logo

ఎటుచూసినా రక్తమే

కోరమాండల్‌ రైలు ప్రమాదంలో చిక్కుకున్న పలువుర్ని అదే రైలులో ఉన్న తంజావూర్‌ జిల్లాకు చెందిన వెంకటేశ్‌ కాపాడారు.

Updated : 05 Jun 2023 05:10 IST

చీకట్లో ఏడుపులు, తెగిన భాగాలతో శరీరాలు
ప్రమాదాన్ని తలచుకుంటే భయమేస్తోందన్న రాష్ట్రవాసులు
ప్రత్యేక రైలులో క్షేమంగా చేరుకున్న వైనం

ఏదో కుదేపిసినట్లు.. దూరంగా విసిరి పడేసినట్లు.. ప్రయాణికులు గాల్లో ఒక బోగీ నుంచి మరో బోగీ మీద పడి రక్తసిక్తమయ్యారు. అంతా చీకటి.. ఎటుచూసినా ఏడుపులు. చుట్టుపక్కల, పక్క బోగీల్లో ఎవర్ని చూసినా గాయాలు. కొందరికైతే శరీరభాగాలు తెగిపోయాయి. ఇంకొందరు రక్తపు మడుగులో కనిపించారు. అత్యంత ఘోర ప్రమాదం. ఇదెలా జరిగిందో అక్కడి నుంచి బయటపడి వార్తాపత్రికలు, టీవీల్లో చూసేదాకా తెలీలేదు వారికి. విపరీత భయంతో, గాయాలతో పలువురు. ఆదివారం చెన్నై చేరుకున్నారు.

ఈనాడు-చెన్నై, న్యూస్‌టుడే-చెన్నై;-కోరమాండల్‌ రైలు ప్రమాదంలో చిక్కుకున్న పలువుర్ని అదే రైలులో ఉన్న తంజావూర్‌ జిల్లాకు చెందిన వెంకటేశ్‌ కాపాడారు. ఇళంగార్‌కుడికి చెందిన ఆయన భారత మాజీ సైనికుడు. ప్రస్తుతం పశ్చిమబంగాలో జాతీయ విపత్తు సహాయ బృందంలో పనిచేస్తున్నాడు. సెలవుల కోసం ఊరుకు వచ్చేందుకు ప్రమాదం జరిగిన కోరమాండల్‌ రైలులో ప్రయాణించారు. ప్రమాదం జరిగిన వెంటనే తన పైఅధికారులకు సమాచారం ఇచ్చారు. విపత్తు సహాయక చర్యల్లో శిక్షణ పొందడంతో సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సుమారు గంటపాటు సహాయక చర్యలు అందించి ప్రమాదం నుంచి పలువుర్ని కాపాడినట్టు ఆదివారం కుంభకోణం రైల్వేస్టేషన్‌ చేరుకున్న ఆయన విలేకర్లతో తెలిపారు

సైనికుల సాయం

క్షతగాత్రులను వీల్‌ఛైర్లలో తీసుకెళ్తున్న దృశ్యం

* సేలం ప్రాంతానికి చెందిన ఆర్మీ జవాను కనకరాజ్‌ తన అనుభవాన్ని చెన్నైలో పంచుకున్నారు. ప్రమాద సమయంలో తానుంటున్న బోగీ విడిపోయిందన్నారు. ఈ కుదుపుతో చాలామంది విసిరివేయబడ్డారని వెల్లడించారు. కొందరు విడిపోయిన ఇతర కోచ్‌లపై పడ్డారని, వారికి గాయాలయ్యాయని చెప్పారు. ఈ దృశ్యాల్ని చూసి చలించిపోయానని, వెంటనే వారిని కాపాడేందుకు ముందుకెళ్లాలని తెలిపారు. ఓ బిడ్డను కాపాడినట్లు వెల్లడించారు. కోచ్‌ల్లో ఉన్నవారు తొక్కిసలాటకు గురవకుండా పలు జాగ్రత్తలు కూడా చెప్పానన్నారు.

‌*కేరళకు చెందిన ఓ మహిళ ఈ రైలులో వచ్చారు. ఆమె మాట్లాడుతూ.. గాయాలపాలైనవారికి తీవ్రంగా రక్తం కారడం చూశామని తెలిపారు. ఆ గాయాల నుంచి రక్తాన్ని ఆపేందుకు దుప్పట్లను వాడాల్సి వచ్చిందని వివరించారు. చివరికి అవి కూడా ఎర్రటి రక్తం రంగులోకి వచ్చేశాయని, తానెంతో భయపడ్డానని తెలిపారు. ప్రమాద దృశ్యాల్ని టీవీల్లో చూసి ఈ ప్రమాదం నుంచి తాను బయటపడ్డానా అనుకున్నాని వివరించారు.

‌*గాయాలపాలైన మరో వ్యక్తి మాట్లాడుతూ.. ప్రమాద సమయంలో తాను ఎస్‌1లో ఉన్నానని తెలిపారు. పెద్ద శబ్దం రాగానే తన తలకు బలమైన లోహం తగిలినట్లు తీవ్ర నొప్పి కలిగిందన్నారు. ఆ తర్వాత ఓ ఇనుపచువ్వ తన ఛాతి నుంచి వెళ్లిందని ఆవేదన చెందారు. ఇతడ్ని వీల్‌ఛైర్‌పై కూర్చోబెట్టుకుని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

*మురుగన్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ.. కుదుపునకు బోగీ దొర్లి కిందపడిందన్నారు. చాలామందికి గాయాలయ్యాయని, కొందరు కళ్ల ముందే చనిపోయారని ఆవేదనగా చెప్పారు. ప్రమాద సమయంలో అంతా చీకటిగా ఉందని, ఏడుపులు విని తన గుండె తరుక్కుపోయిందని తెలిపారు. ఇదొక భయానక ప్రయాణంగా తాను పేర్కొన్నారు.

