logo

పరువు హత్యకేసులో 10మందికి శిక్షను సమర్థించిన హైకోర్టు

గోకుల్‌రాజ్‌ హత్య కేసులో యువరాజ్‌ తదితర పది మందికి విధించిన శిక్షను సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.

Published : 03 Jun 2023 00:43 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: గోకుల్‌రాజ్‌ హత్య కేసులో యువరాజ్‌ తదితర పది మందికి విధించిన శిక్షను సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. సేలం జిల్లా ఓమలూర్‌కి చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి గోకుల్‌రాజ్‌ దళిత వర్గానికి చెందిన వారు. నామక్కల్‌కి చెందిన మరో వర్గానికి చెందిన యువతిని ప్రేమించారు. ఇద్దరు తిరుచ్చెంగోడు ఆలయంలో 2015లో మాట్లాడుకున్నారు. ఆ తరువాత గోకుల్‌రాజ్‌ తిరిగి ఇంటికి రాలేదు. అనంతరం నామక్కల్‌ జిల్లా తూర్పు తొట్టిపాళెయం రైలు పట్టాల వద్ద శరీరం నుంచి తల వేరు చేసిన స్థితిలో మృతదేహం లభించింది. అతడు పరువు హత్యకు గురైనట్లు దర్యాప్తులో తెలిసింది. ఈ కేసులో అరెస్టు అయిన ధీరన్‌ చిన్నమలై గౌండర్‌ పేరవై వ్యవస్థాపకుడు యువరాజ్‌, అతని కారు డ్రైవరు అరుణ్‌లకు - 3, కుమార్‌, సతీష్‌కుమార్‌, రఘు, రంజిత్‌, సెల్వరాజ్‌లకు -2, ప్రభు, చంద్రశేఖర్‌, గిరిధర్‌లకు తలా ఒక జీవిత ఖైదు శిక్ష, మరొక ప్రభుకి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడంతోపాటు మరో ఐదుగురిని విడుదల చేస్తూ మదురై ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. తమ శిక్షను రద్దు చేయాలని మద్రాసు హైకోర్టులో నిందితులు అప్పీల్‌ చేశారు. ఐదుగురిని విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ గోకుల్‌రాజ్‌ తల్లి సీబీసీఐడీ తరఫున అప్పీల్‌ దాఖలు చేశారు. జస్టిస్‌ రమేష్‌, జస్టిస్‌ ఆనంద్‌ వెంకటేశ్‌ ధర్మాసనంలో వీటిపై విచారణ జరిగింది. ఈ కేసులో ముఖ్య సాక్షి అయిన స్వాతి విరుద్ధంగా సాక్ష్యం ఇవ్వడంతో న్యాయమూర్తులు సుమోటోగా విచారణ జరిపారు. గోకుల్‌రాజ్‌ చివరిగా ప్రాణాలతో కనిపించిన తిరుచ్చెంగోడు అర్ధనారీశ్వరర్‌ ఆలయం, అతడి మృతదేహం లభించిన రైలుపట్టాలు తదితర ప్రాంతాంల్లో న్యాయమూర్తులు  పరిశీలించారు. శుక్రవారం తీర్పు ఇచ్చారు. నిందితులపై ఆరోపణలు రుజువు అయ్యాయని న్యాయమూర్తులు తెలిపారు. ఈ కేసులో మదురై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి లోపం లేదని పేర్కొన్నారు. కోర్టు విధించిన శిక్షను సమర్థించారు.

 సాక్షులను కాపాడడం సవాలైంది: మోహన్‌

గోకుల్‌రాజ్‌ హత్య కేసును వాదించిన ప్రభుత్వ న్యాయవాది మోహన్‌ మాట్లాడుతూ...ఈ కేసులో సాక్షులకు రక్షణ కల్పించడం పెద్ద సవాలైందని, వారికి తగిన భద్రత కల్పించి ఉంటే స్వాతి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చి ఉండేది కాదన్నారు. దేశవ్యాప్తంగా పరువు హత్యలు జరుగుతున్నాయని, ఇలాంటి కేసులను విచారించేందుకు యువ న్యాయవాదులు ముందుకు రావాలన్నారు. సాక్షులు అబద్ధం చెప్పొచ్చు కానీ సాక్ష్యాలు చెప్పవన్నారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టులు మాత్రమే చనిపోయే వరకు జైల్లో ఉండాలని తీర్పు ఇచ్చాయని.. మొదటి సారిగా ఈ కేసులోనే విచారణ కోర్టు న్యాయమూర్తి సంపత్‌కుమార్‌ మాత్రం యువరాజ్‌కి చనిపోయే వరకు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం అని తెలిపారు.

అడ్డుకట్టకు ప్రత్యేక చట్టం : సీపీఎం

చెన్నై, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పరువు హత్యల అడ్డుకట్టకు ప్రత్యేక చట్టం రూపొందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్‌ డిమాండ్‌ చేశారు. కొన్నేళ్ల కిందట రాష్ట్రంలో సంచలనం సృష్టించిన గోకుల్‌రాజ్‌ హత్యకేసులోని నిందితులకు కింది కోర్టు విధించిన శిక్షను సవాల్‌ చేసిన పిటిషన్లను మద్రాసు హైకోర్టు తోసిపుచ్చిన ఆదేశాలను స్వాగతించారు. ఈ తీర్పు కులాహంకారులకు ఓ గుణపాఠంగా ఉంటోందని నమ్ముతున్నట్టు తెలిపారు. కులాంతర, ప్రేమ వివాహాలు చేసుకునేవారికి తగిన భద్రతలేని దృష్ట్యా తరచూ పరువు హత్యలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. నాగరిక సమాజంలో ఈ హత్యలు సమర్థనీయం కావన్నారు. ఈ హత్యల అడ్డుకట్టకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని డిమాండ్‌ చేశారు.

కృతజ్ఞతలు: మృతుడి తల్లి

ఏ పాపం తెలియని తన కుమారుడిని పైశాచికత్వంగా హింసించి తలను వేరు చేసి క్రూరంగా హత్య చేశారని గోకుల్‌రాజ్‌ తల్లి చిత్ర అన్నారు. భర్త మృతిచెందిన తరవాత ఇద్దరు కుమారులను ఆంగ్ల మాధ్యమంలో చదివించారని, పెద్ద అయిన తరువాత వారి ఎదుగుదలను చూసి సంతోషపడాలని అనుకున్నట్లు తెలిపారు. ఎప్పుడూ ప్రశాంతంగానే మాట్లాడే తన కుమారుడిని తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ ఘటనలో సంబంధం ఉన్నవారికి తప్పకుండా శిక్షపడుతుందన్నారు. దోషులకి శిక్ష విధించినందుకు న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని