logo

నిరాడంబరంగా కరుణ శతజయంతి

ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతిని శనివారం నిరాడంబరంగా నిర్వహించారు.

Published : 04 Jun 2023 01:27 IST

ఓమందూరర్‌ ప్రభుత్వ ఎస్టేట్‌లో కరుణానిధి చిత్రపటానికి నివాళులర్పిస్తున్న స్టాలిన్‌

చెన్నై, న్యూస్‌టుడే: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన నేపథ్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శతజయంతిని శనివారం నిరాడంబరంగా నిర్వహించారు. కరుణానిధి శతజయంతి సందర్భంగా మెరినా తీరంలోని అన్నాదురై, కరుణానిధి సమాధులకు ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం నివాళులర్పించారు. ఓమందూరర్‌ ప్రభుత్వ ఎస్టేట్‌లోని కరుణానిధి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆయన చిత్రపటానికి అంజలి ఘటించారు. ఒడిశా రైలు దుర్ఘటన మృతులకు సంతాపం తెలిపేలా శ్రద్ధాంజలి ఘటించారు. వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరైయన్బు, రాష్ట్ర మంత్రులు, డీఎంకే ఎంపీలు, గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ మేయర్‌ ప్రియ తదితరులు ఉన్నారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో, డీఎంకే అధికారిక దినపత్రిక ‘మురసొలి’ కార్యాలయం ప్రాంగణంలో, డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయం ప్రాంగణంలో, సీఐటీ నగర్‌లోని కనిమొళి నివాసంలో ఏర్పాటు చేసిన కరుణానిధి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. వెంట డీఎంకే ప్రధాన కార్యదర్శి దురైమురుగన్‌, కోశాధికారి టీఆర్‌ బాలు, ఉప ప్రధానకార్యదర్శులు కేఎన్‌ నెహ్రూ, కనిమొళి తదితరులు ఉన్నారు.
‘ఆధునిక రాష్ట్ర శిల్పి’.. ముఖ్యమంత్రి స్టాలిన్‌ శనివారం చేసిన ట్వీట్‌లో... హేతువాదం, ఆత్మ గౌరవం భావజాలాలను కాపాడే పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నాయకత్వం వహించిన నాయకుడు కరుణానిధి అన్నారు. అసంఖ్యాక సాంఘిక సంక్షేమ పథకాలతో నేటి ఆధునిక తమిళనాడును చెక్కిన శిల్పి అని కీర్తించారు. పార్టీ లక్ష్యాలను చేరుకోవడానికి ఆయన మార్గంలో నడుద్దామంటూ పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని