logo

నడకలో నలుగుతున్న ప్రాణం

దేశంలో ఏటా జరిగే ప్రమాదాల్లో బాధిత ఐదుగురిలో ఒకరు చనిపోతున్నారు. వారిలో 10 శాతం మంది పాదచారులే ఉండటం తీవ్రమైన అంశం. సగటున రోజుకు 31 మంది పిల్లలు ఇలా మృత్యువాత పడుతున్నారు.

Updated : 01 Jun 2023 03:32 IST

చెన్నైలో 35 శాతం మంది
పాదచారుల మృతి


పాదచారుల ప్రమాద తీవ్రతను తెలుపుతూ రూపొందించిన చెన్నై నగర మ్యాప్‌

రోడ్డు ప్రమాదాలు దేశంలోనే చెన్నైలో ఎక్కువ చోటుచేసుకుంటున్నాయి. ఆ ప్రమాదాల్లో సంభవించే మరణాల్లో దిల్లీ తర్వాత రెండో స్థానంలో నగరం ఉంది. మరీ బాధాకర విషయం ఏంటంటే.. గతేడాది ఇలా మరణించినవారిలో 35శాతం మంది పాదచారులే ఉన్నారు. అసలు వీరు ఎందుకు చనిపోతున్నారు, ఏ ప్రాంతాలు ప్రమాదకరంగా ఉన్నాయి, అందుకు ఏం చేయాలనే కోణంలో నగరంలో కీలక పరిశోధన జరిగింది. అందులో చాలా విషయాలు బయటపడ్డాయి.

- ఈనాడు, చెన్నై


పాదచారుల మార్కింగ్‌పైకి వచ్చిన వాహనాలు

దేశంలో ఏటా జరిగే ప్రమాదాల్లో బాధిత ఐదుగురిలో ఒకరు చనిపోతున్నారు. వారిలో 10 శాతం మంది పాదచారులే ఉండటం తీవ్రమైన అంశం. సగటున రోజుకు 31 మంది పిల్లలు ఇలా మృత్యువాత పడుతున్నారు. దీన్నిబట్టి పాదచారుల  జీవితాలకు భద్రత లేదనేది స్పష్టమవుతోంది. అసలు చెన్నైలో ఈ పరిస్థితి ఎలా ఉందో చూడాలని నగరానికి చెందిన ప్రముఖ అర్బన్‌ ప్లానర్‌ కార్తికేయన్‌ భాస్కర్‌ ఓ పరిశోధన చేశారు. ప్రభుత్వ గణాంకాలతోపాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో విశ్లేషించారు. పరిశోధనలో వెల్లడైన అంశాల్ని కేంద్ర ప్రభుత్వంతోనూ పంచుకున్నారు.

ఎలా చనిపోతున్నారు?

నగరంలో చోటుచేసుకున్న మొత్తం రోడ్డు ప్రమాదాల్లో పాదచారుల మరణాలు చూస్తే.. 2017లో 34శాతం, 2018 - 33, 2019 - 34, 2020 - 25, 2021 - 28, 2022 - 35శాతంగా ఉంది. ఇందులో వేటి ద్వారా ప్రమాదాలకు గురవుతున్నారనేది చూస్తే.. పాదచారుల మరణాలకు ప్రధాన కారణం ద్విచక్రవాహనాలే అని తేలింది. ఆ తర్వాతి స్థానంలో గుర్తుతెలియని వాహనాలున్నాయి. అంటే.. ప్రమాదాలు చేసేసి యజమానులు పారిపోతున్నారు. వీటి తర్వాత బస్సులు, కార్లు, ఆటోలు ఈ తరహా ప్రమాదాలకు కారణాలుగా ఉన్నాయి.

అక్కడే ఎక్కువ


నడక దారుల్లో పార్కింగ్‌

2017-21 వరకు అందిన వివరాల ప్రకారం లోతుగా పరిశోధన చేశారు కార్తికేయన్‌. దీని ప్రకారం.. ద్విచక్రవాహనాలు, కార్ల ద్వారా అత్యధిక ప్రమాదాలు కోయంబేడు, ఐటీ కారిడార్‌ మార్గాల్లో చోటుచేసుకుంటున్నాయి. అంటే.. ఈ ప్రాంతాల్లో ఎక్కువమంది పాదచారులు ప్రాణాలు వదిలారు. మరోవైపు బస్సుల ద్వారా ప్రమాదాలు ఎక్కువగా కోయంబేడు, ఓల్డ్‌టౌన్‌ బజార్‌ ప్రాంతంలో జరుగుతున్నాయి. ఆటో ప్రమాదాలు అత్యధికంగా ఓల్డ్‌టౌన్‌ బజార్‌ ప్రాంతంలోనే ఉన్నాయి. మొత్తంగా నగరంలో అత్యధిక పాదచారులు కోయంబేడు, ఐటీకారిడార్‌, ఓల్డ్‌టౌన్‌ బజార్‌లల్లో చనిపోతున్నారు. మిగిలిన ప్రాంతాల్లోనూ మరణాలున్నా.. తీవ్రత తక్కువగా ఉంది.