‌*తేని జిల్లాకు చెందిన సుకన్య రాధాకృష్ణన్‌ అనే మహిళ మాట్లాడుతూ.. ఈ ప్రమాదాన్ని చూసి తట్టుకోలేకపోయాని అన్నారు. భర్తతో కలిసి కోచ్‌లో పడుకున్న తమకు ప్రమాద సమయంలో తీవ్ర కుదుపులొచ్చాయని తెలిపారు. తన భర్తకు కూడా గాయాలయ్యాయని వివరించారు. సాయం కోసం దిగి పరుగులుపెట్టామని, కానీ తమకంటే ఎక్కువ గాయాలతో, తీవ్ర రక్తంతో ఉన్నవారిని చూసి షాక్‌కు గురయ్యామన్నారు. చాలామంది స్పృహకోల్పోగా, మరింతమంది ఏడుస్తూ కనిపించారన్నారు. ఇప్పటికీ ఆ ఘోరాన్ని మర్చిపోలేకపోతున్నానని వెల్లడించారు.


ఆచూకీ తెలియనివారిపై ఆరా

కోరమాండల్‌ రైలులో చెన్నై వచ్చేందుకు రిజర్వేషన్‌ చేసుకున్నవారిలో ఐదుగురి ఆచూకీ తెలియలేదని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆదివారం సాయంత్రానికి 8 మంది ఆచూకీ తెలియడంలేదని, వారి ఫోన్లు కూడా కలవడంలేదని తెలిపారు. ఆ తర్వాత మరో ముగ్గురి ఆచూకీ దొరికిందని ప్రకటించారు. వారెక్కడున్నారో కూడా తెలీడంలేదని వివరించారు. వారి బంధువులు, మిత్రులు ఎవరైనా టోల్‌ఫ్రీ నంబరు 1070, కంట్రోల్‌ రూం నంబరు 94458 69843కి సంప్రదించాలని కోరింది. కార్తిక్‌ (19), రఘునాథ్‌ (21), మీనా (66), కల్పన (19), అరుణ్‌ (21).. వీరి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.


దగ్గరుండి పర్యవేక్షణ

భువనేశ్వర్‌లోని కంట్రోల్‌ రూంలో...

చెన్నై, న్యూస్‌టుడే: రైళ్ల ప్రమాదం గురించి తెలుసుకోగానే.. తమిళనాడు నుంచి ప్రత్యేక బృందాన్ని ఒడిశాకు పంపింది రాష్ట్ర ప్రభుత్వం. క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్‌ నేతృత్వంలో ఆ బృందం అక్కడ పర్యటించింది. శనివారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో ఉదయనిధి భేటీ అయ్యారు. తమిళనాడు ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు, వారి ఆచూకీ కోసం కావాల్సిన సహాయం తదితరాల్ని ఆయన ముందుంచారు. భువనేశ్వర్‌లోని ఒడిశా ప్రత్యేక సహాయక చర్యల కమిషనరు కార్యాలయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ జనతో భేటీ అయ్యారు. రైలు ప్రమాద క్షతగాత్రులు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు, డిశ్చార్జైనవారి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత బాధితుల్ని పరామర్శించారు. తమిళనాడువాసులు సురక్షితంగా వెనుదిరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఉదయనిధి వెల్లడించారు. ప్రత్యేక రైలులో అక్కడివారు చెన్నై రావడంతో మంత్రులు ఉదయనిధి, శివశంకర్‌ తదితరులు తిరిగొచ్చారు. కొంతమంది అధికారుల్ని భువనేశ్వర్‌లోనే ఉంచారు. ఆదివారం సాయంత్రం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో ఈ ఇరువురు మంత్రులు సమావేశమై అక్కడి పరిస్థితిని వివరించారు.

*137 మంది రాక

రాజీవ్‌గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

రైళ్ల ప్రమాదంలో చిక్కుకున్నవారిలో రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల్లో 137 మంది ఆదివారం ప్రత్యేక రైలులో చెన్నై చేరుకున్నారు. తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రత్యేక రైలు సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌కు చేరిన వెంటనే మంత్రులు కేకేఎస్‌ఎస్‌ఆర్‌ రామచంద్రన్‌, సుబ్రమణియన్‌, రెవెన్యూ పరిపాలన కమిషనరు ఎస్కే ప్రభాకర్‌, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి గగన్‌దీప్‌ సింగ్‌ బేడి, వైద్య సిబ్బంది రైలు పెట్టెలు వద్దకు వెళ్లారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టు వారిని వీల్‌ ఛైర్‌, స్ట్రెచ్చర్‌ ద్వారా ప్లాట్‌ఫారం నుంచి తీసుకెళ్లారు. 36 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి వారిలో 34 మందిని రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ముగ్గురు ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ కాగా మిగతావారు చికిత్సలు తర్వాత ఇళ్లకు వెళ్లిపోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన కుమారుడిని చూడటానికి అనుమతించాలంటూ ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో నిలబడి కన్నీటిపర్యంతం కావడం పలువురి హృదాయలను కదిలించింది. ఒడిశా నుంచి వచ్చినవారికి వైద్యపరీక్షలు, చికిత్సలు కోసం 30 వైద్య బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్వస్థలాలకు తరలించడానికి రాష్ట్ర రవాణా సంస్థకు ద్వారా 7 బస్సులు, పోలీసుశాఖ ద్వారా 50 టాక్సీలు సిద్ధం చేశారు. అదనంగా 10 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని