రూ.3,233 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు
సింగపూర్, జపాన్ దేశాల పర్యటనతో రూ.3,233 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు.
మరికొన్ని సంస్థల కోసం ప్రయత్నాలు: సీఎ
విలేకర్లతో మాట్లాడుతున్న స్టాలిన్
చెన్నై, న్యూస్‌టుడే: సింగపూర్, జపాన్ దేశాల పర్యటనతో రూ.3,233 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరినట్టు ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అమితాసక్తిగా ఉన్న మరికొన్ని సంస్థల కోసం వరుస ప్రయత్నాలు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. సింగపూర్, జపాన్ దేశాల్లో అధికారిక పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి స్టాలిన్ బుధవారం రాత్రి చెన్నై చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ... సింగపూర్, జపాన్ దేశాల్లో 9 రోజుల అధికారిక పర్యటన విజయవంతంగా ముగిసిందన్నారు. జపాన్, తమిళనాడు మధ్య గతంలో ఉన్న ఆర్థిక, పారిశ్రామిక పరమైన సత్సంబంధాలను మరింత పెంపొందించేలా ఈ పర్యటన నెలకొందని తెలిపారు. ఆసియాలో అతిపెద్ద ఉత్పత్తి వాణిజ్య కేంద్రంగా తమిళనాడు ఆవిర్భవించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కనిష్ఠంగా రూ.3వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించే దిశగా గతంలో మంత్రి తంగం తెన్నరసు జపాన్ వెళ్లి చర్చలు జరిపారని తెలిపారు. దాని ఫలితంగా ప్రస్తుతం రూ.3,233 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొన్నారు. వాటిలో మిత్సుబిషి సంస్థ రూ.1,891 కోట్లు, హై-పి సంస్థ రూ.312 కోట్లు, టైసెల్ సంస్థ రూ.83 కోట్లు, క్యోకుటో సంస్థ రూ.113.9 కోట్లు, మిత్సుబా ఇండియా రూ.155 కోట్లు, పాలీహోస్ టోఫ్లే రూ.150 కోట్లు, పాలిహోస్ కొహ్‌యేయి రూ.200 కోట్లు, పాలిహోస్ సటో షోజి రూ.200 కోట్లు, ఓమ్రాన్ హెల్త్‌కేర్ రూ.128 కోట్ల ఒప్పందాలు ఉన్నాయని తెలిపారు. వాటి ద్వారా 5వేల మందికిపైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు కలగనున్నాయని పేర్కొన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి, వృత్తివిద్య అభివృద్ధికి, ఉన్నత విద్య నైపుణ్య శిక్షణకూ అవసరమైన అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. పలు రంగాలకు చెందిన దిగ్గజ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు, రాష్ట్ర తర్వాతి దశ పరిశ్రమల అభివృద్ధి, పురోభివృద్ధికి ఈ పరిశ్రమలు ప్రేరణ కానున్నాయని దృఢంగా నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. సింగపూర్, జపాన్‌కు చెందిన పలు పరిశ్రమలు తమిళనాడులో పెట్టుబడులు పెట్టేందుకు అమితాసక్తిగా ఉన్నాయని తెలిపారు. ఆ సంస్థలు నుంచి పెట్టుబడులు రాబట్టేందుకు వరుస ప్రయత్నాలు చేపట్టాలని పరిశ్రమలశాఖ మంత్రి, అధికారులకు సూచించినట్టు పేర్కొన్నారు. వచ్చే జనవరి 10, 11వ తేదిల్లో చెన్నైలో జరగనున్న ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు పరిశ్రమల రంగాల అధినేతలను ఆహ్వానించానని, వారూ దానికి సుముఖత వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
రాష్ట్రంపైనా దర్యాప్తు సంస్థల ప్రయోగం
పాత్రికేయుల ప్రశ్నలకు ముఖ్యమంత్రి స్పందించారు. ప్రతిపక్షనేత ఎడప్పాడి పళనిస్వామి తన విదేశీ పర్యటనను విమర్శించడానికి ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు ఇప్పటికే సమాధానం ఇచ్చారని తెలిపారు. మేకెదాటులో ఆనకట్ట నిర్మించనున్నట్టు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై జలవనరులశాఖ మంత్రి స్పందించారని, ఆ విషయంలో తాము దృఢంగా ఉన్నామని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో చోళుల కాలంనాటి రాజదండాన్ని ప్రతిష్ఠిస్తే అది రాష్ట్రానికి గర్వకారణంగా ఉండేదన్నారు. భాజపా తన రాజకీయ ప్రత్యర్థులను కక్షసాధించడానికి ఐటీ, సీబీఐ, ఈడీలను ఉపయోగిస్తుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంపై కూడా వాటిని ప్రయోగిస్తున్నారని, దాని గురించి ప్రత్యేకించి చెప్పడానికి ఏమీ లేదంటూ ఇటీవల జరిగిన సోదాలపై స్పందించారు. ప్రతిపక్షాలు తరఫున జూన్ 12న బిహార్‌లో జరిగే సమావేశంలో డీఎంకే పూర్తిస్థాయిలో పాల్గొంటుందని తెలిపారు. అదే రోజు ఏఐసీసీ అధ్యక్షుడు పాల్గొనేందుకు అవకాశంలేదని, తేదీని మార్చాలని సూచించారని, తానూ మేట్టూర్ జలాశయం నుంచి నీటిని విడుదల చేసేందుకు తేదీ ఇచ్చినట్టు పేర్కొన్నారు. అయినా కచ్చితంగా సమావేశం జరుగుతుందని, అందులో డీఎంకే పాల్గొంటుందని తెలిపారు.
*మృతుల కుటుంబాలకు సాయం
చెన్నై, న్యూస్‌టుడే: సేలం జిల్లా ఎస్.కొల్లపట్టిలోని బాణసంచా గిడ్డంగిలో ఏర్పడిన ప్రమాదంపై ముఖ్యమంత్రి స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం, క్షతగాత్రులకు సానుభూతి తెలిపారు. మృతులు నటేశన్, సతీశ్‌కుమార్ సహా ముగ్గురి కుటుంబాలకు రూ.3లక్షలు చొప్పున, క్షతగాత్రులు ఆరుగురికి రూ.50వేలు చొప్పున ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ నుంచి అందించాలని ఆదేశించారు.
*ట్విట్టర్ ఖాతాల స్తంభన తగదు
చెన్నై, న్యూస్‌టుడే: నామ్ తమిళర్ కట్చి చీఫ్ కన్వీనర్ సీమాన్, మే 17 మూవ్‌మెంట్ కన్వీనర్ తిరుమురుగన్ గాంధీ ట్విట్టర్ ఖాతాలను భారతదేశంలో స్తంభింప చేయడం ఖండించదగిందని ముఖ్యమంత్రి స్టాలిన్ తెలిపారు. భావాలను భావాలతో వ్యతిరేకించడమే ధర్మమని, గొంతు కోయడం కాదని పేర్కొన్నారు. ట్విట్టర్ స్తంభనను తొలగించి సామాజిక మాధ్యమాన్ని దాని ప్రమాణాలతో కొనసాగించడానికి అనుమతించాలని ట్విట్టర్ వేదికగా కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.