ఉదయం.. రాత్రి..

పాదచారుల మరణాల్లో వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. వీరి ప్రమాద సమయాల్ని గమనిస్తే.. ఉదయం 8గంటలనుంచి 11మధ్య, సాయంత్రం 6గంటలనుంచి రాత్రి 11మధ్య ఎక్కువగా ఉంది. ఈ సమయాల్లో జరిగిన ప్రమాదాలతోనే మరణాలు ఎక్కువయ్యాయి. ప్రత్యేకించి వారాంతాల్లో ఈ తీవ్రత ఇంకాస్త ఎక్కువగా ఉంది. వారాంతాల్లో చాలామంది పుదుచ్చేరి వైపుంనుంచి వచ్చేటప్పుడు ఐటీ కారిడార్లలో ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నట్లు పరిశోధకుడు వెల్లడించారు. కోయంబేడులో ఉదయం 6 నుంచి సాయంత్రం 5గంటలమధ్య ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఐటీ కారిడార్‌ మార్గంలో ఉదయం 9 నుంచి తెల్లవారుజామున 6గంటల మధ్య ఎక్కువగా ఉన్నాయి.

వేగంతోనే అంతా..


ఆక్రమణలను తొలగిస్తున్న గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ సిబ్బంది

అసలు పాదచారులు చనిపోయే ప్రమాదాల్లో.. ఎక్కువ మరణాలకు అసలు కారణం ఏంటనేది లోతుగా పరిశీలించారు. మితిమీరిన వేగం ప్రధాన కారణంగా తేలింది. ఆ తర్వాతి స్థానంలో జాగ్రత్తవహించకుండా వాహనాన్ని నడపుతున్నట్లు వెల్లడైంది. వీటి తర్వాత వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయడంలో, మలుపుల్లో అజాగ్రత్త వహించడంలో, వాహనాల్ని అజాగ్రత్త వెనక్కి నడపడంలో లోపాల వల్ల ప్రమాదాలు జరిగాయని చెబుతున్నారు. పాదచారులే అజాగ్రత్త వహించి చనిపోయినవారు 5ఏళ్లలో 84మంది ఉన్నారు. ఓవర్‌స్పీడ్‌తో వెళ్లే వాహనాలతో ఎక్కువ ప్రమాదాలు ఓల్ట్‌టౌన్‌ బజార్‌లో ఉన్నాయని చెబుతున్నారు.

పిల్లలు, వృద్ధులే ఎక్కువ

పరిశీలన జరిపిన 5ఏళ్లలో పాదచారుల మరణాలు వయసులవారీగా చూస్తే.. 18ఏళ్లలోపువారు 320మంది, 19-39ఏళ్ల యువత 286మంది, 40-59ఏళ్ల మధ్యవారు 676, 60ఏళ్లకు పైబడిన వృద్ధులు 793మంది ఉన్నట్లు పరిశీలనలో తేలింది. ప్రమాదాల్లో ఎక్కువగా వృద్ధులు, చిన్నపిల్లవారు మృత్యువాతపడుతున్నట్లు వివరిస్తున్నారు. మరోవైపు తీవ్ర గాయాలపాలైనవారి జాబితాలోనూ వృద్ధులు అధికంగా ఉన్నారు. కాబట్టి బయటికెళ్లేటప్పుడు పిల్లలు, వృద్ధుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలనేది ఈ పరిశీలనలో బయటపడింది. ప్రమాదాలబారినుంచి యువత ఎక్కువమంది గాయాలతో బయటపడుతున్నట్లు వెల్లడించారు.

డిజైన్‌ మార్చాలి

పాదచారులకు అనువుగా నగరాన్ని మార్చాల్సిన అవసరం చాలా ఉందని కార్తికేయన్‌ సూచిస్తున్నారు. రోడ్ల డిజైనింగ్‌లో మార్పులు తేవాలన్నారు. సిగ్నల్‌ సమయం పాదచారులు దాటేందుకు సరిపోవడం లేదని చెబుతున్నారు. దారుల్లో విశాలమైన పాదబాటలు, కూడళ్లలో క్రాస్‌వాకింగ్‌ విధానం, పాదబాటల్లో విరివిగా చెట్లనీడ ఉండేలా చూడాలన్నారు. అనువైన సూచీలు ఉండాలని వెల్లడిస్తున్నారు. ప్రమాదాలపై ప్రత్యేక డాష్‌బోర్డును ఏర్పాటు చేసుకుని రోజువారీ సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని