసేపు పరుగు, ఇంకాపు నడక.. ఇలా అవస్థలు పడుతూనే రోడ్డును చేరారు. వర్తలంపట్టు ప్రాంతం నుంచి మరో ఆటో తీసుకుని మరో 9 కి.మీ. ప్రయాణించి ఆసుపత్రికి వెళ్లారు. దారి పొడవునా ఏడుస్తూ, పాపను కదుపుతూ హృదయవిదారకంగా సాగింది వారి ప్రయాణం.

వైద్యులే కలత చెందారు 

ఆసుపత్రిలో అడుగుపెట్టే సమయానికే పాపలో చలనం లేదు. పలకడంలేదు. పరీక్షలుచేసిన వైద్యులు చేతి వేలికి పాము కాటువేయడంతో విషం మెదడుకు, నరాలకు పాకిందని చెప్పారు. చిన్నారి ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో ఆక్సిజన్‌ ఇంకుబేటర్‌ను అమర్చారు. విషానికి విరుగుడుగా ఇంజక్షన్‌ వేశారు. ఎంత ప్రయత్నించినా పాపలో చలనంలేదని వైద్యులు చెప్పారు. చిన్నపిల్లల ప్రత్యేక ఆసుపత్రికి అత్యవసరంగా తరలించాలని వారు సూచించారు. దీంతో కుటుంబీకులు అడుకంపారై ఆసుపత్రికి ఆంబులెన్స్‌లో వెళ్లారు. అక్కడ పలురకాల పరీక్షలు చేసినా లాభంలేకపోయింది. పాప ప్రాణం పోయిందని వైద్యులు తల్లిదండ్రులకు కబురుపెట్టారు. వారికిక కన్నీళ్లు ఆగలేదు. అంతా అంధకారమైనట్లుగా కనిపించింది. ఓ మూలన కూర్చుని బోరును ఏడుస్తూ గడిపారు.


‘ఇంకో ప్రాణం పోనివ్వను’

గ్రామానికీ వెళ్లే ధారి

అల్లేరి పంచాయతీకి కనీసం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం కూడా లేదు. దీనికోసం ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నారు. తమకు పీహెచ్‌సీ ఏర్పాటుచేస్తే కొండపై చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ మేలు జరుగుతుందని అధికారులకు ప్రాధేయపడుతూనే ఉన్నారు. రోడ్డు వేయాలనీ ఎన్నోసార్లు దరఖాస్తులు చేసుకున్నారు. ఇవన్నీ జరిగిఉంటే తమ పాప బతికేదని తల్లి ప్రియ అంటున్నారు. ‘నా బిడ్డ దక్కలేదు. కానీ ఇంకో బిడ్డ ప్రాణం పోనివ్వను. మా ఊరికి రోడ్డు, పీహెచ్‌సీ వచ్చేలా నావంతుగా పోరాడతాను. ఏ తల్లీతండ్రీ మాలాగా బాధపడకూడదు’ అని అంటున్నారామె.


గ్రామానికి వెళ్లే దారి అంబులెన్స్‌ వెళ్లలేకపోయింది

గ్రామానికి వెళ్లే మార్గంలో కాళ్లు దిగబడేలా మట్టి ఉన్నా..మృతదేహాన్ని నడుస్తూనే ముందుకెళ్తున్న దృశ్యం

పాప మృతదేహానికి శనివారం పోస్టుమార్టం పూర్తిచేశారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఓ అంబులెన్స్‌ను కూడా ఏర్పాటుచేశారు. విషాదహృదయాలతో వారు మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో ఎక్కించుకుని వెళ్లారు. ప్రధానమార్గం నుంచి గ్రామంవైపుగా ఆంబులెన్స్‌ బయలుదేరింది. దారి సరిగాలేకపోయినా.. తప్పనిసరి పరిస్థితుల్లో కొంత దూరం వెళ్లింది. గ్రామం చేరాలంటే ఇంకో 6కి.మీ. కానీ అంబులెన్స్‌ ముందుకు కదల్లేకపోయింది. ఇలాగైతే కాదని ఆ కుటుంబం పాప మృతదేహాన్ని తీసుకుని నడక మొదలుపెట్టారు. పాప తమకు దక్కలేదని వెక్కివెక్కి ఏడుస్తూనే ముందుకెళ్లారు. బిడ్డ మృతదేహాన్ని తీసుకుని తల్లి చాలాదూరం ప్రయాణించింది. ‘మా ఊరి రోడ్డుగనుక బాగున్నట్లయితే నా బిడ్డ ప్రాణాలు దక్కేవి, మాతో పాటు సంతోషంగా ఇంటికొచ్చేది. కానీ శవమై వస్తుందని మేం అనుకోలేదు. తీవ్ర వేదనే మిగిలింది’ అంటూ గ్రామం చేరిన తర్వాత తల్లి ప్రియ బోరుమంది. వారికి జరిగిందంతా తెలుసుకుని గ్రామస్తులు సైతం కదిలొచ్చారు. ఆడుకుంటూ నవ్వుతూ కనిపించే ఆ పాపాయి విగతజీవై రావడం జీర్ణించుకోలేకపోయారు.


కాలినడకన కలెక్టర్‌

ద్విచక్రవాహనం వెళ్లే పరిస్థితి లేక నడుస్తూ వెళ్తున్న కలెక్టర్‌

వేలూర్‌ జిల్లా కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌ ఈ ఘటనకు తీవ్రంగా స్పందించారు. తమ యంత్రాంగం పొరపాటు వల్లే పాప ప్రాణాలు దక్కలేదని ఒప్పుకొన్నారు. కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. యంత్రాంగంతో కలిసి సోమవారం ఆ గ్రామానికి వెళ్లారు. తన వాహనం వెళ్లలేకపోవడంతో కాసేపు ద్విచక్రవాహనం మీద.. ఆ తర్వాత కాలినడకన వెళ్లారు. పాప కుటుంబీకుల్ని పరామర్శించారు. వారికి ఉపశమనంగా రూ.25వేలు ఇస్తున్నట్లు మీడియాకి ప్రకటించారు. 2021 నుంచి కొండపైన గిరిజన గ్రామాలకు రోడ్లు వేస్తున్నామని ఆయన తెలిపారు. కానీ అల్లేరి పంచాయతీ, చుట్టుపక్కల గ్రామాలకు రోడ్డు వేయడానికి అటవీశాఖ నుంచి ఇంకా అనుమతులు రాలేదని వివరించారు. ఈ ప్రక్రియ త్వరగా జరిగేలా చూస్తామన్నారు. ఈ ఘటన దురదృష్టకరమని తెలుపుతూ మరో విషయాన్ని కూడా వెల్లడించారు. అత్యవసర ఆరోగ్య సహాయం కోసం అన్నీ గ్రామాల్లోనూ తాము ఆశావర్కర్లని అందుబాటులో ఉంచామని వెల్లడించారు. వీరి ఫోన్‌నెంబరు ప్రతీ కుటుంబం దగ్గరా ఉండేలా జాగ్రత్త తీసుకున్నామన్నారు. ఏ ఆపద వచ్చినా ముందు వీరిని సంప్రదించాలని, వారే చక్కటి ఉపాయం చెబుతారని వివరించారాయన. ఇలా చేయకుండానే పాప తల్లిదండ్రులు ఊరుదాటారని, ఒకవేళ చెప్పిఉంటే ప్రాథమికంగా ఏదైనా చేసేవారని గుర్తుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని