logo

కళాశాల మారే విద్యార్థులకు ఉపశమనం

ఒక కళాశాల నుంచి మరో కళాశాలకు మారాలనుకునే విద్యార్థులకు వారు కట్టిన ఫీజు,  బదిలీ ధ్రువపత్రం ఒకేసారి ఇవ్వాలని కళాశాలలకు తెలపాల్సిందిగా వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది.

Published : 02 Jun 2023 01:04 IST

వడపళని, ప్యారిస్‌, న్యూస్‌టుడే: ఒక కళాశాల నుంచి మరో కళాశాలకు మారాలనుకునే విద్యార్థులకు వారు కట్టిన ఫీజు,  బదిలీ ధ్రువపత్రం ఒకేసారి ఇవ్వాలని కళాశాలలకు తెలపాల్సిందిగా వర్సిటీలకు ఉన్నత విద్యాశాఖ ఆదేశించింది. బుధవారం వర్సిటీ ఉపకులపతులతో ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి సమావేశమయ్యారు. మరో కళాశాలలో చేరాలనుకునే వారికి ప్రయివేటు కళాశాలలు వారు కట్టిన ఫీజు, టీసీలు ఇవ్వడం లేదని, అన్ని ప్రయివేటు, ప్రభుత్వ కళాశాలు కట్టిన ఫీజు, టీసీ ఇవ్వాలని మంత్రి చెప్పారు. ఇందుకు సంబంధించి వర్సిటీలు సర్క్యులర్‌లు కూడా జారీ చేయాలని పేర్కొన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం గురించి వర్సిటీ ఉపకులపతులతో గవర్నరు సమావేశం కావడం గురించి మాట్లాడుతూ... ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఆయన వ్యవహరిస్తున్నారన్నారు. రాష్ట్ర విద్యా విధానం గురించి త్వరలోనే ప్రకటిస్తామని, విద్యా శాఖ కూడా దానికి అనుగుణంగానే నడుచుకోనుందని తెలిపారు. గవర్నరు నుంచి ఆహ్వానం అందిన తర్వాత సమావేశానికి హాజరు కావాలా? వద్దా? అనేది ఉపకులపతులే నిర్ణయించుకోవాలని పేర్కొన్నారు. యూజీ, పీజీ కోర్సుల సిలబస్‌లో మార్పులు, ఫీజు, ఇతర విషయాలు, ‘నాన్‌ ముదల్వన్‌ కోర్సు’ అమలుపై  చర్చించారు. అన్ని కళాశాలల్లో తమిళం, ఇంగ్లిషులో ఒకే రకమైన ప్రశ్నపత్రాలుండాలన్నారు. ఇతర సబ్జెక్టులకు కామన్‌గా  75 శాతం, స్థానికంగా ఉన్న అవసరాలకు అనుగుణంగా ఉన్న సబ్జెక్టు మీద 25 శాతంతో ప్రశ్నలుండాలని చెప్పారు. అందరికీ ఒకే విధమైన పరీక్ష టైం టేబుల్‌, ఒకే రోజు ఫలితాలు విడుదలవాలని సూచించారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కార్తికేయన్‌, సాంకేతిక విద్యాశాఖ కమిషనరు టీజీ వినయ్‌, పలు వర్సిటీలకు చెందిన ఉపకులపతులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని