logo

కార్మికుల పీఎఫ్‌ డబ్బుతో రవాణాశాఖ నిర్వహణ

కార్మికుల పీఎఫ్‌ డబ్బుతో రవాణాశాఖను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నా కార్మిక సంఘం మహాసభ రాష్ట్ర కార్యదర్శి కమలకన్నన్‌ ఆరోపించారు.

Published : 01 Jun 2023 00:20 IST

కమలకన్నన్‌ ఆరోపణ

చెన్నై, న్యూస్‌టుడే: కార్మికుల పీఎఫ్‌ డబ్బుతో రవాణాశాఖను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని అన్నా కార్మిక సంఘం మహాసభ రాష్ట్ర కార్యదర్శి కమలకన్నన్‌ ఆరోపించారు. సచివాలయంలో రవాణాశాఖ కార్యదర్శి ఫణీంద్రరెడ్డిని బుధవారం కలిసి ఆయన వినతిపత్రం అందించారు. తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ... ప్రభుత్వంలో పలు విధాలుగా డ్రైవర్లు, కండక్టర్లు ఇబ్బందికి గురవుతున్నారని తెలిపారు. ఈ ఏడాది విశ్రాంత ఉద్యోగులకు పీఎఫ్‌ వంటి ఎలాంటి నగదు ప్రయోజనాలు అందలేదని పేర్కొన్నారు. ఈ విషయాలు, బీమా గురించి రవాణాశాఖ కార్యదర్శికి వినతిపత్రం అందించినట్టు తెలిపారు. పీఎఫ్‌ కింద కార్మికుల నుంచి మినహాయించిన రూ.19 కోట్లను మెట్రో ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ చెల్లించలేదని, దీంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. వారి డబ్బుతో రవాణాశాఖను రాష్ట్ర ప్రభుత్వం నడుపుతోందని ధ్వజమెత్తారు. డీఎంకే కార్మిక సంఘాలు ముందస్తు ప్రకటన లేకుండా సమ్మెకు పాల్పడటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. దీనిని తమ కార్మిక సంఘం తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. కొందరు మార్గమధ్యలోనే బస్సులను నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారని, దీంతో మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని తెలిపారు. కార్మిక సంఘాలతో రవాణాశాఖ మంత్రి చర్చలకు ప్రధాన పత్రిపక్షమైన అన్నా కార్మిక సంఘాన్ని ఆహ్వానించలేదని, ఈ విషయాన్ని రవాణాశాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని