logo

డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ ప్రారంభం

ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్సు కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ప్రారంభమైన కౌన్సెలింగ్‌ జూన్‌ 20వ తేదీ వరకు జరగనుంది.

Published : 31 May 2023 00:45 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్సు కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం ప్రారంభమైన కౌన్సెలింగ్‌ జూన్‌ 20వ తేదీ వరకు జరగనుంది. రాష్ట్రంలో ఉన్న 164 కళాశాలల్లో యూజీ కోర్సుల్లో 1.7 లక్షల సీట్లు ఉన్నాయి. వాటిల్లో చేరేందుకు 2,44,104 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. సోమవారం నుంచి బుధవారం వరకు దివ్యాంగులకు, ప్రత్యేక రిజర్వేషన్‌, జనరల్‌ కేటగిరీలవారికి మొదటి విడత కౌన్సెలింగ్‌ జూన్‌ 1 నుంచి 10వ తేదీ వరకు, రెండో విడత కౌన్సెలింగ్‌ జూన్‌ 12 నుంచి 20వ తేదీ వరకు జరగనుంది. ర్యాకింగ్‌ జాబితాలో స్థానం పొందిన విద్యార్థుల సెల్‌ఫోన్‌ నెంబరు, ఈ-మెయిల్‌కి ఎస్‌ఎమ్‌ఎస్‌ ద్వారా కౌన్సెలింగ్‌ రోజు, సమయం తదితర వివరాలను అందుతాయి. ప్లస్‌టూ మార్కులు, రిజర్వేషన్‌ విధానంలో విద్యార్థులకు కోర్సులను కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు ‌www.tngasa.in - వెబ్‌సైట్‌ చూడవచ్చు. సందేహాలు నివృత్తి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్న కళాశాలలను సంప్రదించవచ్చని కళాశాల విద్యా డైరెక్టరేట్‌ తెలిపింది.

నాలుగు రోజులపాటు వర్షాలకు అవకాశం

ప్యారిస్‌: రాష్ట్రంలో నాలుగు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో ఒకటి రెండుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని, నీలగిరి, కోయంబత్తూరు, తిరుప్పూర్‌, తేని, దిండుక్కల్‌, కృష్ణగిరి, తిరుప్పత్తూర్‌, ధర్మపురి, సేలం, ఈరోడు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 1, 2 3 తేదీల్లో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్‌లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, చెన్నైలో రానున్న 48 గంటల్లో ఆకాశం మేఘావృతమై ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పింది. జూన్‌ 2, 3 తేదీల్లో గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌, పక్కనే ఉన్న దక్షిణ తమిళనాడు సముద్రతీర ప్రాంతాలు, శ్రీలంక సముద్ర తీరం, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో గంటకు 40 నుంచి 45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, కావున జాలర్లు ఆ ప్రాంతాలకు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

భారత్‌లో పెట్టుబడి పెట్టనున్న ఓమ్రాన్‌

చెన్నై: జపాన్‌ దిగ్గజ సంస్థ ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ భారత్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తమిళనాడులో రూ.128 కోట్ల వ్యయంతో వైద్య ఉపకరణాల తయారీ పరిశ్రమను ప్రారంభించడానికి ఒప్పందం కుదుర్చుకుంది. 2024 జనవరిలో చెన్నైలో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు జపాన్‌కు అధికారిక పర్యటనకు వెళ్లిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సమక్షంలో మంగళవారం ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని