logo

ఓమ్రాన్‌ భాగస్వామ్యం కీలకం

రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధిలో ఓమ్రాన్‌ సంస్థ భాగస్వామ్యం కీలకం కానుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు.

Updated : 31 May 2023 04:28 IST

‌ఒప్పంద పత్రాలు మార్చుకున్న దృశ్యం ‌

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్ర వైద్య మౌలిక వసతుల అభివృద్ధిలో ఓమ్రాన్‌ సంస్థ భాగస్వామ్యం కీలకం కానుందని ముఖ్యమంత్రి స్టాలిన్‌ తెలిపారు. జపాన్‌ పర్యటనలో ఉన్న స్టాలిన్‌ సమక్షంలో ఆ దేశ దిగ్గజ సంస్థయైన ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ తమిళనాడులో రూ.128 కోట్ల పెట్టుబడులకు మంగళవారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా స్టాలిన్‌ మాట్లాడుతూ... తమిళనాడులో పరిశ్రమలు నెలకొల్పడానికి అనువైన పరిస్థితులపై నమ్మకానికి ఓమ్రాన్‌ సంస్థ పెట్టుబడి నిదర్శనమని తెలిపారు. ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, నాణ్యమైన వైద్య సేవలను సులభంగా అందిస్తోందని తెలిపారు. వైద్య సంబంధిత ఉత్పత్తి పరిశ్రమను ప్రారంభించడం ద్వారా తమిళనాడు వైద్య మౌలిక వసతుల అభివృద్ధిలో ఓమ్రాన్‌ సంస్థ భాగస్వామ్యం కీలకం కానుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో మంత్రి టీఆర్బీ రాజా, పరిశ్రమలు, వాణిజ్యశాఖ అదనపు ప్రధానకార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌, ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ సంస్థ ప్రెసిడెంట్‌, సీఈవో అయుము ఒకడ, ఎగ్జిక్యూటివ్‌ అధికారి కజుకో కురియామ, ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ తయారీ సంస్థ (వియత్నాం) ప్రెసిడెంట్‌, సీఈవో టాకుటో ఇవానక తదితరులు పాల్గొన్నారు.

కృత్రిమ మేధపై దృష్టి

ఏఐ గురించి వివరాలు తెలుసుకుంటున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో కృత్రిమ మేధ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చే విషయమై జపాన్‌లోని ఎన్‌ఈపీ ఫ్యూచర్‌ క్రియేషన్‌ హబ్‌ యంత్రాంగంతో ముఖ్యమంత్రి స్టాలిన్‌ చర్చించారు. జపాన్‌ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి మంగళవారం టోక్యో నగరంలోని ప్రపంచ అత్యాధునిక సాంకేతిక, ఎలక్ట్రానిక్‌ సంస్థయైన ఎన్‌ఈపీ ఫ్యూచర్‌ క్రియేషన్‌ హబ్‌ను సందర్శించారు. విమానాశ్రయాల్లో ఎలక్ట్రానిక్‌ కస్టమ్స్‌ డిక్లరేషన్‌ ద్వారా ముఖ గుర్తింపు సాంకేతికత, త్వరిత కస్టమ్స్‌ క్లియరెన్స్‌, వేచి ఉండు సమయాన్ని తగ్గించడం వంటి విధానాలు గురించి హబ్‌ అధికారులు వివరించారు. ఈ విధానం రద్దీ విమానాశ్రయాలైన అట్లాంటా వంటి పలు దేశాల్లోని విమానాశ్రయాల్లో అమల్లో ఉందని తెలిపారు. హార్బర్‌ పర్యవేక్షణ, పరిశ్రమల నిర్వహణ, రైలు రవాణా నిర్వహణ, రోడ్డు రవాణా నిర్వహణ, అగ్నిమాపక సంస్థలు, సమాచార సంబంధాల సంస్థలు, ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, బ్యాంకు ఏటీయంలు, డిజిటల్‌ టెలివిజన్‌ పరివర్తన, జల నిర్వహణ, ఉపగ్రహాల సమాచార సంబంధాలు వంటి అన్ని రంగాల్లోనూ ఆధునిక సాంకేతికతను ఉపయోగించి పరిష్కారాలు కొనుగొంటున్నట్టు వివరించారు. వీటిని విన్న తర్వాత రాష్ట్రంలో ముఖ గుర్తింపు కృత్రిమ మేథ సాంకేతికత, క్వాంటం కంప్యూటింగ్‌ ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ప్రజా వినియోగ వసతుల్లోనూ కృత్రిమ మేథ సాంకేతికను ఉపయోగించడం గురించి హబ్‌ యంత్రాంగంతో ముఖ్యమంత్రి చర్చించారు. వెంట మంత్రి టీఆర్బీ రాజా, పరిశ్రమలు, వాణిజ్యశాఖ అదనపు ప్రధానకార్యదర్శి ఎస్‌.కృష్ణన్‌, తమిళనాడు గైడెన్స్‌ ఎండీ విష్ణు, ఎన్‌ఈపీ ఫ్యూచర్‌ క్రియేషన్‌ హబ్‌ ఉన్నతాధికారులు ఉన్నారు.  

సీఎస్కేకు అభినందనలు

చెన్నై, న్యూస్‌టుడే: ఐపీఎల్‌ ట్రోఫీ కైవసం చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ అభినందనలు తెలిపారు. ఆయన తన ట్వీట్‌లో.. పరిస్థితులకు తగిన అంచనాలతో ధోని సారథ్యంలోని జట్టు అయిదోసారి ఐపీఎల్‌ ట్రోఫీని పొందడం అభినందనీయం అన్నారు. ఇది అత్యుత్తమ క్రికెట్‌ పోటీ అన్నారు. ఇందులో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న జడేజా జట్టుకు మంచి విజయాన్ని అందించారని తెలిపారు.


ఏనుగును అడవిలోకి పంపేందుకు చర్యలు

చెన్నై, న్యూస్‌టుడే: అరికొంబన్‌ ఏనుగును అడవిలోకి పంపేందుకు అన్నివిధాల చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడించారు. ఆయన విడుదల చేసిన ప్రకటనలో... తేని జిల్లా కంబంలో అరికొంబన్‌ అడవి ఏనుగు కారణంగా ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మోటారిస్టు పాల్‌రాజ్‌ మంగళవారం మరణించారన్న వార్త ఆవేదన కలిగించిందని తెలిపారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. మృతుడి కుటుంబానికి రూ.5లక్షలను సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి అందించాలని ఆదేశించారు. అరికొంబన్‌ ఏనుగును పట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ అటవీశాఖ అన్ని చర్యలను చేపట్టిందని తెలిపారు. తిరువిల్లిపుత్తూర్‌ మేఘమలై పులుల రిజర్వు క్షేత్ర సంచాలకులు అధ్యక్షతన అనుభవజ్ఞులైన అటవీశాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. పశువైద్యులతో కూడిన బృందం, ముదుమలై, ఆనైమలై టైగర్‌ రిజర్వు, స్థానిక అటవీశాఖకు చెందిన 16 మంది ఏనుగు బాట పర్యవేక్షక గార్డులు అరికొంబన్‌ ఏనుగు కదలికలను, ఆ ఏనుగు బాటపై నిఘా ఉంచారని తెలిపారు. అరికొంబన్‌ కనిపిస్తే అడవిలోకి పంపనున్నారని పేర్కొన్నారు. దీని కోసం కంబం అటవీ రేంజ్‌ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారన్నారు. ఇతర ప్రాంతాలకు చెందిన 200 మంది అటవీశాఖ అధికారులు స్థానిక ప్రజల భద్రతా విధుల్లో పాల్గొన్నారని తెలిపారు. తేని కలెక్టరు అక్కడి పరిస్థితులను నిశితంగా గమనిస్తూ అవసరమైన చర్యలను చేపడుతున్నారని వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని