logo

విద్యుత్తు ఛార్జీల పెంపు తగదు: అన్బుమణి

రాష్ట్రంలో వచ్చే నెల నుంచి విద్యుత్తు ఛార్జీలు పెంచేందుకు విద్యుత్తు బోర్డు నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు దిగ్భ్రాంతి కలిగించాయని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Updated : 05 Jun 2023 05:12 IST

సైదాపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వచ్చే నెల నుంచి విద్యుత్తు ఛార్జీలు పెంచేందుకు విద్యుత్తు బోర్డు నిర్ణయించినట్లు వచ్చిన వార్తలు దిగ్భ్రాంతి కలిగించాయని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్‌ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. తమిళనాడులో వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా రుసుము పెంచేందుకు విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతి ఇచ్చినందున వచ్చే నెల నుంచి రుసుము పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిసిందన్నారు. 10 నెలల్లో మళ్లీ పెంపు ప్రజలపై భారం మోపడమేనన్నారు. సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఇప్పటికే పలు పరిశ్రమలు మూతపడ్డాయని, పవర్‌ లూమ్‌ యజమానులు కూడా వృత్తి నుంచే వైదొలిగారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ పెరిగితే చిన్న వ్యాపారులు కోలుకోలేరని తెలిపారు. రాష్ట్రంలో 90 శాతం ప్రజల ఆదాయం ఏడాదికి 2 శాతం కూడా పెరగడంలేదని, అలాంటివారు 4.70 శాతం విద్యుత్తు ఛార్జీల పెంపును ఎలా భరిస్తారని ప్రశ్నించారు. కావున పెంపు నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.


చిన్న తప్పులకు పోలీసులను శిక్షించరాదు: రామదాస్‌

సైదాపేట, న్యూస్‌టుడే: చిన్న చిన్న తప్పులకు పోలీసులను శిక్షించరాదని పీఎంకే వ్యవస్థాపకులు రామదాస్‌ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు. విధుల్లో చేసే చిన్న తప్పులకు పోలీసులకు శాఖాపరమైన శిక్షలు విధిస్తారని తెలిపారు. 2016 వరకు ఇలాంటి శిక్షలకు గురయ్యేవారు శాఖాపరమైన రిజర్వేషన్‌ కింద సబ్‌ఇన్స్‌పెక్టర్‌ పోస్టులకు పోటీపడవచ్చని పేర్కొన్నారు. అయితే 2016 తర్వాత 3ఏ, 3బీ విభాగాల కింద శిక్షకు గురైనవారు ఎస్సై పోస్టులకు పోటీపడేందుకు నిషేధం విధించారన్నారు. ఈ నిషేధాన్ని తొలగించాలని పోలీసులు చేసిన వినతిపై పోలీసుశాఖ ప్రధాన డైరెక్టరేట్‌ కార్యాలయం రెండేళ్లుగా విచారణ జరిపి కూడా తీర్పు ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు. దీంతో పోలీసులు నష్టపోతున్నారని చెప్పారు. 2021 అసెంబ్లీ ఎన్నికల సమయంలో పోలీసులకు ఇచ్చిన శాఖాపరమైన చిన్న శిక్షలు రద్దు చేసి వారికి సకాలంలో పదోన్నతులు ఇస్తామని డీఎంకే ఎన్నికల హామీ ఇచ్చిందన్నారు. అయితే ఇంతవరకు ఈ హామీ నెరవేర్చలేదన్నారు. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుకు దరఖాస్తు చేసేందుకు ఈనెల 30 చివరి తేదీ అని తెలిపారు. కావున వేల మంది పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని శాఖాపరమైన చిన్న శిక్షలు రద్దు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


వ్యాపారవేత్తలకు పన్ను తగ్గించి లబ్ధి డీఎంకే నేతలు మాట్లాడుకున్న ఆడియో వైరల్‌

సైదాపేట, న్యూస్‌టుడే: సేలం జిల్లా మేటూర్‌ మున్సిపాలిటీలో పేరున్న పారిశ్రామికవేత్తలకు పన్ను తగ్గించి డీఎంకే నిర్వాహకులు మున్సిపాలిటీకి నష్టం కల్పించినట్లు సమాచారం. అదే సమయంలో ఆ పారిశ్రామికవేత్తల వల్ల డీఎంకే నిర్వాహకులు లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీఎంకే నిర్వాహకులు మాట్లాడుకున్నట్లు చెబుతున్న ఆడియో విడుదలవడం కలకలం రేపింది. సేలం జిల్లా మేటూరులోని మేటూర్‌ స్పిన్నింగ్‌ మిల్లు 1999 నుంచి 2022 వరకు రూ.3,35,99,599 పన్ను బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పన్ను వసూలు చేసేందుకు మున్సిపాలిటీ తరఫున కోర్టులో కేసు వేశారు. మేటూరు నగర పరిపాలక సంస్థ అధ్యక్షుడు చంద్ర, ఉపాధ్యక్షుడు, డీఎంకే నగర కార్యదర్శి కాశీవిశ్వనాథన్‌ తదితరులు మున్సిపల్‌ కమిషనర్‌ అనుమతి లేకుండా రూ.1,61,27,806 పన్ను తగ్గించి కట్టేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు మిల్లు యజమాని దగ్గర నుంచి రూ.60 లక్షలు లంచం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి డీఎంకే నిర్వాహకులే మాట్లాడుకుంటున్నట్లు విడుదలైన ఆడియో కలకలం రేపింది. పన్నులు సక్రమంగా వసూలు చేసి పురపాలికను అభివృద్ధి చేయాల్సిన వారే ఈ విధంగా ఆదాయ మార్గాలు వెతుక్కోవడం దారుణమని పలువురు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని